Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేటీఆర్‌వి చవకబారు రాజకీయాలు

కేటీఆర్‌వి చవకబారు రాజకీయాలు

- Advertisement -

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం
కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం.. : పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

నవతెలంగాణ-కంఠేశ్వర్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని, అవి మానుకోవాలని పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా కేటీఆర్‌ తరచూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టారన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదని, ఆ పార్టీని భవిష్యత్‌లోనూ ఆదరించే పరిస్థితి లేదని అన్నారు. కుటుంబ తగాదాలను పరిష్కరించుకోలేని కేటీఆర్‌ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన పనులపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో రూ.380 కోట్లతో టెంపుల్‌ కారిడార్‌ రోడ్డు కోసం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.

టెంపుల్‌ కారిడార్‌ నిర్మాణం అయితే ఆలయాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆర్వోబీల నిర్మాణం పనుల విషయంలో రాష్ట్ర నిధులే కాదు.. కేంద్ర నిధులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నిజామాబాద్‌ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పామాయిల్‌ ఇండిస్టీ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజల 35 ఏండ్ల కల అయిన ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటును నెరవేర్చామని చెప్పారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేయడం సంతోషకరమని చెప్పారు. రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా దోచుకుందని కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అయితే.. గత పదేండ్లలో తెలంగాణాను దోచుకున్న ముఠాలో కవిత సభ్యురాలు కాదా? చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -