ఆ గ్రామంలో నేటికీ భూస్వామ్య రాచరికపు ఆనవాళ్లు
పెత్తందారుల ఊచకోతలో
నలిగిపోతున్న బడుగు జీవులు
30 ఏండ్ల్లుగా దాడులు..
ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ
పోలీసులది ప్రేక్షక పాత్రే
చిన్నారి హత్యతో బయటికొస్తున్న దారుణాలు
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
భూస్వామ్య పెత్తందారుల వ్యవస్ధ ఇంకెక్కడుంది.. ఎప్పుడో పోయింది అనే వారికి కుమ్మెర గ్రామంలో వెళ్లూనుకొని ఉన్న రాచరికపు ఆనవాళ్లు నేటికీ సజీవంగా కనిపిస్తున్నాయి. ఎదురు ప్రశ్నించినా.. పని చెబితే వినకపోయినా.. నోరు లేని మూగజీవాలు వారి చేలల్లోకి పోయినా.. పెత్తందారుల క్రూరత్వాన్ని బడుగు జీవులు చవిచూడాల్సిందే. పేదింటి ఆడబిడ్డలు ఒంటరిగా ఉంటే చాలు అభం శుభం తెలియని వారి జీవితాలను నాశనం చేస్తున్న దాఖలాలు ఇప్పటికీ ఉన్నాయి. నోరెత్తి ఇదేంటి అని అడగటానికి వీల్లేదు. నోర్మూసుకొని పనిచేసుకోవడమే. నాగర్‌కర్నూల్ జిల్లాకు కూత వేటు దూరంలో ఉన్న కుమ్మెర గ్రామంలో 30 ఏండ్లుగా పెత్తందారులు చేస్తున్న అకృత్యాలు తాజాగా చిన్నారి హత్యతో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. వీరి ఆగడాలను అరికట్టాలని పోలీసులను ఆశ్రయిస్తే.. బాధితులపైనే తిరిగి కేసు పెడుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
30 ఏండ్ల క్రితం కుమ్మెర గ్రామానికి చెందిన కుర్వ బాలయ్యకు చెందిన గొర్రెలు మేత కోసం బీడు భూముల్లోకి పోయాయి. అదే గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి చెలకలోకి గొర్రెలు పోయాయని గొర్రెల కాపరి బాలయ్యను చెలక నుంచి ఇంటి వరకు తన్నుకుంటూ వచ్చి గడీల ఇంట్లో వేసి తాళం వేశారు. ఇందులో మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కలిసి చిత్ర హింసలకు గురిచేశారు. నోట్లో నుంచి రక్తం వచ్చి స్పృహ కోల్పోయేదాక కొట్టారని బాధితులు వాపోయారు. ఇంత ఘోరం జరిగినా ఆగ్రామంలో ఎవరూ పట్టించుకోలేదు. మాట్లాడలేదు. ఏఒక్క ప్రజాప్రతినిధి అడిగిన పాపాన పోలేదు. పోలీసులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కుర్వ బీర్ల బాలయ్య అనే వ్యక్తి పశువులు శ్రీనివాస్‌రెడ్డి చేలో పడ్డాయని బాలయ్యపై దాడికి పాల్పడ్డారు. అక్కడే కర్రతో దాడి చేయడంతో బాలయ్య చెయ్యి విరిగింది. ట్రాన్స్‌ఫారమ్‌కు అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కారణం చూపి ఈ దాడికి పాల్పడ్డట్టు తర్వాత తెలిసింది. ఒక కుర్వ సామాజిక తరగతికి చెందిన అమ్మాయి.. పొలంలో ఉన్న తన అన్న, తండ్రి దగ్గరకు చద్ది తీసుకుని పోతుంటే అదేదారిలో కల్వర్టు దగ్గర మద్యం సేవిస్తున్న పెత్తందారీ పిల్లలు.. అమ్మాయి కంట పడగానే కల్వర్టు కింద ఉండే గూనలకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే విషయంపై ఆందోళన చేసిన ప్రజా సంఘాలపైనే కేసులు పెట్టారంటే పోలీసులు పెత్తందారులకు ఎలా సహకరిస్తున్నారో తెలుస్తోంది.
తాజాగా కుమ్మెర జాతర సందర్భంగా ఓ దళిత అమ్మాయి దేవుడి దగ్గరకు పోదామనుకున్న క్రమంలో అడిగిన డబ్బులను తానివ్వలేను అన్న కారణంగా పెత్తందారులు దాడులు చేశారు. శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో 9 మంది మౌనిక, ఆమె భర్త గణేష్‌పై దాడి చేసి వారి రెండు నెలల కూతురును తన్ని కాలితో విసిరేశారు. దాంతో చిన్నారి గుక్క పడి చనిపోయింది. మౌనిక అన్న గణేష్‌ను చితక బాదడంతో అతను అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న సీపీఐ(ఎం), ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. వారం రోజులయినా ఇప్పటికీ దోషులను పోలీసులు అరెస్టు చేయకపోవడం పట్ల రాజకీయ పార్టీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పెత్తందారులకు గుడికి సంబందం ఏంటి?
కుమ్మెర గట్టు అనేది పూర్తిగా ప్రభుత్వ గైరాన్ భూమిలో ఉంది. ఆగుట్టపై పెత్తందారులకు ఎటువంటి సంబందం లేదు. ప్రధానంగా కుమ్మెర గట్టు పైకి పోయే సందర్భంగా ఉండే మల్లయ్య పూర్తిగా యాదవులకు సంబందించిన దేవుడు. ఇంట్లో ఉన్న మల్లయ్య దేవుడిని జాతర ముందు గుడికి తీసుకొస్తారు. జాతర పూర్తికాగానే తిరిగి ఇంట్లోకి తీసుకెళ్తారు. గుడికి, గుట్టుకు, దేవుడికి ఎటువంటి సంబంధం లేని పెత్తందారులు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారో అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలు పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ నియంత్రణలో జాతర నిర్వహించాలి
ప్రభుత్వ స్థలంలో ఉండే ఈ జాతర ప్రభుత్వ నిబంధనల మేరకు జరగాలి. పెత్తందారుల పెత్తనం లేకుండా చూడాలి. ఈఓను ఏర్పాటు చేసి నియంత్రణ చేయాలి. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ జాతర ముమ్మాటికీ బీసీలు, ఎస్సీలకే చెందుతుంది. వీరికి ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలి.
-వర్థం పర్వతాలు, సీపీఐ(ఎం) నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి
జాతర పారదర్శకత ఉండేలా నిర్వహించాలి
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో జరిగే జాతర ఎవరికీ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా జరగాలి. ప్రధానంగా ఎస్సీ, బీసీలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలి. మౌనిక కుటుంభాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితురాలికి ఉద్యోగంతో పాటు రూ.25 లక్షలు పరిహారం, ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలి.
-వార్ల వెంకటయ్య, సర్పంచ్, సీపీఐ రాష్ట్ర నాయకులు



