సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి గురవుతూ అట్టడుగు పొరల్లో జీవిస్తున్న దళితుల జీవితాల్లో డెబ్బయి ఎనిమిదేండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. నేటికీ కులవివక్ష, అంటరానితనం పల్లెల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా నిరాటంకంగా కొనసాగుతోంది. దౌర్జన్యాలు, దాడులు, సాంఘిక బహిష్కరణలు, కుల దురహంకార హత్యలు ప్రతిరోజూ ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. సమాజాభివృద్ధికి తమ శ్రమను ధారపోస్తున్న దళితులు సంపదలో, సహజ వనరుల్లో సమ న్యాయాన్ని పొందలేకపోవడమే దీనికి కారణం. ఆకలిని భరిస్తూ, అవమానాల్ని దింగమింగుతూ దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న దుస్థితి. విద్యా, వైద్యం, ఉపాధి వారికి అందని ద్రాక్షే. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలతో ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లు కోల్పోతు న్నారు. దళిత సంఘాలు ఉపకులాలవారీగా అనేక చీలికలు, పేలికలై రిజర్వేషన్ల అనుకూల, వ్యతిరేక విషయాల చుట్టూ కొన్ని పరిమిత లక్ష్యాల కోసం కృషి చేస్తున్నాయి. ఆ తరుణంలో దళితు లందరినీ సంఘటితం చేయడం, కులవివక్ష, అంటరాని తనానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయాన్ని సాధించాలనే సంకల్పంతో ఓ చారిత్రక అవసరం గా 1998 అక్టోబర్ 2న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆవిర్భవించింది. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే విశాల లక్ష్యాల సాధనకు కృషి చేస్తూ నేటికి 28 వసంతాల ఒడిలోకి చేరింది.
కుల వివక్షపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో నాడు సుమారు మూడువేల గ్రామాల్లో వందలాదిమంది కార్యకర్తలతో సర్వేలు నిర్వహించింది. కులవివక్ష రూపాలను గుర్తించడం, సమస్యలను వెలికి తీయడం, వాటి నిర్మూలనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కేవీపీఎస్ దశలవారి పోరాటాలు నిర్వహించింది. దళితులను అభ్యుదయ శక్తులను ఐక్యం చేసి కులవివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటనా పోరాటాలు నిర్వహించింది. కేవలం కులవివక్షనే కాక అంటరానితనం, ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా వాటికి వ్యతిరేకంగా కేవీపీఎస్ పోరాడింది. కుల నిర్మూలన జరగాలని భావించే ప్రతి ఒక్కరినీ కేవీపీఎస్ ఆహ్వానిస్తుంది. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కుల వివక్ష నిర్మూలనకు కలిసి రావాలని కోరుతుంది.ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో మతంతో సంబంధం లేకుండా దళితులందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాడుతుంది. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తుంది. అనేక ఆదర్శ వివాహాలు జరిపించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంది.
28 ఏండ్ల కిందట… ‘ఇప్పుడు కులవివక్ష ఇంకెక్కడుంది, అందరూ కలిసి తిరుగుతున్నారు, కలిసి తింటున్నారు, ఆర్టీసీ బస్సుల్లో సినిమా హాళ్లలో, హోటళ్లలో కలిసి కూర్చుంటు న్నారు కదా. ఇంకా కుల వివక్ష ఎక్కడుంది, కేవీపీఎస్ కులాల మధ్య కొత్త పంచాయితీ పెట్టడానికి బయలు దేరిందా? ఇప్పుడు దాని అవసరం ఏముంది?” అని చాలామంది వాదనలకు దిగారు. కానీ కేవీపీఎస్ సర్వేల్లో వెళ్లడైన ఆ వాస్తవాలు ఆ వాదనలను, భ్రమలను బద్ధలుకొట్టాయి. ఊరుమ్మడి బావుల్లో నీళ్లు తోడుకొనియకపోవడం, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి వంటి వివక్షలు ఇంకా ఎంత బలంగా కొనసాగుతున్నాయో కేవీపీఎస్ నిరూపించింది. నేటికీ దళితులకు క్షవరం చేయరు. బట్టలుతకరు. రచ్చబండలపై కూర్చొనివ్వరు. అగ్రకులాల వీధుల్లోకి రానివ్వరు. అగ్రకులస్తులు ఎదురొస్తే తలవంచి నమస్కరించాలి, దండం పెట్టాలి. పండగలు ఉత్సవాల్లో కూడా వివక్షే. దసరా పండుగ రోజమ్మి ఆకు ముందు తీసుకుంటే భౌతికదాడులు చేస్తారు. బోనాలు చివరికి తీసుకెళ్లాలి, బోనం బయటనే చెల్లించుకోవాలి. గుడిలోకి రానీయరు, బతుకమ్మలాడనివ్వరు.
ఎస్సీ డ్వాక్రా గ్రూపు వాళ్లు మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో వండితే పెత్తందారుల పిల్లలు తినరు. ఎస్సీలకు కాష్టం దగ్గర కూడా వివక్షే. శ్మశాన స్థలం ఉండదు. ఇతర కులాల వారిని పెట్టే చోట దళితుల శవాలను పూడ్చుకొనివ్వరు. ఇటువంటి కులవివక్ష , అంటరానితనంపై కెేవీపీఎస్ దశల వారి పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని పోరాడింది. పోలీసు నిర్బంధాలను ఎదురించి ప్రజల్ని సమీకరించింది. పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టింది. ప్రజా ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ రాష్ట్రమంతటా తిరిగి కేవీపీఎస్ గుర్తించిన 62 కుల వివక్ష రూపాలను గుర్తించింది, ధృవీకరించింది. ఆ వెలుగులో ఎస్సీ,ఎస్టీ కమిషన్ సాధించిన ఘనత కేవీపీఎస్‌కే దక్కుతుంది. వివక్ష రూపాలను గుర్తించిన జస్టిస్ పున్నయ్య కమిషన్ ప్రభుత్వానికి 105 సిఫారసులు చేసింది. 17 రకాల జీవోలు సాధించడమే కాకుండా కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని నిధులు కేటాయించాలని అడుగడుగునా కేవీపీఎస్ పోరాడి విజయం సాధించింది.
అంబేద్కర్ మహారాష్ట్రలోని మహద్ పట్టణం చౌదారు మంచినీళ్ల చెరువు పోరాట స్ఫూర్తితో, నాసిక్ కాలారాం దేవాలయ ప్రవేశం సాగిన పోరాటాల వలె నాటి కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి రాఘవులు, నాటి రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీల నాయకత్వంలో 2007లో రంగారెడ్డి జిల్లాలో 20మండలాలు 152 గ్రామాల్లో 14 రోజులు 1200 కిలోమీటర్ల సామాజిక చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించింది. 69 గ్రామాల్లో అనేక రూపాల్లో కొనసాగుతున్న కుల వివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటనా పోరాటాలు జరిగాయి. 2008లో భావసారుప్యత కలిగిన సంఘాల ఆధ్వర్యంలో భారీఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహించింది. 78 సంఘాలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 813 సంఘాలు రాష్ట్ర జాతాల్లో పాల్గొన్నాయి. నాడు ఖమ్మం జిల్లాలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సైకిల్‌యాత్ర 76 రోజులపాటు 2500 కిలోమీటర్ల మేర 46 మండలాలు 521 గ్రామాల్లో సాగింది.
ఈ 28 ఏండ్లలో దళితులపై జరిగిన అనేక దాడులు, హత్యలు, లైంగికదాడులకు వ్యతిరేకంగా కేవీపీఎస్ ప్రత్యక్షంగా పోరాడింది, పోరాడుతూనే ఉంది.దళితులు చనిపోతే కనీసం తమ శవాలను పూడ్చుకునే ఆరడుగుల స్థలం లేని పరిస్థితిలో నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గ్రామాల్లో ప్రతి దళితవాడకు శ్మశానస్థలం ప్రభుత్వమే కేటాయించాలని కోరుతూ శవపేటిక లతో దశల వారి పోరాటాలు నిర్వహించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ దళితులపై దాడులు, దౌర్జన్యాలు, లైంగికదాడులు ఆగలేదు సరికదా మరింతగా పెరిగాయి. వాటిపై కేవీపీఎస్ నికరంగా పోరాడుతూనే ఉంది.కేంద్రంలో బీజేపీ సర్కార్ ఈ పన్నెండేండ్ల కాలంలో దళితులకు ద్రోహం చేసే అనేక చర్యలకు ఒడికట్టింది. రాజ్యాంగ సమీక్ష పేరిట రద్దుకు కుట్రలు చేసింది. రిజర్వేషన్లు తొలగించడానికి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తోంది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని రద్దు చేసింది, బడ్జెట్లో నిధులు తగ్గించింది. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై పశువుల కంటే నీచంగా చూస్తున్న పరిస్థితి ఉంది. లైంగికదాడులు, హత్యలు, హింస పెచ్చరిల్లుతోంది. గత ఐదేండ్లకాలంలో ఎన్‌సిఆర్‌బి రిపోర్టు ప్రకారం దళితులపై 6,36,486 దాడులు జరిగాయి. ఇందులో సగానికి పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగాయి. ఒక గంటకు 15 దాడులు, మహిళలపై నెలకు 15వేల లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారుని సిద్దిపేట జిల్లా కోర్టులో ఇద్దరు అగ్రకుల పెత్తందారులకు చెందిన లాయర్లు ”కనకనపు సింహాసమున శునకమును కూర్చుండ బెట్టి” అంటూ సామాజిక మాధ్యమాల్లో కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు సైతం అవమానాలు భరించాల్సిరావ డం దారుణం. దీన్ని బట్టి సాధారణ దళిత గిరిజన ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నడుపుతోంది కేవీపీఎస్.
ప్రత్యేకించి నేడు కేవీపీఎస్ 28 ఏండ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అక్టోబర్ 2 నుండి 8 వరకు సామాజిక ఉద్యమ ప్రస్థాన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. భవిష్యత్తులో రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ల పరిరక్షణ, ప్రభుత్వ రంగసంస్థలను కాపాడుకోవడానికి, సామాజిక న్యాయం సాధించడానికి, సామాజిక అభ్యుదయ లౌకిక శక్తులతో కేవీపీఎస్ కలిసి పనిచేస్తుంది.ఆ లక్ష్యాల సాధనకు ముందుకు సాగుతుంది. సామాజిక ఉద్యమాల్లో సమరశీలంగా పోరాడుతూ ప్రత్యామ్నాయ విధానాలు, దళితుల సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం పాలకవర్గాలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుంది.
(నేడు కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం)
టి. స్కైలాబ్‌బాబు
9177549646