– టియూసీఐ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ
– కమ్మర్ పల్లిలో లేబర్ కోడ్స్ ప్రతుల దగ్దం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని, వాటిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయొద్దని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు సత్తెమ్మ డిమాండ్ చేశారు.
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై లేబర్ కోడ్స్ ప్రతులను దగ్దం చేశారు. ఈ సందర్భంగా సత్తెమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభలో లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి పరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ ఈ నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టదాయకమన్నారు.
కార్మికుల శ్రమ దోపిడీ చేయడం కోసం బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం కోసమే ఈ లేబర్ కోడ్స్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మికులు ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా ఆమె అభివర్ణించారు. దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్స్ ప్రతులను దగ్దం చేసి నిరసన తెలపాలని కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టియుసిఐ నాయకులు ఆనంద్, ఖాదర్, లక్ష్మి, జనార్దన్, వి.లక్ష్మీ, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, తదితరులు పాల్గొన్నారు.


