– మీడియా స్వేచ్ఛను నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం
– జర్నలిస్టులు చైతన్యమై పోరాడాలి : ఎస్వీకే వెబినార్‌లో మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించడం కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లను తెచ్చిందని తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘లేబర్ కోడ్‌ల వల్ల మీడియా స్వేచ్ఛకు ప్రమాదమా’ అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో మంగళవారం వెబినార్‌ను నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29 చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చిందని చెప్పారు. ఇందులో వర్కింగ్ జర్నలిస్ట్స్ అండ్ అదర్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ (కండిషన్స్ ఆఫ్ సర్వీస్) అండ్ మిస్‌లెనియస్ ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్-1955, వర్కింగ్ జర్నలిస్ట్ (ఫిక్సేషన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ వేజెస్) ఆఫ్ యాక్ట్- 1958 చట్టాలను కూడా రద్దు చేసిందని వివరించారు. శాసనవ్యవస్థ, బ్యూరో క్రసీ, న్యాయవ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని చెప్పారు. ఫోర్త్ ఎస్టేట్‌గా ఉండే మీడియా ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తున్నదనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాస్తవాలను ప్రచురిస్తు న్నదనీ, ప్రసారం చేస్తున్నదని వివరించారు. ఇది మోడీ ప్రభుత్వానికి కంటగింపుగా మారిందన్నారు. అందుకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ని కేంద్రం నిర్వీర్యం చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వారిని పీసీఐ చైర్మెన్‌గా నియమిస్తున్నదని అన్నారు. మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. వర్కింగ్ జర్నలిస్టులను నిర్వీర్యం చేసేందుకే పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసిందని వివరించారు. పత్రికా స్వేచ్ఛ లేని దేశాల్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. భారత్‌లోనూ పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికే ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి హక్కుల్లేకుండా చేసిందని అన్నారు. సాధారణ కార్మికులకు ఉండే హక్కులే వారికీ ఉండేలా చేసిందన్నారు. పథకం ప్రకారం ఫోర్త్ ఎస్టేట్‌ను నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్రాతినిధ్యం లేకుండా 15వ ప్రెస్ కౌన్సిల్‌ను మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. అందులో భాగంగానే లేబర్ కోడ్‌లను తెచ్చిందన్నారు. వాటివల్ల కార్పొరేట్ మీడియా సంస్థలకే ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మీడియా మోడీ ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసేలా వ్యవహరించిందనీ, అందులో భాగంగానే కార్పొరేట్లు మీడియా సంస్థలను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల సమస్యలు సమాజానికి తెలియకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకుండా చేస్తున్నాయని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు గతంలో ఎలాంటి చట్టాల్లేవని చెప్పారు. ఇప్పుడు ప్రింట్ మీడియాతోపాటు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు చోటు కల్పించారని వివరించారు. మజీతియా వేజ్‌బోర్డు సిఫారసులు 30 శాతంలోపే అమలయ్యాయంటూ పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. సోషల్ మీడియా వచ్చాక విపరీత ధోరణులు పెరిగాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు చైతన్యవంతమై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నవతెలంగాణ బ్యూరో చీఫ్ బీవీఎన్ పద్మరాజు సమన్వయకర్తగా వ్యవహరించారు.
కార్పొరేట్ల కోసమే లేబర్ కోడ్‌లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



