చారిత్రక చికాగో కార్మికుల పోరాట నేపథ్యం పీడిత ప్రజలకు ఊపిరిలూదింది.139 సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పనిదినం కోసం ఎంతోమంది కార్మికులు ప్రాణత్యాగం చేశారు. ఫలితంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎనిమిది గంటల్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించింది. అయితే పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక హక్కులను కాలరాసేందుకు పాలకవర్గాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. నాటి నుంచి అన్నిదేశాల్లోలాగే మనదేశంలోనూ శ్రామికవర్గం మెరుగైన జీవనానికి అనేక పోరాటాలు చేస్తూనే ఉంది. వివిధ వృత్తుల శ్రామిక ప్రజానీకం తమ హక్కుల కోసం, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది.
ఇప్పటివరకు కార్మికులకు ఎంతో కొంత మెరుగ్గా ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి వాటిస్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నాలుగు లేబర్ కోడ్‌ల అమలు ఆయా రాష్ట్రాల ఇష్టానికి వదిలి గెజిట్ విడుదల చేసింది. 2024 ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో బీజేపీ కూటమి ప్రభుత్వాలు కొత్తగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేస్తున్నాయి. ఈ నాలుగు లేబర్ కోడ్‌లలో భాగంగా పది నుంచి పన్నెండు గంటల పని దినాలు అమలు జరిపేందుకు ఇటీవల కర్నాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు మేరకు కనీస పని దినం తొమ్మిది నుంచి పది గంటలుగా నిర్ణయించింది. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి కూడా ఈ సవరణ అనుమతిస్తున్నది. చట్ట రూపంలో అమలు అయితే ఓవర్ టైం కూడా 75 గంటల నుండి 144 గంటల వరకు ఉండే అవకాశముంది. ప్రభుత్వం మహిళలకు సమాన అవకాశాల పేరిట రాత్రి పూట పనిచేయడానికి చేసే సవరణ వల్ల, అందుకు అంగీకరించని మహిళల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడనుంది. ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ ప్రభుత్వం సైతం అధిక పని గంటలు అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వాణిజ్య సంస్థల కార్మికులు ఉద్యోగులు రోజుకు పదిగంటలు పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే వారానికి 48 గంటలకన్నా ఎక్కువ పనిచేయడానికి వీల్లేదని అంతకు మించి పనిచేస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలని కార్మికశాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ, ఓవర్ టైం పనిచేయడానికి పరిస్థితులు సహకరించని వాళ్లను పనినుంచి తొలగించే అవకాశాలు ఏర్పడతాయి. యాజమాన్యాలు తమ అధిక లాభాల కోసం ఓవర్ టైం చేయాలని కార్మికులు, ఉద్యోగుల మీద ఒత్తిడి చేసే అధికారం నూతన లేబర్ కోడ్‌లతో ఏర్పడుతుంది.
2020 పారిశ్రామిక సంబంధాల నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికుల హక్కులు ప్రమాదంలో పడతాయి. ఈకొత్త చట్టాల ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. వంద మంది కంటే తక్కువ కార్మికులు పనిచేస్తున్న సంస్థల నుండి వారిని తొలగించడం యాజమాన్యాలకు సులభతరం అవుతుంది. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం క్లిష్టంగా తయారవుతుంది. పదిమంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య సంక్షేమం వంటి హక్కులు కోల్పోతారు. నాలుగో లేబర్ కోడ్ అమలు ద్వారా కార్మికులకు ఈఎస్‌ఐ, పిఎఫ్, గ్రాట్యూటి రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం వంటి రకరకాల పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈ విధానం కొనసాగుతున్నది. ఏండ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా దిగజారిపోతాయి.
యేటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలకు భారీగా కోత విధించింది. భారత రైల్వేలో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులకు పని భారం పెంచింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల్ని కుదించింది. 2018లో 5,52,428 ఉద్యోగులుండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 3,41,313కు తగ్గింది. ఈ పరిస్థితి వల్ల బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల్లో పని ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అధిక పని గంటల భారం మోపడం ద్వారా కార్మికులు, వివిధ రంగాల వృత్తి నిపుణులు, ఉద్యోగుల జీవితాలను కార్పొరేట్ సంస్థల అధిక లాభాలకు బలిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.లాభసాటిగా ఉన్న జీవిత బీమా సంస్థలో అదానీ గ్రూప్‌నకు వాటాలు కట్టబెట్టింది. కీలకమైన రైల్వే ఇతర ప్రజా రవాణా సంస్థల్లోకి పాక్షిక ప్రయివేటీకరణ చేసింది. ప్రజాధనాన్ని ప్రజల ప్రయోజనాలకే వినియోగించాలనే లక్ష్యంతో 1969లో ఏర్పడిన ప్రభుత్వ బ్యాంకులను నూతన ఆర్థిక విధానాల పేర్లతో గాడి తప్పించింది. దాదాపు 49 శాతం షేర్లు అమ్మేసింది. కొద్ది మందికి పెద్ద మొత్తం రుణాలివ్వడం ద్వారా తక్కువ సిబ్బందితో ఎక్కువ వ్యాపారం చేయవచ్చంటూ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రుణాలు కట్టబెట్టింది. ఫలితంగా గత ఆరేడేండ్లలో 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ సంస్థల రుణాలను పాత బకాయిల (నిరర్థక ఆస్తులు) పేరుతో మాఫీ చేసింది. సామాన్యులు రుణాలు చెల్లించకపోతే వారి ఆస్తులు వేలం వేయించే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పట్ల ఎనలేని ప్రేమ చూపిస్తున్నది. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం పేరుతో వాటి విస్తరణ కుదిస్తూ ప్రయివేటు రంగ బ్యాంకుల విస్తరణను ప్రోత్సహిస్తున్నది.
రైతుల బతుకును చిన్నాభిన్నం చేసే మూడు రైతు చట్టాలను రైతాంగం సాగించిన సుదీర్ఘ పోరాటంతో బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఇప్పుడు నాలుగు లేబర్‌కోడ్‌లతో వివిధ రంగాల ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికుల జీవితాలతో చెలగాటమాడెందుకు చూస్తున్నది. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం, పూర్తిగా ప్రయివేటుపరం చేయడం చేసింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ఆపరేషన్ కగార్ పేరు మీద వేలాది మంది సాయుధ బలగాలతో వందలాదిమంది మావోయిస్టులను, ఆదివాసీలను బలిగొంటున్నది. అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గూడేలను ఖాళీ చేయిస్తూ మైనింగ్ కోసం వేలాది ఎకరాల్లో అడవిని నరికివేస్తున్నది. ఈ నిరంకుశ చర్య పర్యావరణానికి ముప్పు తేవడంతో పాటు అడవినే నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీల జీవితాలను, వారి సంస్కృతిని ఛిద్రం చేస్తున్నది.
రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ తహతలాడుతున్నది. సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇరుకునపెట్టే చర్యలకు పాల్పడుతున్నది. రాష్ట్రాలు స్వయం నిర్ణయాధికారం కలిగిన అంశాల్లో కూడా గవర్నర్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నది. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు సముచితంగా అందాల్సిన వాటాను ఇవ్వకుండా నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నది. రాష్ట్రాల అధికారాల్లో వేలు పెడుతూ ఆయ రాష్ట్రాల పాలనా వ్యవహారాలను స్థానిక సంస్థల స్థాయికి కుదించే విధంగా కేంద్రంలో ఎన్డీయే కూటమి వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో వామపక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు జులై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్లకు తాకట్టుపెట్టే ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమ్మెలో పాల్గొనాలి.
జూలకంటి రంగారెడ్డి
9490098349