Sunday, May 11, 2025
Homeరాష్ట్రీయంలేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

- Advertisement -

20న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలి : భవన నిర్మాణ కార్మిక సంఘాల సదస్సులో వక్తల పిలుపు
భవన నిర్మాణ, వలస కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలి
నవతెలంగాణ – ముషీరాబాద్‌

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి.. భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం-1996, వలస కార్మికుల చట్టం – 1979ను పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మే 20న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని కోరారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ, బీఎస్‌ఆర్‌కెఎస్‌, ఎస్‌ఎస్‌ఆర్కేఎస్‌ ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యుఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. కార్మికుల పోరాటాల ఫలితంగా 29 కార్మిక చట్టాలను సాధించుకున్నారని వివరించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక ఈ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని తెలిపారు. కార్మికవర్గానికి గొడ్డలిపెట్టు వంటి నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, వెల్ఫేర్‌ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి కార్మికుల సంక్షేమం కోసమే నిధులు ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం లేబర్‌ కోడ్లను 2019-20లో పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుందని, కానీ కార్మికవర్గం నుంచి బలమైన ప్రతిఘటన ఎదురైన కారణంగా కోడ్లు అమలు చేయలేదని చెప్పారు. ఇప్పటి వరకు నిర్మాణాల పనుల వద్ద ప్రమాదాల్లో గాయపడినా, మరణించినా నష్టపరిహారాలు అందుతున్నాయని అన్నారు. కానీ, లేబర్‌ కోడ్లు అమలైతే 12 అడుగుల ఎత్తు లోపు నిర్మాణాల వద్ద, భవనాల్లో మరమ్మతులు, మార్పులు, చేర్పుల పనులకు, చమురు, గ్యాస్‌ సంస్థల నిర్మాణాల్లో పనిచేసే కార్మికులకు ఈ చట్టం వర్తించదని అన్నారు. సెస్‌ నిధుల వసూళ్లలో మార్పులు చేస్తూ యజమాని చెప్పిన విధంగానే పసూలు చేయాలని, అది కూడా రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల పైబడిన నిర్మాణాల నుండే వసూలు చేయాలని మార్పు చేశారని, 10 మందికి పైన పనిచేసే చోట మాత్రమే చట్టం వర్తిస్తుందని పెట్టారని తెలిపారు. అందవల్ల చట్టాల రక్షణకు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఏఐసీబీసీడబ్ల్యూ డిప్యూటీ సెక్రటరీ ఎం.ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలిచ్చి, ప్రజల మౌలిక ఆస్తులైన రైల్వే, రోడ్లు, రక్షణ, విమానాశ్రయాలు, టెలికాం రంగాలను ప్రయివేట్‌ సంస్థలకు అప్పజెప్పుతోందన్నారు.
భవన నిర్మాణ రంగంలో 100శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి విచ్చలవిడిగా యంత్రాల వాడకానికి అనుమతిచ్చారని, నిర్మాణాల్లో వాడే ముడి సరుకుల ధరలు పెరిగి సామాన్యుల ఇండ్ల నిర్మాణాలు తగ్గిపోయాయన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆర్‌.కోటంరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డులో 26 లక్షల 50 వేల మంది కార్మికుల పేర్లు నమోదయ్యాయని, 15 లక్షల మంది కార్మికులే లైవ్‌లో ఉన్నారని అన్నారు. రూ.6,000 కోట్ల సెస్‌ వసూలైతే కార్మికులకు ఇచ్చింది రూ.1,500 కోట్లు మాత్రమేనన్నారు. ఈ సదస్సులో ఆయా సంఘాల నేతలు పి.నారాయణ, అన్మేష్‌, అనురాధ, కామెల్ల ఐలన్న, ఎస్‌.కుమార్‌, ఆరెళ్లి కృష్ణ, వంగూరు రాములు, జి.రమేష్‌, లక్ష్మీనారాయణ, కె.జంగయ్య, ఎల్క సోమయ్య, ముదాం శ్రీనివాస్‌, టి.లక్ష్మయ్య, గాలన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -