Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయొద్దు

లేబర్‌ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయొద్దు

- Advertisement -

– టీయూడబ్ల్యూజే రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘లేబర్‌ కోడ్‌’లను తెలంగాణలో అమలు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానం చేసింది. లేబర్‌ కోడ్‌లను రద్ధు చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలతోపాటు ఇందిరాపార్క్‌ వద్ద ‘కార్మికులు తలపెట్టనున్న నిరసన గళం’ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని నిర్ణయించింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె విరాహత్‌ అలీ అధ్యక్షతన హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్‌, ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లతో కార్మికులతోపాటు వైట్‌ కాలర్‌ ఉద్యోగులు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ కనీసం కార్మిక సంఘాల నేతలతో చర్చించకుండానే ఈ లేబర్‌కోడ్‌లను అమలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో మీడియా బందీ అయిపోయిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖామమనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. ఏఐబీఈఏ అధ్యక్షులు పివి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్లక్ష్యం చేస్తూ ప్రయివేట్‌ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల విలీనం, ఉద్యోగులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని చెప్పారు. కార్పొరేట్‌ శక్తులతో మోడీ ప్రభుత్వం చేతులు కలిపి బ్యాంకులను ప్రయివేటీకరణ పేరుతో విదేశీ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తున్నదని అన్నారు. ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌డి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్‌ కోడ్‌లతో ‘కంపెనీలకు లాభం, కార్మికులకు నష్టం’అని చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పోరాడే యూనియన్లను లేకుండా చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని విమర్శించారు. శ్రామికులను నష్ట పరిచి పరిశ్రమల యజమానులకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని అన్నారు. టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ లేబర్‌ చట్టాల ద్వారా గిగ్‌ వర్కర్లకు మేలు జరుగుతుందంటూ ప్రధాని మోడీ చెప్పడం హాస్యాస్ప దమన్నారు. ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్‌ పద్మ మాట్లాడుతూ మహిళ ఉద్యోగులు, కార్మికులకు పట్టపగలే రక్షణ లేని పరిస్థితులున్నాయని చెప్పారు. రాత్రి సమయాల్లో కూడా మహిళలు ఉద్యోగం చేసుకొవచ్చనే హక్కు కల్పించడం బాధాకరమని అన్నారు. ఐజేయూ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ జవహర్‌ లాల్‌ నెహ్రు పేరును శాశ్వతంగా రూపుమాపడానికే మోడీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కె రాములు, రాష్ట్ర కార్యదర్శి వి యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ రాజేష్‌, హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్‌గౌడ్‌, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్‌బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాలరాజ్‌, కార్యదర్శి బి వెంకటేశం, ఐఎఫ్‌టీయూ నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -