Saturday, December 20, 2025
E-PAPER
Homeజాతీయంకార్మిక హక్కులు నీరుగార్చే లేబర్‌ కోడ్‌లు

కార్మిక హక్కులు నీరుగార్చే లేబర్‌ కోడ్‌లు

- Advertisement -

సమైక్య ప్రతిఘటనల ద్వారా తిప్పికొట్టాలి: లేబర్‌ కోడ్‌లపై జాతీయ సదస్సులో సీఎం పినరయి విజయన్‌
తిరువనంతపురం :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక విధానాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ఈ విధానాలు, కార్పొరేట్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, కార్మికుల హక్కులను వ్యవస్థాగతంగా బలహీనపరుస్తున్నాయని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్మిక సదస్సులో ముఖ్యమంత్రి విజయన్‌ ప్రసంగించారు. సాంకేతికత, ఉత్పత్తిలో వేగంగా వస్తున్న మార్పులను అభివృద్ధిగా చూపిస్తున్నారని, కానీ ఈ మార్పుల వల్ల నిజంగా ఎవరు లబ్ది పొందుతున్నారనేదే ఇక్కడ నిజమైన ప్రశ్న అని ఆయన అన్నారు. విధానాల వల్ల సామాన్యుల జీవితాలు మెరుగవుతున్నాయా లేక కేవలం కార్పొరేట్‌ లాభాలు మాత్రమే పెరుగుతున్నాయా అన్న అంశాన్ని బట్టి వాటిని నిర్ణయించాల్సి వుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరితో కార్మిక హక్కులు నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోవడానికి, అలాగే సామాజిక సంక్షేమం, ఉపాధి భద్రత నుంచి దృష్టి మళ్ళడానికి దారి తీస్తోందని పినరయి పేర్కొన్నారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా హేతుబద్ధమైన, సంఘటితమైన రీతిలో అ సమ్మతిని వ్యక్తం చేయడం ప్రజాస్వామిక సమాజం బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. ఉపాధి భద్రతను, సామాజిక రక్షణను నిర్లక్ష్యం చేసే అభివృద్ధి నమూనాలు స్థిరంగా కొనసాగలేవని ముఖ్య మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధిని జీవిత ప్రమాణాల్లో మెరు గదల ద్వారా లెక్కించాలని అంతేకానీ ఉత్పత్తి గణాంకాలు లేదా కార్పొరేట్‌ ఆదాయాల ద్వారా కాదని అన్నారు. సంక్షేమ ఆధారిత ఆర్థిక దార్శనికత లోనే కేరళ విధానపర మైన మూలాలు వున్నాయన్నారు.
కార్మిక పోరాటాల చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆయన, కార్మికుల హక్కులనేవి ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలతో వచ్చే బహుమతులు కావని, సుదీర్ఘకాలం పోరాటాలు జరపపడం ద్వారా గెలుచుకున్నవని, స్వాతంత్య్ర ఉద్యమంలో, వ్యవసాయ ఉద్యమాల ఆందోళనల్లో త్యాగాలు చేయడం ద్వారా వచ్చినవని అన్నారు. బాంబే, కోల్‌కతా, కాన్పూర్‌, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో, కేరళలో కార్మిక ఉద్యమాలు వలసవాద వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించాయన్నారు. రాజకీయ చైతన్యాలకు రూపునివ్వడం లో సాయపడ్డాయన్నారు.
స్వాతంత్య్రం అనంతరం రూపొందించిన కార్మిక చట్టాలు రాజ్యాంగం సోషలిస్టు విలువలు, సంక్షేమ దేశం ఆలోచనలను ప్రతిబింబించాయన్నారు. 8గంటల పనిదినం, కనీస వేతనాలు, బోనస్‌, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి నిబంధనలన్నీ సమిష్టి ఉద్యమాలు, చట్టపరమైన పోరాటాల ద్వారానే సాధించుకున్నామని గుర్తు చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం వంటి చట్టాలు కార్మికులను కేవలం ఉత్పత్తి సాధనాలుగా చూడకుండా, హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించాయన్నారు.

అయితే, 1990ల నాటి సరళీకరణ విధానాలు వ్యవస్థాగత మార్పులను ప్రవేశపెట్టాయని, కానీ అవి వ్యాపార వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా వున్నా యని విజయన్‌ పేర్కొన్నారు. కాలక్రమేణా, కార్మిక చట్టాలు కార్మికులకు రక్షణ కల్పించడం కన్నా పెట్టుబడిదారులకు సేవలందించేలా రూపు మార్చుకున్నాయి. ఇది, కార్మికుల జీవితాలను, వారి హక్కులను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ను, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ వంటి చొరవలను ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటీకరించడమేనన్నారు. చివరకు లాభాల నార్జించే పీఎస్‌యూలను కూడా అమ్మేస్తున్నారని విమర్శిం చారు. శాశ్వత ఉద్యోగాల స్థానే కాంట్రాక్ట్‌ ఉపాధిని తీసుకు వచ్చారని దీనివల్ల కార్మికుల్లో తీవ్రమైన అభద్రతా భావం నెలకొందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం నీరుగారిందన్నారు. దీనివల్ల వేతనాల్లో అసమానతలు పెరిగాయన్నారు. ఈ ధోరణి చివరకు కేంద్రం నాలుగు లేబర్‌ కోడ్‌లను ప్రవేశపెట్టడంతో ముగిసిందని విమర్శించారు.

కొత్త లేబర్‌ కోడ్‌లు చట్టాలను సరళీకరించడానికి బదులుగా ప్రస్తుతమున్న రక్షణలను నీరు గారుస్తున్నాయని తీవ్రమైన విమర్శలు వున్నాయన్నారు. 29 కార్మికచట్టాలను సంఘటితం చేస్తున్నామన్న సాకుతో కార్మిక భద్రతను నాశనం చేసేశారని అన్నారు. సరైన రీతిలో చర్చ జరగ కుండానే కోడ్‌లను పార్లమెంట్‌లో ఆమోదించేశారని విమ ర్శించారు. పారిశ్రామిక సంబంధాల కోడ్‌లోని నిబంధ నలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. కార్మి కులను తొలగించడానికి లేదా సంస్థలను మూసివేయ డానికి ప్రభుత్వం అనుమతించేందుకు అవసరమైన హద్దు ను 100 నుండి 300కి ఈ నిబంధనలు పెంచాయన్నారు. ఈ చర్య, పర్యవేక్షణ లేకుండా కార్మికులను తొలగిం చడానికి, సమర్ధవంతంగా హైర్‌ అండ్‌ ఫైర్‌ వ్యవస్థను చట్టబద్ధం చేయడానికి మెజారిటీ ఫ్యాక్టరీలను అనుమతిస్తోందన్నారు. ప్రతిపాదిత వేతన యంత్రాంగాలు కనీస వేతన రక్షణలను దెబ్బతీయవచ్చని ముఖ్యమంత్రి విజయన్‌ హెచ్చరించారు. బ్రేక్‌ టైమ్‌ను మినహాయిస్తూ పని గంటలను పొడిగించే నిబంధనలను కూడా ఆయన విమర్శించారు. సామాజిక భద్రతా కోడ్‌ అసంఘటిత కార్మికులకు, గిగ్‌ వర్కర్లకు నిజమైన రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు.
కొత్త కార్మిక చట్టాలు కార్మిక వ్యతిరేకమైనవని, భారతదేశంలో ఇప్పటివరకు వున్న కార్మిక అనుకూల వాతావరణానికి ముప్పుగా పరిణమించాయని పినరయి విజయన్‌ పేర్కొన్నారు. కార్మికులు, రైతులు ప్రజాస్వామ్య రీతిలో సమైక్య ప్రతిఘటనను చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ పోరాటం భవిష్యత్‌ తరాల కోసమని, భారతదేశాన్ని ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా నిలబెట్టడానికని ఆయన నొక్కిచెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -