నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో లేబర్ డే సందర్భంగా … ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా … వేలాది మంది కార్మికుల నిరసనలు హోరెత్తాయి. సోమవారం అమెరికాలోని 50 రాష్ట్రాలలో వెయ్యి మందికి పైగా ఆందోళనకారులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
కార్మికుల రక్షణను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు ‘వర్కర్స్ ఓవర్ బిలియనీర్స్’ అనే బ్యానర్లు పట్టుకుని నిరసన ర్యాలీల్లో ప్రదర్శించారు. కార్మికులకు రక్షణ కల్పించాలని, పాఠశాలలకు పూర్తి స్థాయిలో నిధులు అందించాలని, అందరికీ ఆరోగ్య సంరక్షణ, ఇళ్లు కల్పించాలని, కార్పొరేట్ల అవినీతికి ముగింపు పలకాలని, అణగారిన వర్గాలపై దాడులు ఆపాలని కార్మికులంతా డిమాండ్ చేశారు. ట్రంప్ పరిపాలన సమైఖ్యతను దెబ్బతీస్తుందని నిరసనకారులు తీవ్రంగా ధ్వజమెత్తారు. న్యూయార్క్‌లో ట్రంప్ టవర్ వెలుపల వేలాదిమంది గుమిగూడి ట్రంప్ ఫాసిస్టు అని, అతను పదవి నుంచి దిగిపోవాలని ముక్త కంఠంతో నినాదాలు చేశారు.