Thursday, October 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిశ్రమశక్తి (దోపిడీ)నీతి-2025

శ్రమశక్తి (దోపిడీ)నీతి-2025

- Advertisement -

2019, 2020 నుండి నాలుగు కోడ్‌లు ఆమోదించబడి ఏలినవారి బీరువాల్లో ఉన్నాయి. నేరుగా అమలు చేయ వశంకావడం లేదు. కేంద్రంలో చట్టాలామోదించి రాష్ట్రాలను రూల్స్‌ తయారుచేసు కోమన్నారు. దానికీ ప్రతిఘటనొస్తోంది. రైతు చట్టాల్లాగే దీనికీ దొడ్డిదార్లు వెతుకుతున్నారు. శ్రమశక్తి నీతి దాన్లో భాగమే! అందుకే దీన్ని తిప్పికొట్టడం కీలకం. దొరికిన వారికి సేవ చేయడం ఒక పద్దతి! దొరికిచ్చుకుని సేవ చేయడం మరో పద్ధతి. మొదటిది అధికారులకు ఉద్యోగులు, బంట్రోత్తులు చేసే సేవ. ఇది ‘ఇహం’లో ఉపయోగపడేది. శ్రీరాముడి పాదాలు తనకు దొరికినట్లు భావించుకుని ”దొరుకునా ఇటువంటి సేవా! నీ పద రాజీవముల చేరు..” అంటూ త్యాగరాజు భక్తి పారవశ్యంలో కీర్తన రాశాడు.

ఈ ఉపోద్ఘాతమెందుకంటే కార్పొరేట్లకు మోడీ సర్కార్‌ చేసే సేవ పరాకాష్టకొచ్చింది. అన్ని రంగాల్లోనూ ‘అ ఆ’లు (అంబానీ, ఆదానీ) కీలకంగా మారారని కొందరంటూంటారు. ఒకరు ప్రియుడు, మరొకరు ప్రియతములు! వీరికి గుజరాత్‌లో ఏమి సేవ చేశారో తెల్సినవారు తక్కువ! (ప్రొ|| రామ్‌ కుమార్‌ మార్క్సిస్ట్‌లో రాసిన సుదీర్ఘ వ్యాసం చదివితే ఆశ్చర్యపోయేన్ని విషయాలున్నాయి) ఎంత చేసుండకపోతే (బైక్‌ రెండ్రోజులివ్వడానికి ఏడ్చి చచ్చే ఈ రోజుల్లో) ఏకంగా విమానమే మోడీకి దేశమంత తిరిగేందుకు ఇచ్చి ఉంటాడు అదానీ! మన ప్రధానికి కూడా దేన్నీ తనదగ్గర ఉంచుకునే తత్వంలేదు. డిఫెన్స్‌ నుండి ఎల్‌ఐసీ వరకు కట్టబెట్టేందుకు చేయగలిగిన మేరకు సాయం చేస్తూనే ఉన్నారు కదా ! ఆఖరికి గాజాలో పాలస్తీనీయన్లపై బాంబుల వర్షం కురిపించినవి అదానీ సాబ్‌ డ్రోన్‌లేనని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఆస్ట్రేలియాలో బొగ్గు గనులిప్పించడం మొదలు నేడు తాజాగా నికోబార్‌ దీవుల్ని అప్పనంగా కట్టబెట్టేవరకు ఒక్కొక్కటీ చకచకా జరిగిపోతున్నాయి.

కార్మిక – కర్షకులపై దాడికి సన్నాహం
పైవన్నీ బయటి ప్రపంచానికి తెలిసేవి. లోతుగా పరిశోధించిన వారికి అర్థమయ్యేవి. అ-ఆల సామ్రాజ్యాలకే కాదు, మొత్తం కార్పొరేట్ల మేడలకు, మిద్దెలకు రాళ్ళెత్తే కూలీల పాట్లు చెప్పనలవి కావు. ఇవి పైకి కన్పడవు. అనుభవించే వారికి తప్ప. నల్లచట్టాలు రైతాంగాన్ని దెబ్బతియ్యబోయిన తీరు, వారు ప్రతిఘటించిన తీరు చూసి ప్రపంచమే ఆశ్చర్యబోయింది. మన పాలకుల మొహం చిన్నబోయింది. నేటి దోవ ప్రయత్నాలు వేరే సంగతి. నేడు ”శ్రమ శక్తి నీతి” పేర కార్పొరేట్లు తమ ముసుగు తొలగించేశారు. పచ్చిగా దోపిడీకి తెగబడ్డారు. దానిపేరు ”శ్రమ శక్తి దోపిడీ” అనుంటే బాగుండేది. 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్‌ కోడ్‌లు వచ్చాయని మనకి తెలుసు.

ఇప్పుడది రాజధర్మంలో భాగం అట! బహుశా ఇదే కలియుగ రాజధర్మమేమో! దీనికి స్ఫూర్తి మనుస్మృతి. యాజ్ఞవల్క్యస్మృతి, నారదస్మృతి, శుక్రనీతి వంటివట! కుల వర్గ శత్రువులు ఏకంగా ఒకడిలో ఒకడు విలీనమై నిలబడ్డారో చూశారా?! ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో తనిఖీలు లేవు. ఫ్యాక్టరీల శాఖ నీరుగార్చబడ్డది. జరిగే ప్రమాదాలు, దాన్లో చనిపోయిన వారి సంఖ్య ప్రభుత్వం దగ్గర లెక్కే లేదు. గూగుల్‌ తల్లినడిగినా ఇదేమాట చెప్పింది. ఒక సంస్థ లెక్క ప్రకారం 2024లో దేశంలో 240 పని స్థలాల్లో జరిగిన ప్రమాదాల్లో 400 మంది చనిపోగా 850 మంది తీవ్రగాయాలపాలైనారు. ఈ ప్రమాదాల సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతోంది.

ప్రభుత్వాలు ”రెగ్యులేటర్‌” బాధ్యతల్ని వదిలేసి ఫెసిలిటేటర్‌ బాధ్యతల్లోకి వెళ్ళిన ఫలితమిది. యజమానులు ఎవరికి వారు ”సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌” చేస్తున్న ఫలితమిది. యజమానుల ఇష్టానుసారం కార్మిక చట్టాలను ఇంకా సవరిస్తున్నారు. కార్మికులనుగాని వారి సంఘాలను గాని చర్చించడమనే పద్ధతే భూతకాలంలోకి జరిగిపోయింది. ఇప్పుడు నిజంగా ‘భూతాల’ కాలమే వచ్చింది. ‘లేబర్‌ ఎంప్లాయిమెంట్‌ పాలసీ ఇవాల్యుయేషన్‌ ఇండెక్స్‌ (ఎల్‌ఈపీఈఐ) అని దానికో ముద్దుపేరు పెట్టారు. దాని ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులిస్తారు. ఈ విధాన అమలుకు ”లేబర్‌ రిఫార్మ్స్‌ ఫండు” ఏర్పాటుచేస్తారు. పేరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి ప్లస్‌ పెట్టుబడిదారులు ఈ ఫండు నిర్వహణ బాధ్యతలు చేపడ్తారట! ఆహా పేనుకు పెత్తనమిస్తే తలంతా చెడకొరికి పెట్టదా?! కార్మిక చట్టాల సవరణంతా కార్పొరేట్లే చూస్తారు. ఈ స్థితిలో సీఐటీయూ కేంద్ర నాయకత్వం కొన్ని ఉదాహరణలు కేంద్ర కార్మిక శాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. అవన్నీ గుదిగుచ్చి చూస్తే ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలకే కాదు, సాధారణ ప్రజలకు సైతం కళ్ళు తిరుగుతాయి.

ప్రస్తుత కార్మిక చట్టాల నేపథ్యంలో తనిఖీలు 2014లో 45,920 నుండి 2022 నాటికి 35125 కి తగ్గిపోయాయి.
కార్మిక చట్టాల ఉల్లంఘన ఇదే కాలంలో 54శాతం నుండి 57.2శాతానికి పెరిగింది.
2022లో 4.5 కోట్ల మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల అతిక్రమణలు జరిగినట్లు 58శాతం తనిఖీల్లో బయటపడ్డాయి.
5250 కంపెనీలు పెద్దఎత్తున కార్మికులను పనుల్లో నుండి తొలగించాయి. 15 లక్షల మంది కార్మికులు పనులు కోల్పోయారు.
2018-22 మధ్య ఐటి, ఐటీఈఎస్‌ ఉద్యోగులను రెండున్నర లక్షల మందిని తొలగించారు.
ఒక్క 2023లోనే ఇపీఎఫ్‌ చెల్లింపులకు సంబంధించిన అతిక్రమణలు 35 వేలు జరిగినట్లు, వాటి మొత్తం 2500 కోట్ల రూపాయలని తెలింది.
70శాతం అతిక్రమణలు దుస్తులు, నిర్మాణరంగంలోనే జరిగినట్లు నిర్థారణ అయ్యింది.
పనిప్రదేశాల్లో జరిగే ప్రమాదాలు 2018-22 మధ్య కేవలం 35శాతం మాత్రమే నమోదవుతున్నాయి. ఇవి 15వేల ఫ్యాక్టరీల్లో జరిగాయి.

65 శాతం మంది మహిళలు ప్రసూతి ప్రయోజనాలు నిరాకరించబడ్డారు.
70 శాతంమంది సమాన వేతనాలు నిరాకరించబడ్డారు.
పని ప్రదేశాల్లో లైంగిన వేధింపులు ఎదుర్కొన్నట్లు 40శాతం మంది చెప్పారు.
12 లక్షల కేసులు వివిధ స్థాయిల్లో న్యాయ స్థానాల ముందున్నాయి. తీర్పులు రావడానికి సగటున 3 నుండి 5 ఏండ్లు పడ్తున్నది.
85 శాతం ఫుడ్‌ డెలివరీ చేసే వారు నిర్ణీత కనీస వేతనాల కంటే తక్కువ పొందుతున్నారు.
70 శాతం క్యాబ్‌ డ్రైవర్లు సాంఘిక భద్రత లేకుండా ఎటువంటి ఓవర్‌టైమ్‌ వేతనాలు లేకుండా 12-13 గంటలు చాకిరీ చేస్తున్నారు.
పది లేదా అంతకు ఎక్కువ మంది కార్మికులుండాలన్న షరతువల్ల 85 శాతం సంఘటిత కార్మికులు గ్రాట్యుటీకి అర్హత కోల్పోతున్నారు.
వీటన్నిటి ఫలితంగా స్థూల జోడించిన విలువలో (గ్రాస్‌ వాల్యుయాడెడ్‌) వేతనాల వాటా 1981-82లో 30.27శాతం నుండి 2023-24కి 15.97 శాతానికి పడిపోగా ఇదే కాలంలో లాభాల వాటా 23.39శాతం నుండి 51.01 శాతానికి పెరిగింది. ఇవన్నీ ప్రభుత్వ విధానాల ఫలితమే. ఈ విషయం నిక్కచ్చిగా సీఐటీయు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.
ఇవన్నీ లేబర్‌ కోడ్‌ల అమల్లో భాగంగానేనని మనం భావించాల్సి వస్తుంది. ‘శ్రమ సమాధాన్‌ సువిధ’ ప్రవేశ ద్వారం గుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారులకు అధీనపరుస్తుంది. కార్మిక చట్టాలను నామమాత్రం చేస్తున్నది. లేబర్‌ కోడ్‌లను యాజమాన్యాలు సునాయాసంగా అతిక్రమించేందుకు ఇవి తోడ్పడతాయి.

దోపిడీ తీవ్రతకు నిదర్శనాలు
‘సమ్మిళిత వద్ధి’ (ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌)తో కార్మికులను ఆదుకుంటామని చెప్తూనే ఫ్యాక్టరీ చట్టం, కాంట్రాక్ట్‌ లేబర్‌ చట్టం, ఈఎస్‌ఐ చట్టం, ఇపిఎఫ్‌ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం మొదలైన అన్ని చట్టాలకు సంఖ్యలు పెంచడం ద్వారా అత్యధిక మంది కార్మికుల్ని, పరిశ్రమలను ఈ చట్టాల పరిధి ఆవలకి నెట్టారు. కార్మిక సంఘాలు పెద్దఎత్తున వత్తిడి చేసినా గాని ఈ సంఖ్యలను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంకావడంలేదు.

వినాశనం అంచున త్రైపాక్షిక వేదికలు
ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ వంటి త్రైపాక్షిక వేదికను సమావేశపరిచి సరిగ్గా పదేండ్లు దాటింది. ఇతర సంప్రదింపుల వేదికలు, చట్టపరంగా నడవాల్సిన సలహా మండళ్లు ఉద్దేశపూర్వకంగ మూలపడేయబడ్డాయి. దీంతోపాటు లేబర్‌ కోడ్‌లలో పేర్కొన్న అనేక విషయాలు కార్మికుల గొంతులను నొక్కివేస్తున్నాయి. అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఎంత వత్తిడి చేసినా ఐఎల్‌సీ సమావేశాన్ని మోడీ సర్కార్‌ నిర్వహించడంలేదు. 1942 నుండి, అంటే బ్రిటీష్‌ పాలనాకాలం నుండి మన దేశంలో త్రైపాక్షిక వేదికలున్నాయి. అనేక విధానపరమైన అంశాలపై దాన్లో ఏకాభిప్రాయానికొచ్చేవారు. అవే ఆ తర్వాత విధాన నిర్ణయాలయ్యేవి. దాని స్థానంలో కలయిక లేదా కూడలి సమావేశం (కన్వర్జెన్స్‌)లో కార్మిక సంఘాలకు స్థానమే లేదు. ఆ విధంగా త్రైపాక్షిక వేదికలు ఏకపక్ష నిర్ణయాలకు కారకమవుతున్నాయి.

ముగింపులో ఒక్కమాట! శ్రమశక్తి నీతి, దానికంటే ముందు నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దుచేయమని సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు చేసే డిమాండు న్యాయబద్ధమైనది. తనిఖీల ఆధారంగా సమ్మతితో నడిచే కార్మిక పాలనా వ్యవస్థ, యజమానులకు సర్వాధికారాలు కట్టబెట్టే విధానంగా మారడాన్ని దేశ యావత్‌ ప్రజలూ ప్రతిఘటించాలి. కాలం చెల్లిన మనుస్మృతి వంటి వాటిపై ఆధారపడ్డ నీతి రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యపాలన రాజ్యాంగ బద్ధ నీతిపై ఆధారపడ్డ సంక్షేమ రాజ్యంగా ఉండాలి. లేబర్‌ కోడ్‌లను, ఈ ‘నీతి’ని రద్దుచేయడం దానికి తప్పనిసరి అవసరం. వెంటనే ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ (ఐఎల్‌సి)ని సమావేశపరిచి కార్మిక సంఘాలతో చర్చించడం అసవరం.

ఆర్‌. సుధాభాస్కర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -