Monday, July 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుముమ్మాటికి శ్రమ దోపిడే..

ముమ్మాటికి శ్రమ దోపిడే..

- Advertisement -

కార్మికుల కడుపుకొట్టి కార్పొరేట్లను మేపే కుట్ర
10 గంటల పనిదినాల జీ.ఓ 282ను ఉపసంహరించుకోవాలి
9న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
మోడీ విధానాలను అవలంబిస్తున్న రేవంత్‌ సర్కార్‌ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ
నవతెలంగాణ – హస్తినాపురం

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 10 గంటల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తూ జీ.ఓ విడుదల చేయడం కార్మిక చట్టాలను కాలరాయడమేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి, వారి శ్రమను కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయనిసీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. ఈనెల 9న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) ఎల్బీ నగర్‌ సర్కిల్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని హస్తినాపురం డివిజన్‌ నందనవనంలో మున్సిపల్‌ కార్మికులతో కలిసి జాన్‌వెస్లీ జీఓ 282 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్‌ సర్కిల్‌ కమిటీ అధ్యక్షులు ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 9న దేశ వ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. మే డే స్ఫూర్తితో కార్మిక, కర్షక లోకం పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను కాకుండా గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాల్లో అమలు పరుస్తున్న 10 గంటల పని దినాలను తెలంగాణలోనూ అమలు పరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చీకటి ఒప్పందాలకు నిదర్శనమని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు ఏడాదికి కనీసం 200 పనిదినాలు కల్పించాలన్నారు. రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు పదేండ్లుగా పనిచేస్తున్నప్పటికీ వారిని రెగ్యులరైజ్‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలు కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు. సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్నదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.చంద్రమోహన్‌, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి, సరూర్‌ నగర్‌ సర్కిల్‌ కార్యదర్శి సి.హెచ్‌ వెంకన్న, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఎం. వీరయ్య, సీపీఐ(ఎం) నందనవనం, వనస్థలిపురం, చంపాపేట శాఖల కార్యదర్శులు మంథని యాదయ్య, పి. రామస్వామి, దుర్గారావు, ఆర్టీసీ యూనియన్‌ రాష్ట్ర నాయకులు రవీందర్‌ రెడ్డి, సర్కిల్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -