Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికా కోసమే కార్మిక చట్టాల మార్పు

అమెరికా కోసమే కార్మిక చట్టాల మార్పు

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర 6వ మహాసభ విజయవంతం
– నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌
పెట్టుబడిదారులు, అమెరికాకు ఆర్థిక లబ్ది చేకూర్చడానికే మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శివం ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ 6వ రాష్ట్ర మహాసభ ఆదివారం రెండో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ, జాతీయ పరిణామాలను వివరించారు. అమెరికా షరతులకు ప్రధాని మోడీ లొంగిపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌-అమెరికా యుద్ధం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు 15 దేశాల్లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దినదినగండంగా జీవిస్తున్నారని తెలిపారు. పాలస్తీనా గాజాపై ఇజ్రాయిల్‌ చేసిన యుద్ధంలో 70 వేల మంది ప్రజలు చనిపోయారన్నారు. ట్రంప్‌ యుద్దోన్మాద, సామ్రాజ్యవాద కాంక్షతో వర్ధమాన దేశాలపై సుంకాలు విధించడం, పెత్తనాలు చెలాయించడం మానుకోవాలని హితవుపలికారు. భారతదేశ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్న మోడీ, ట్రంప్‌ ద్వంద్వనీతిని తీవ్రంగా ఖండించారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడుల వల్ల మోడీ దేశాన్ని అమెరికాకు బంటుగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తోంది : ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ జాతీయ ఉపాధ్యక్షులు చంద్రకుమార్‌, కార్యదర్శి మనోహర్‌

మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నారని ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ జాతీయ ఉపాధ్యక్షులు చంద్రకుమార్‌, కార్యదర్శి మనోహర్‌ తెలిపారు. కార్మకులు సాధించుకున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం హరించేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా మాఫియా దాడులను, దౌర్జన్యాలను, వేధింపులను అరికట్టాలని, వాటికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అలెంబిక్‌ యాజమాన్య దాడులను ఖండించారు.

టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా సిహెచ్‌ శ్రీధర్‌, సిహెచ్‌ భాను కిరణ్‌, ఉపాధ్యక్షులుగా జి.విద్యాసాగర్‌, సహాయ ప్రధాన కార్యదర్శిగా గుండా శ్రీనివాస్‌, కోశాధికారిగా ఏ.నరసింహాచారి ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కె.దుర్గాప్రసాదరావు, లోకేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, సదానందాచారి, అప్రోచ్‌, సాగర్‌ రెడ్డిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరో 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
మహాసభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌, మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున్‌, శోభన్‌ యాదవ్‌, ఉపాధ్యక్షులు రాఘవేందర్‌, కార్యదర్శులు రాఘవేందర్‌, సీఐటీయూ నాయకులు కిల్లే గోపాల్‌, నల్లవెల్లి కురుమూర్తి, ఖమరలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -