Wednesday, February 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోరాటాల ద్వారానే కార్మిక చట్టాలు

పోరాటాల ద్వారానే కార్మిక చట్టాలు

- Advertisement -

– లేబర్‌ కోడ్‌లతో ఉద్యోగ భద్రత, యూనియన్‌ హక్కులకు ముప్పు: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
– నాచారం చౌరస్తాలో కార్మిక సదస్సు
– 12న సమ్మె విజయవంతానికి ఆయా సంఘాల నేతల పిలుపు
నవతెలంగాణ – చర్లపల్లి

ఉద్యమాలు పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు, చట్టాలు సాధ్యమయ్యాయని, ఈ చారిత్రక సత్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తూ మంగళవారం నాచారం చౌరస్తాలో నాచారం ఇండిస్టియల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కోశాధికారి పి.గణేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్మిక సదస్సులో వీరయ్య ప్రసంగించారు. కార్మికుల త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్‌ లాభాల కోసం రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నాలుగు లేబర్‌ కోడ్స్‌అమలైతే ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు, ఉద్యోగ భద్రత పూర్తిగా దెబ్బతింటాయని తెలిపారు. షాహీ పరిశ్రమలో 1,600 మంది మహిళా కార్మికులు ఎలాంటి యూనియన్లకు చెందకుండానే తమ వేతనాల కోసం పది రోజుల పాటు రాత్రింబవళ్లు పోరాడి హక్కులు సాధించుకున్న ఉదాహరణను ఆయన గుర్తు చేశారు. పోరాటం లేకుండా హక్కులు లభించవని ఇది స్పష్టంగా నిరూపిస్తోందన్నారు. ఏఐటీఈయుసీ రాష్ట్ర నాయకులు వి.ఎస్‌.బోసు మాట్లాడుతూ కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలేనన్నారు. ఈ విధానాలను వెనక్కి తీసుకునే వరకు కార్మికులు-రైతులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్‌ వర్గాల ఒత్తిడికి లోబడి కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.

బీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే కార్మిక వర్గంపై పెరుగుతున్న దాడులకు కారణమని విమర్శించారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.శ్రీనివాసులు, ఐఎఫ్‌టీయూ నాయకులు శివబాబు, టీయూసీ ప్రవీణ్‌, ఎన్‌ఐఈయు అధ్యక్షుడు శేఖర్‌ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు శంకర్‌ రావు, సీఐఈయు అధ్యక్షుడు బివి సత్యనారాయణ, ఏపీరాక్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ మణికంఠ, వాయిత్‌ ఇండియా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సత్యంగౌడ్‌, కాకతీయ కెమికల్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌, గ్రో కంట్రోల్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎండీ షకీల్‌, హార్డ్కేస్‌ ఇంజినీరింగ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రమేష్‌, నాచారం, మల్లాపూర్‌ ఏరియా వివిధ పరిశ్రమ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -