ఈ పోరాటం ఆరంభమే… మున్ముందు ఉధృతం చేస్తాం
నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకూ ఉద్యమాలు
అమెరికాతో ట్రేడ్ డీల్ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు : నారాయణగూడ చౌరస్తా నిరసనలో వామపక్ష పార్టీల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు రాజీలేని పోరాటాలు చేస్తామని వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమేననీ, మున్ముందు ఉధృతం చేస్తామనీ చెప్పారు. కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్-మాస్‌లైన్), ఎస్‌యూసీఐ, ఏఐఎఫ్‌బీ, సీపీఐ(ఎంఎల్-లిబరేషన్) ఆధ్వర్యంలో గురువారం నారాయణగూడ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎంఎల్-న్యూడెమోక్రసీ) అధికార ప్రతినిధి చలపతిరావు, సీపీఐ(ఎంఎల్-మాస్‌లైన్) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి హన్మేశ్, సీపీఐ(ఎంఎల్ -లిబరేషన్) రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్ రాజా, ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది భాగస్వామ్యమయ్యారని తెలిపారు. కార్మికులు తమ రక్తాన్ని ధారపోసి అనేక త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కుదించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసేంత వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. అలీన విధానాన్ని వీడి అమెరికాతో నరేంద్రమోడీ సర్కారు వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశాన్ని సామ్రాజ్యవాద అమెరికాకు తాకట్టు పెట్టేవిధంగా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు పీపీపీ పేరుతో అన్ని రంగాలను ప్రయివేటీకరించి కార్పొరేట్లకు ధారాదత్తం చేసే పనిలో ఉందని తెలిపారు. ఈ ఆటలను వామపక్ష పార్టీలు అడ్డుకుంటాయని తెలిపారు. అమెరికాతో చేసుకున్న ట్రేడ్ ఒప్పందం దేశ సార్వభౌమాధికారానికే ముప్పు అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆహార పంపిణీ వ్యవస్థను మోడీ సర్కారు క్రమంగా నిర్వీర్యం చేస్తున్న తీరును ఎండగట్టారు. నరేగా చట్టాన్ని తీసేసి వీబీజీఆర్‌ఏఎమ్‌జీ చట్టాన్ని తేవడాన్ని తప్పుబట్టారు. 125 రోజులు పని కల్పించేందుకు కనీసం రూ.3.5 లక్షల కోట్లు కావాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే… బడ్జెట్‌లో రూ.92 వేల కోట్లు కేటాయించడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జ్యోతి, టి.సాగర్, మల్లు లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, బాబూరావు, ఆశయ్య, శ్రీరాంనాయక్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజయ్య నాయక్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్య, అనురాధ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావెద్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.శ్రీకాంత్, వామపక్ష పార్టీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అసెంబ్లీలో తీర్మానానికి ప్రయత్నిస్తా : పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
కార్మిక సంఘాలు నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద గురువారం కార్మిక సంఘాలు సభ నిర్వహించాయి. ఈ సభలో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో వీటిపై తీర్మానం చేసేందుకు ప్రయత్నిస్తాని చెప్పారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మిక, కర్షక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించటం అభినందనీయమన్నారు. దేశీయ పరిశ్రమలు, చిన్న, మధ్య తరహ వ్యాపారాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టేవిధంగా ఏ వాణిజ్య ఒప్పందం ఉండకూడదని స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో విదేశీ కంపెనీలకు అధిక ప్రాధాన్యమిస్తూ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌లో తీవ్ర ప్రభావాలు చూపుతాయని హెచ్చరించారు. ఈ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ పోటీ కనీస ధర కూడా దక్కకుండా చేస్తోందన్నారు. కార్మిక హక్కులు, వేతన భద్రత, ఉద్యోగ రక్షణ అంశాల్లో స్పష్టత లేకుండా ఒప్పందాలు కుదుర్చుకోవడం సమంజసం కాదని చెప్పారు. దేశీయ పరిశ్రమలను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనీ, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించకుండా విదేశీ దిగుమతులకు మార్గం సుగమం చేస్తే చిన్న వ్యాపారులు నష్టపోతారని వెల్లడించారు. రైతు, కార్మిక వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను కాంగ్రెస్ ఎప్పటికీ సమర్థించబోదని స్పష్టం చేశారు.



