Friday, February 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుశ్రామిక జనగర్జన

శ్రామిక జనగర్జన

- Advertisement -

కదం తొక్కిన కార్మిక లోకం
సార్వత్రిక సమ్మె సక్సెస్‌
బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన ప్రదర్శన
నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాల్సిందే..
లేకుంటే పోరాటం ఉధృతం చేస్తాం
అసెంబ్లీలో లేబర్‌ కోడ్‌లు అమలు చేయబోమంటూ తీర్మానం చేయాలి : ఇందిరాపార్కు వద్ద సభలో కార్మిక సంఘాల నేతలు


దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, ప్రజానీకం కదం తొక్కింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జాతీయ సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో భాగస్వాములు అయ్యారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని పారిశ్రామికవాడల్లోని కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఊబర్‌, ఓలా, ర్యాపిడో రైడర్లు సమ్మెలో భాగస్వాములు అయ్యారు. జర్నలిస్టులు సైతం కేంద్రం చర్యల్ని నిరసిస్తూ, ప్రదర్శనలు నిర్వహించారు. బొగ్గుగని కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. రవాణారంగ కార్మికులు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి, వంటావార్పు చేసుకుంటూ తమ నిరసనను వ్యక్తంచేశారు.

సీడ్‌ బిల్లు సహా కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తూ భారత రైతాంగం ఎక్కడికక్కడ రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో భాగస్వాములు అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఆందోళనలు ఈ సమ్మెలో స్పష్టంగా కనిపించాయి. జాతీయ కార్మికసంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎమ్‌) పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సక్సెస్‌ అయ్యింది. వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్‌ సహా అనేక రాజకీయపార్టీలు ఈ సమ్మెకు మద్దతు, సంఘీభావం ప్రకటించాయి. అన్ని వర్గాల ప్రజానీకం ఐక్యతతో విజయవంతమైన ఈ సమ్మె దేశ చరిత్రలో పెనుమార్పుల్ని తెస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కచ్చితంగా కేంద్రంలోని మోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యల్ని పున:సమీక్షించుకోక తప్పదని కష్టజీవులు హెచ్చరించారు.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ గురువారం కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సక్సెస్‌ అయింది. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ, బీఆర్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ అనుబంధ సంఘాల నుంచి వేలాదిమంది కార్మికులు, రోడ్లపైకి వచ్చి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలంటూ కదం తొక్కారు. స్థానిక ఆర్టీసీ కళ్యణ మండపం నుంచి ప్రారంభమైన కార్మిక, కర్షక, ప్రజా ప్రదర్శన ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌ చౌరస్తా మీదుగా ఇందిరా పార్కు వరకు కొనసాగింది.

అనంతరం అక్కడ జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడగు భాస్కర్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాలరాజు, ఐఎన్‌టీయూసీ నాయకులు చంద్రశేఖర్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రెబ్బరామారావు, టీయూసీఐ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్‌ పద్మ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌, బీఆర్‌టీయూ కార్యదర్శి మారయ్య, ఏఐయూటీయూసీ నాయకులు భరత్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ఏఐకేఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా కన్వీనర్‌ జక్కుల వెంకటయ్య, ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు మాట్లాడారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లు. అదానీ, అంబానీలతో పాటు మతోన్మాదుల ప్రయోజనాలకోసం కార్మికులు, కర్షకులపై యుద్ధం ప్రకటించిందని నాయకులు చెప్పారు. కార్మికుల ప్రయోజనాల కోసమే నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చినట్టు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోడ్‌లతో కార్మిక హక్కులను పారిశ్రామిక యజమానుల కోసం పణంగా పెట్టారని విమర్శించారు. ఇప్పటికే కార్మికులకు కనీస వేతనం అమలు కావటం లేదనీ, దీంతో వారి జీవనం దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గోరుచుట్టుపై రోకటిపోటులాగా ఉన్న హక్కులను ఊడపెరికితే..ఇక కార్మికుడి బతుకు పెనం నుంచి పోయిలో పడిన చందంగా మారక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు బీజేపీ ప్రభుత్వం సమాధి కడుతుంటే, బీఎంఎస్‌ దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నదని ఎద్దేవా చేశారు.

సార్వత్రిక సమ్మె కార్మికుల జీతాల కోసమో, సంక్షేమం కోసమో కాదనీ, దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్నదని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సక్సెస్‌ అయిందనీ, అన్ని వర్గాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. ఎక్కడికక్కడ తమ నిరసనను తెలిపారన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభలో నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేయబోమంటూ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో చర్చించకుండానే కార్మిక చట్టాలను రద్దు చేయటమేంటని ప్రశ్నించారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని మరో సారి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విత్తన చట్టం, విద్యుత్‌ సవరణ చట్టాలతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, ఉపాధ్యక్షులు బి ప్రసాద్‌, బి పద్మ, తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌నాయక్‌, ఎస్కేఎమ్‌ నాయకులు బీ రాము, పీ జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, విస్సా కిరణ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, ఐద్వా అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, కార్యదర్శి ఆశాలత, తెలంగాణ పెన్షనర్ల సంఘం కార్యదర్శి కృష్ణమూర్తి, సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం దశరథ్‌, కుమారస్వామి, ఏఐటీయూసీ నాయకులు నర్సింహా, టీయూసీఐ నాయకులు ప్రదీప్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు అరుణక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -