Wednesday, July 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికార్మిక కంటక విధానాలు ఇకచాలు

కార్మిక కంటక విధానాలు ఇకచాలు

- Advertisement -

జులై 9న చారిత్రాత్మక సమ్మెలో కోట్ల మంది శ్రామిక ప్రజలు వీధులను ముంచెత్తారు. వాస్తవానికి ఈ సమ్మె కోసం ఇంతకు ముందే సన్నాహాలు చేసుకున్నారు. అయితే పహల్గాంలో అమాయకులైన టూరిస్టు పౌరులను టెర్రరిస్టులు బలిగొన్న దారుణ హత్యాకాండ కారణంగా సమ్మె ఒక నెల రోజుల పాటు వాయిదా పడింది. అయినా కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజల ప్రతిఘటన స్ఫూర్తి ఏమాత్రం సడలలేదు.ప్రభుత్వం మూడు కీలకమైన లేబర్‌ కోడ్లను బలవంతంగా రుద్దడం కొనసాగించడంతో ఈ ప్రతిఘటన మరింత ఊపందుకుంది. పారిశ్రామిక సంబంధాలు (ఐ.ఆర్‌) కోడ్‌, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య పని పరిస్థితులు కోడ్‌, సామాజిక భద్రత కోడ్‌ మూడింటిని ప్రభుత్వం బలవంతంగా కొనసాగించింది. 2019 వేతనాల కోడ్‌తో కలిపి మొత్తం నాలుగు కొత్త కోడ్లు ప్రస్తుతం ఉన్న 44 లేబర్‌ చట్టాలను ఆక్రమిస్తున్నాయి. కార్మికుల జీవితాలకు సంబంధించిన వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, పని ప్రదేశంలో భద్రత-సంక్షేమం వంటి వాటిని ఇవి ప్రభావితం చేస్తాయి. సారాంశం చెప్పాలంటే భిన్న తరగతులకు చెందిన శ్రామికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులను పథకం ప్రకారం తూట్లు పొడిచేవిగా ఉన్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ మత రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకుపోయేవిగా ఈ కోడ్‌లు ఉన్నాయి.


విస్తృత ఐక్యత
జులై 9 సమ్మెకు సన్నాహాలు ఈ దాడిని సూటిగా అడ్డుకోవాలనే దిశలో సాగాయి. ఈ సమ్మెను అన్ని ప్రధాన కేంద్ర ట్రేడ్‌ యూని యన్లు, పారిశ్రామిక కార్మిక సమాఖ్యలు మాత్రమేకాక సమస్త తరగతులకు చెందిన శ్రమజీవులు బలపరచటం కీలకమైన అంశం. నిర్మాణ రంగంలోని అసంఘటిత కార్మికుల నుంచి ఆర్థిక రంగంలో ఉద్యోగుల వరకు, వలస కార్మికుల వరకు ఒక్క తాటిపై నిలిచి ముక్తకంఠంతో నినదించారు.విస్తారమైన రైతాంగ వేదికగా ఉన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.యం) మద్దతు, భాగస్వామ్యం కూడా అంతే కీలకమైనవి. నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలనే కోరికతో పాటు లోతుగా వేళ్లూనుకుంటున్న వ్యవసాయ సంక్షోభాన్ని ఎత్తిచూపే కనీస మద్దతు ధరకు హామీ ఉండాలనే దీర్ఘకాలిక అపరిష్కృత కోర్కెను రైతు సంఘాలు ముందుకు తెచ్చాయి. వ్యవసాయ, కార్మిక సంఘాలు కూడా గ్రామీణ ఉపాధికి సంబంధించిన ఎడతెగని ఆందోళనను, గ్రామీణ ఉపాధి హామీ పథకం అంతకంతకు హరించుకు పోవడాన్ని ఎత్తి చాటాయి.
కార్మికులు ఈ విధంగా ఒక తాటిపైకి రావటంతో బహుశా మొదటిసారిగా ఒక విస్తారమైన ఐక్యత ఆవిర్భవించింది. ప్రస్తుతం దేశంలోనే విస్తార సంఖ్యలో ఉన్న ప్రజానీకం జీవనోపాధికి సంబంధించి అంతకంతకు పెరిగిపోతున్న సంక్షోభం తీవ్రతను వెల్లడించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేవలం జీవనోపాధి సమస్యగా ఎంత మాత్రం లేదు. మనుగడ కోసం పోరాటంగా మారింది. ప్రస్తుత ప్రతిపాదిత లేబర్‌ కోడ్‌ల వల్ల ముంచుకొస్తున్న సర్వవ్యాప్త ప్రమాదం తీవ్రత కారణంగానే జులై 9 సమ్మె అంత ఉధృతంగా నడిచింది. ప్రస్తుతం ఉన్న అన్ని నియంత్రణ చట్టాలను దాదాపు మటుమాయం చేసి కార్పొరేట్లకు అడ్డు లేకుండా చేయటమే ఈ లేబర్‌ కోడ్‌ల ఉద్దేశం. కార్మికులకు ఇంకా ఏమైనా కనీస చట్టబద్ధమైన రక్షణ అంటూ ఉంటే దాన్ని కూడా లేకుండా చేయడమే జరుగుతుంది. ఈకోడ్‌లను ప్రభుత్వం కార్మిక అనుకూల చర్యలుగా చిత్రించాలని చూడటం ఎంతైనా విడ్డూరం.పైకి ఎంతగా గంభీరం వలకపోసినా తన బూటకత్వం ప్రజల ముందు బట్టబయలవుతుందనేది ప్రభుత్వానికి తెలుసు. పని పరిస్థి తులు దారుణంగా దిగజారిపోవడం కండ్లముందు కనిపిస్తూనే ఉంది. అలా లేదని ఖండించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాని విషయమైంది. శ్రామిక ప్రజల పరిస్థితి క్షీణించడానికి రెండు కీలక అంశాలు కారణమైనాయి. ఒకటి పెరిగిపోతున్న నిరుద్యోగం, మరొకటి భయానకమైన స్థాయిలో అసమానతల పెరుగుదల.


దిగజారిన పరిస్థితులు
జనవరి 31న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2024 ఆర్థిక సర్వేలో కూడా అదనంగా జోడించబడిన స్థూల విలువ (జి.వి.ఎ) లో శ్రామిక వాటా పెరుగుదల నామమాత్రంగానే ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా బడా కంపెనీల్లో ఇది ఇంకా తక్కువగా ఉండటం గమనిస్తే ఆర్థిక అసమానతల తీవ్రత అర్థమవుతుంది. కార్మికులు, ఇతర పీడిత ప్రజల హక్కులపై ప్రభుత్వం ఇంత తీవ్రంగా దాడి చేస్తూనే మరోవైపున అదే సమయంలో ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో కార్పొరేట్లకు 1.45 లక్షల కోట్ల నజరానా కట్టబెడుతున్నది. విద్యా వైద్యం కలిపి కేటాయించిన బడ్జెట్‌ మొత్తం కంటే ఇది చాలా ఎక్కువ. జాతీయ కుటుంబ సర్వే (ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌) ఆరోగ్య నివేదికలో ఇది కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. బ్రిటిష్‌ వారి పాలనలో కన్నా ఈనాటి భారత దేశంలోనే అసమానతలు ఎక్కువగా ఉన్నాయనే స్థాయిలో కూడా కొంతమంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇందుకు పూర్తి భిన్నంగా చూస్తే కార్పొరేట్‌ కులీనుల సంపదలు ఆశ్చర్యకరంగా పెరుగుతున్నాయి. 2014లో వంద కోట్ల పైబడిన సంపద కలిగిన శతకోటీశ్వరులు వందమంది ఉంటే ఇప్పుడు అది రెట్టింపుగా 200కు పెరిగింది. దేశంలో వందమంది శతకోటీశ్వరుల ఉమ్మడి సంపద లక్ష కోట్ల అమెరికన్‌ డాలర్లు దాటింది. ఈ విధంగా జుగుప్సాకరమైన స్థాయిలో సంపద గుట్టలు పడటం, మరోవైపున విస్తారమైన శ్రామిక జన బాహుళ్యం ఆదాయాలు క్షీణించిపోవడం కనిపిస్తుంది. శ్రామికుల ప్రతి శ్వాసలో, ప్రతి చెమటబొట్టులో కనిపించే అంతులేని అన్యాయం జులై 9 ప్రజా కార్యాచరణలో ప్రతిబింబించింది.


భద్రత బలి
బాగా ప్రచారమవుతున్న లేబర్‌ మార్కెట్‌ సులభతరం అనే వాదాన్ని వ్యవస్థీకృతం చేసేవిగా ఈ లేబర్‌ కోడ్‌లు ఉన్నాయి. ఈ దృక్పథం మొదటిసారిగా 2009లో బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ప్రత్యక్షమైంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఇష్టానుసారం పనిలో చేర్చుకొని తొలగించే పద్ధతికి ముద్దుపేరు మాత్రమే. తద్వారా ప్రస్తుతం కార్మికులకున్న కొద్దిపాటి కనీస రక్షణలను కూడా లేకుండా చేయటానికి ఉద్దేశించబడింది. కార్మికులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకోవటం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం నాలుగు శాతం మంది కార్మికులు మాత్రమే ఈ ఔట్‌సోర్సింగ్‌ వలయం బయట, చెమట కొల్లగొట్టే దోపిడీ వాతావరణం బయట ఉన్నారు. లేబర్‌ కోడ్‌లపై ఇప్పుడు పెడుతున్న ప్రత్యేక కేంద్రీకరణ ఈ కొద్దిమంది శ్రామికులకు కూడా కార్మిక సంఘాల హక్కులను లేకుండా చేయడానికి ద్రవ్య పెట్టుబడితో నడిచే నయా ఉదారవాద వ్యవస్థకు మేలు చేయడానికి ఉద్దేశించిన చర్యే. కార్మిక సంఘాలకు, వాటి సమిష్టి బేరసారాల హక్కును తూట్లు పొడవటమే దీని ప్రధాన లక్షణం. భారత దేశం ప్రస్తుతం ఆర్థిక సమానత విషయంలో నాలుగో స్థానానికి చేరుకున్నదని ప్రభుత్వం ఒక సందేహాస్పద పరిశోధనలను ఉటంకించడం పచ్చి బూటకంగా గోచరిస్తుంది. ఇది అన్ని విధాల అసంబద్ధమైన వ్యవహారం.ఈ సందర్భం లో ఖర్చుకు సంబంధించిన డేటాను ఆదాయానికి సంబంధించిన డేటాగా చూపించటం విడ్డూరమే కాకుండా మోసం కూడా.
కార్పొరేట్‌ ప్రాయోజకులనూ విదేశీ నేస్తాలను ప్రసన్నం చేసుకోవడం కోసం పాకులాడుతున్న ప్రభుత్వానికి జులై 9 సమ్మెలో శ్రామిక ప్రజానీకం ప్రదర్శించిన ధృఢ సంకల్పం ఒక హెచ్చరిక. శ్రామిక ప్రజల కోరికలను ఆమోదిస్తుందా లేదా అన్నది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. కానీ ఒకటైతే ఖాయం. వాళ్లు ఏ మాత్రం వెనుకడుగు వేయబోరు. ఈ పోరాటం ఇంకా పెరుగుతుంది. మరింత బలోపేతమైన ప్రభంజనంతో మరింత విశాలమైన ఐక్యతతో ముందడుగు వేసే దిశలో ఉంది.
(జులై9 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -