సిగాచి మృతుల కుటుంబాలకు
రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్
పాల్గొన్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ,
టీఆర్‌టీయూ, టీఎన్టీయూసీ సంఘాలు
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి
42కు చేరిన మృతుల సంఖ్య
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని, మృతిచెందిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, టీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించి, ఘటనా స్థలాన్ని సందర్శించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో అనుమతించి వారిని ప్రమాద ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ పరితోస్ పంకాజ్‌తో వారు మాట్లాడారు. మృతి చెందిన, ఆచూకీ దొరకని వారి వివరాల గురించి ఎస్పీ వారికి వివరించారు. అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని నాయకులతో అన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు పాలడుగు భాస్కర్, బాలరాజు, శ్రీనివాస్, సూర్యం, బోస్ మాట్లాడారు. పరిశ్రమలో ప్రమాదం జరిగి ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిన ఘటన దేశాన్నే కుదిపేసిందని, ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఇప్పటి వరకు 42 మంది కార్మికులు మృతి చెందారని, మరో 8 మంది ఆచూకీ దొరకలేదని తెలిపారు. కార్మికుల భద్రత పట్ల పరిశ్రమ యాజమాన్యాల నిర్లక్ష్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని అన్నారు. యాజమాన్యాల లాభాపేక్ష కోసం పరిశ్రమలు ఇష్టానుసారంగా చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్నారన్నారు. ఎక్స్‌పైర్ అయిన యంత్రాలు, అనుభవం లేని కార్మికులను ప్రొడక్షన్‌లో వినియోగిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తనిఖీలు చేయాల్సిన అధికారులు యాజమాన్యాలతో కుమ్మక్కై తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలను తనిఖీ చేయకుండా యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాల్లో మార్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి ప్రమాద ఘటనకు యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు యాజమాన్యం ప్రకటించిన కోటి రూపాయలు వెంటనే ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ, కార్యదర్శి ఉప్పల శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.రాజయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్, పాండు, రంగారెడ్డి, బి.నాగేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన్ ప్రసాద్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES