Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇల్లు కూలి కూలీల మృతి

ఇల్లు కూలి కూలీల మృతి

- Advertisement -

ఇంటి యజమానిపై కేసు
చనిపోయిన వారికి న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే

నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌
పాత భవనాన్ని కూల్చేస్తున్న సమయంలో ఇల్లు కూలి కూలీలపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు, సీఐ అప్పయ్య సమాచారం ప్రకారం.. యజమాని లక్ష్మణ్‌ తన ఇంటికి మరమ్మతులు చేసేందుకు కూలీలను పిలిపించాడు. ఇంటికి ఆనుకొని ఉన్న రాగి చెట్టును తొలగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. పాత ఇల్లు కావడం వల్ల సహాయక చర్యల్లో పాల్గొన్న మున్సిపల్‌, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికీ ఆటంకాలు ఎదురవుతున్నాయి.

మృతిచెందిన కార్మికుల వివరాలు ఇంకా తెలియలేదు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ విజయబోయిని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాత భవనం కావడం.. యజమాని తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా.. చట్టం పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పట్టణంలో పురాతన భవనాలు, వర్షం వల్ల దెబ్బతిన్న భవనాలను గుర్తించి వెంటనే కూల్చేయాలని, అక్కడి కుటుంబాలను తరలించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి
మహబూబ్‌నగర్‌ పట్టణంలో గురువారం ఇల్లు కూలి చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికీ ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటితోపాటు వారి పిల్లలను ప్రభుత్వమే చదివించాలి. గాయపడిన కార్మికులకు ప్రభుత్వమే వైద్యం అందించి రెండు లక్షల రూపాయలు అందించాలి.

బాధిత కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సురేష్‌
మృతిచెందిన కూలీలకు సంబంధించి ఆ కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేసియా చెల్లించాలి. పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన కార్మికులు ప్రాణం కోల్పోడం బాధాకరం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఎలాంటి భద్రత కల్పించకుండా కూలీల మృతికి కారణమైన ఇంటి యజమానిని అరెస్టు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -