”మా ఊరి మిరియాలు తాటికాయలంత ఉంటా”యని చెప్పే జగత్ జంత్రీలకూ, కంత్రీలకు బుద్ధి లేకపోతే వినడానికి మనకైనా ఉండద్దా?! 2014 మే 26 తర్వాత దేశంలో ఉనికిలోకి వచ్చిన ‘అద్భుత’ నానుడి అది! (మోడీ అనే జ్ఞాని పట్టాభిషిక్తుడైన ఆ రోజెందుకు మరిచిపోతార్లేండి!) ఒకందుకు మోడీ అండ్ కో ను మెచ్చుకోవల్సిందే! కార్పొరేట్ మిలాఖత్‌దార్ల మూటలు సిద్ధం చేసుకుని, నోరేసుకుని పడిపోగల మీడియా అవధాన్లను, సోషల్ మీడియా భజంత్రీలను, పీఆర్‌ఓ బృందాలను రెడీ చేసుకునే 2025 నవంబరు 21న నాలుగు కోడ్‌లనూ నోటిఫై చేశారు. కార్మికుల కష్టాల గురించి ఆవగింజంత అవగాహన లేని ‘ఎడ్యుకేటెడ్’ నిరక్షరకుక్షులు, రాబందు పక్షులు సైతం కోడ్‌ల ‘మహత్తు’ గురించి మీడియాలో, దానికి మించి సోషల్ మీడియాలో మోడీ నామ సంకీర్తనలు ఆలపించడంలో ఆశ్చర్యమేమీ లేదు! కార్మికులు వందేండ్లకు పైగా అనుభవించిన హక్కులు హారతి కర్పూరమవుతున్నాయి. కార్పొరేట్ యజమానుల ముందు బానిస చాకిరీకి వారు నెట్టి వేయబడుతున్నారు.
బహుశా ‘ఎద్దు పుండు కాకికి రుచేగా! మోడీ భజన బృందం సంకీర్తన చేస్తున్నట్టు 40 కోట్ల మంది భారతీయ కార్మికులకు ఈ కోడ్‌లు నక్షత్ర మండలం నుండి తారలను తెంపితెచ్చి జేబుల్లో పెడతాయన్నంతగా బడాయి బండారం బహిర్గతం చేయడానికే ఈ వ్యాసం! మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకునే డంబాచార్యులు 40 కోట్లమందికి, మరీ ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన విషయం అటు త్రైపాక్షిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను 2015 నుండి పండబెట్టి, పార్లమెంటులో ప్రతిపక్షాన్ని రోడ్లపైకి నెట్టి 2020 సెప్టెంబరులో ‘మమా!’ అనిపించుకునే పద్ధతి పచ్చి నియంతల పాలనలో తప్ప ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ జరగదు. ఔట్‌డేటెడ్ చట్టాలతో దేశం ముందుకెలా పోతుందని మోడీ సాబ్ అంటుంటే ‘కేతి’గాళ్లు, బంగారక్కలంతా వహ్వా… వహ్వా అంటున్నారు. నాలుగు కోడ్‌లూ నోటిఫై అయిన తర్వాత అర్థమవుతున్న విషయమేమంటే సదరు 40 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులు వారి కుటుంబాలన్నీ చితికిపోవడానికీ, కార్పొరేట్లకు లాభాలు పోగేసి పెట్టడానికి ఈ కోడ్‌ల మార్గం సుగమం చేసిపెడతాయని అర్థమవుతుంది.
దేశంలో కార్మికులందరికీ కనీస వేతనాలు అందుతాయనీ, ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులకు ఏడాది కాగానే గ్రాట్యుటీ వస్తుందనీ, అందరికీ ఎనిమిది గంటల పనిదినం ఉంటుందనీ, కార్మికుల సంక్షేమం కోసం మోడీ సర్కార్ కట్టుబడి ఉందనే డైలాగులతో కథ ప్రారంభమైంది. ఈ నాలుగు కోడ్‌లు అంత:సంబంధం కలవి. అన్నీ కలిపి చూస్తేనే పాలకుల ‘మనసు’ అర్థం అవుతుంది. వీటి ప్రధాన ఉద్దేశం ఉమ్మడి జాబితాలోని ‘లేబర్’ను కేంద్రం నియంత్రణ లోకి తీసుకోవడం. రాజ్యాంగ సూత్రాలన్నింటినీ అతిక్రమించడం, కార్మికులకు సంబంధించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ప్రమాణాలను తోసిరాజనడం కీలకం. పారిశ్రామిక సంబంధాల కోడ్, ఆక్యుపేషనల్ సేప్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (ఓఎస్‌హెచ్ కోడ్ అని క్లుప్తంగా అంటాం) దగ్గర్నుండే ప్రారంభిద్దాం. ఐ.ఆర్.కోడ్ – బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం (1926). కార్మికుల వెనుకబాటు తనం, అవిద్య వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ యూనియన్ల ఆఫీసు బేరర్లలో 50 శాతం బయటివారు నాయకులుగా ఉండచ్చనే క్లాజు నాటి టియు చట్టంలో పొందుపరిచారు. వందేళ్ల తరువాత ఈ పరిస్థితిలో పెద్దమార్పు లేదు.
పైగా యాజమాన్యాల బెదిరింపులు, వేధింపులు పెరిగిన నేపథ్యంలో సంఘటిత రంగంలో మొత్తం ఆఫీసు బేరర్స్‌లో బయటివారు పావువంతు లేదా ఐదు మంది ఏది తక్కువైతే ఆ సంఖ్య మాత్రం ఉండాలని ఈ కోడ్ నియంత్రిస్తోంది. ఈ ఐఆర్ కోడ్ ఫిక్స్‌డ్‌టర్మ్ ఉపాధిని ‘శాశ్వతం’ చేస్తుంది. మోడీ భజన మండలి వికృతార్థాలు చెప్తున్నది దీనిపైనే! ఏ కార్మికుడైనా ఐదేండ్లు పనిచేస్తేనే ‘గ్రాట్యుటీ’ వస్తుంది కానీ ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికుడు ఏడాది చేసినా గ్రాట్యుటీ వస్తుందని ఇల్లెక్కి కూస్తున్నారు. ఈ ఫిక్స్‌డ్ టర్మ్‌ని 360 రోజులని ముందే ‘ఫిక్స్’ చేస్తే తీవ్రమైన నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగ యువత నెల రోజుల ఫిక్స్‌డ్‌టర్మ్‌కైనా ఎగబడదా?! గతంలో నిరంతరం, శాశ్వతంగా (పర్మినెంట్, పెరినియల్) ఉండే ఉద్యోగాల్లో కాంట్రాక్టు కార్మికుల్ని వినియోగించరాదని కాంట్రాక్టు కార్మిక (రెగ్యులేషన్ అండ్ అబాలిషన్) చట్టం 1970 పేర్కొన్నది. ఇపుడా చట్టం ఓఎస్‌హెచ్ కోడ్‌లో విలీనం అయిపోయింది. అంటే, ఆ రక్షణా కార్మికులకు లేదు. ఫిక్స్‌డ్ టర్మ్ ఉపాధి ఎన్ని రోజులు ఉండచ్చో, ఎన్నిసార్లు ఒక కార్మికుడ్ని ఫిక్స్‌డ్ టర్మ్‌లో వినియోగించవచ్చో ఈ కోడ్‌లో ఏమీ లేదు. ఆ పేరున దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతుంది.
మరో కీలకాంశం ఈ కోడ్ హైర్ అండ్ ఫైర్‌కు నాంది పలుకుతోంది. అంటే అవసరం ఉంటే పనిలో పెట్టుకోవడం, అవసరం లేకుంటే పీకి అవతల పారేయడమన్నమాట! గతం నుండి ఈ పద్ధతి కోసం పెట్టుబడిదారులు పరితపిస్తున్నారు. ఇంత కాలానికి పెట్టుబడి పాలిట దేవదూతలాగా మోడీ ‘కారణజన్ము’డై ‘ముందు గుజరాత్‌లో పుట్టాడు! ‘దేశం’ కోసం ఢిల్లీకి చేరాడు!’. దాంతో కార్పొరేట్ల చిరకాల కోరికైన ‘హైర్ అండ్ ఫైర్’ ఈ కోడ్ రూపంలో అమల్లోకొచ్చింది. కార్మికులను రిట్రెంచ్ చేయాలన్నా, ఫ్యాక్టరీ మూసివేయాలన్నా, దాన్లో ‘లే ఆఫ్’ ప్రకటించాలన్నా వందమంది కార్మికులుంటేనే సాధ్యం. ఇపుడా సంఖ్యను మూడు వందలకు పెంచారు ఈ ఐఆర్ కోడ్ ద్వారా! అంటే అత్యధికమంది కార్మికులు ఈ కోడ్ పరిధిలో నుండి బయటికి పోతారు. ఆ 300 సంఖ్యను ఇంకా పెంచాలంటే పార్లమెంటు ముందుకు పోనవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డరిచ్చుకుంటే చాలని కూడా దీన్లో ఉంది.
మరో దుర్మార్గమైన కోడ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (ఓఎస్‌హెచ్ కోడ్) ఫ్యాక్టరీ చట్టం, కాంట్రాక్టు కార్మికుల (రెగ్యులేషన్ అండ్ అబాలిషన్) చట్టంతో సహా పదమూడు చట్టాలను మింగేసి ఈ కోడ్ పుట్టింది. ఫ్యాక్టరీ నిర్వచనంలో కార్మికుల సంఖ్య పెరిగింది. కాంట్రాక్టు కార్మిక చట్టంలో కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవల్సిన కార్మికుల సంఖ్య పెరిగింది, కరెంటుతో నడిచే ఫ్యాక్టరీలైతే 10, కరెంటుతో నడవనివి 20 సంఖ్య 20, 40గా మారింది. ఆరవ ఎకనామిక్ సెన్సస్ ప్రకారం దేశంలోని వ్యవసాయేతర సంస్థల్లో 96.4 శాతం సంస్థలు 5 మంది అంతకు తక్కువగా కార్మికుల్ని వినియోగిస్తున్నాయి. ఇపుడున్న చట్టాల ప్రకారమే తొంభై శాతం పైగా కార్మికులు ఏ చట్ట పరిధిలోకిరారు. మన తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈల్లో సగటున 18.2 శాతం మంది కార్మికులున్నారని రాష్ట్ర గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో సూక్ష్మ (మైక్రో) పరిశ్రమలే ఎక్కువ. ఇవి సగటున ఇద్దరు, ముగ్గురినే నియమించుకుంటున్నాయి. వీరికి ఈ కోడ్‌వల్ల ఏ ఉపయోగమూ లేదు.
కాంట్రాక్టు కార్మిక చట్టం ప్రకారం ఇరవై మంది కార్మికులున్న కాంట్రాక్టరు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ సంఖ్యను యాభైకి పెంచేశారు అంటే కాంట్రాక్టర్ల యధేచ్ఛ దోపిడీకి తలుపులు బార్లా తెరిచేశారు. ప్రధాన యజమాని (ప్రిన్సిపుల్ ఎంప్లాయర్)ని బాధ్యతల నుండి తప్పించేశారు. త్రైపాక్షిక కాంట్రాక్టు కార్మిక అడ్వైజరీ బోర్డు రద్దు చేసేశారు. అంత: రాష్ట్ర వలస కార్మికుల చట్టం (1979) కూడా ఈ ఒఎస్‌హెచ్ కోడ్ మింగేసింది. వలస కార్మికుల సంఖ్యను 5 నుండి 10కి పెంచేశారు. వలస కార్మికులను కాంట్రాక్టు కార్మికుల పరిధిలోకి తెచ్చింది ఈ కోడ్. పైన చెప్పిన సవరణ ప్రకారం యాభై మంది వలస కార్మికులను ఏ రిజిస్ట్రేషన్ లేకుండా కాంట్రాక్టరు ద్వారా కార్పొరేట్ యజమానులు వినియోగిచుకోవచ్చు ఈ కోడ్ ద్వారా. ఈ కోడ్‌లోని ఒక పెద్ద మోసపు ‘అగాధం’ వర్కింగ్ కండిషన్స్ భాగం. సెక్షన్ 25(1)(ఎ)లో ఏ పరిశ్రమలోనూ, పారిశ్రామిక వాడల్లోనూ ఏ ఒక్క కార్మికుడ్నీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదంటూనే, క్లాజు 25 (1)(బి)లో క్లాజ్ (ఎ)లో చెప్పినట్లు ”ఎన్ని గంటలు పని ఉండాలో? ఎప్పుడు ఇంటర్వెల్ వుండాలో, ఎంత స్ప్రెడ్ ఓవర్ టైమ్ వుండాలో సంబంధిత ప్రభుత్వమే నిర్ణయిస్తుంది” అని రాశారు. అంటే పని గంటలు, వారానికి ఎన్ని పని గంటలు, మధ్యలో రెస్ట్ టైమ్, ఓటీ సమయం వంటివి నిర్ధిష్టంగా నిర్వచించకుండా ‘లూజ్’ దారాల్లా వదిలేశారు.
ఈ తాళ్లన్నీ కలిపి ముడేస్తేనే ఈ కోడ్ అసలు ‘స్వరూపం’ మనకు అర్థమవుతుంది. ఆ పని రూల్స్ చేశాయి. రూల్ 19 ప్రకారం 500 అంతకు ఎక్కువ మంది కార్మికులున్న పరిశ్రమల్లోనే సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 500 మంది, ఆ పైన కార్మికులున్న ఫార్మా కెమికల్ కంపెనీలు 60- 70 కి మించి లేవు. అలాంటి కంపెనీల్లోనే అంబులెన్స్ ఏర్పాటు చేస్తారు.250 కంటే తక్కువున్న చోట వెల్ఫేర్ ఆఫీసరే వుండడు. లంచ్ రూములు, రెస్ట్ రూములు, క్రెచ్ సౌకర్యం 50 మంది కంటే ఎక్కువ మంది కార్మికులున్న చోటే ఏర్పాటు చేస్తారు. ఇక వేజ్ కోడ్ అసలు చదవని వారు చెప్పేదంతా వుత్త సొల్లే! అందరికీ కనీస వేతనాలస్తాయట! ఈ కోడ్‌లో కనీన వేతనం నిర్వచనమే లేదు. గతంలో ఒక కార్మికుడు/ కార్మికురాలు వారి కుటుంబం బతికుండాలంటే పట్టణాల్లో, గ్రామాల్లో ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలో డా|| ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం లెక్కించాలనేది 1957 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్ణయం. దానికి అదనం 1992 నాటి రాప్టకాస్ బ్రెట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. దీని ప్రకారం కనీస వేతనం లెక్కించేవారు.
ప్రస్తుతం కేంద్రం నిర్ణయించిన ‘నేషనల్ ఫ్లోర్ లెవల్’ వేతనానికి తక్కువ ఏ రాష్ట్రంలో ఇవ్వరాదట! ‘సర్కారువారి పాట’ రోజుకి 178 రూపాయలు. అంటే నెలకి రూ.5340/-. గౌరవ ప్రదమైన జీవితానికిది ఒక మెట్టు అని బీజేపీ వారి వాదన. అంటే రాష్ట్రాలు రూ.180/- రోజు కూలీగా నిర్ణయించినా ఓకేనట! వేజ్ కోడ్‌లో కలిసిపోయిన నాలుగు చట్టాల్లో బోనస్ చట్టమొకటి. 1965 బోనస్ చట్టంలో కనిష్టంగా 8.33 శాతం, గరిష్టంగా 20 శాతం అని వుండేది. ఇప్పుడీ కోడ్‌లో ఏదీ లేదు. పైగా యజమాని సప్లై చేసిన బాలెన్స్ షీట్‌ను సందేహించరాదట. వారిచ్చిన బోనసే ఫైనల్.
ఇఎస్‌ఐ, ఇపిఎఫ్ వంటి తొమ్మిది చట్టాలు కలిసిపోయి సాంఘిక భద్రతా కోడ్ అవతరించింది. ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్ రావాలన్నా పదిమంది కార్మికులుంటేనే, ఈపిఎఫ్ రావాలంటే ఇరవై మంది కార్మికులుంటేనే వస్తుంది.
ఇంతకు ముందే చెప్పినట్లు అత్యధిక కంపెనీలు ఈ సంఖ్యకు తక్కువే చూపిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు ఫెసిలిటేటర్స్‌గా మారిపోయారు. యజమాని ఇచ్చే సెల్ఫ్ సర్టిఫికేషన్‌నే నమ్మమని కోడ్‌లు చెప్తున్నాయి. ఇంకో ముఖ్య విషమేమంటే జీఎస్‌టీ సంస్కరణల్లో భాగంగా సెస్ చట్టాలు రద్దు కావటం, అసంఘటిత కార్మికుల పాలిట మరణశాసన మైంది. కార్మికుల సాంఘిక భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం నుండి గానీ, యజమానుల వద్ద నుండిగానీ వచ్చే నిధుల్లేవు. బీడీ కార్మికుల కోసమే ఏర్పాటైన ఆస్పత్రులు మూసివేస్తున్నారు. ఆ కార్మికుల పిల్లలకు విద్యనందించే స్కీములు అటకెక్కాయి. మోడీగారి రందంతా కార్పొరేట్ల కోసమే! దానికోసం బుల్డోజర్లు, రోడ్‌రోలర్లు కష్టజీవుల జీవితాల్ని చిదిమేస్తున్నాయి. దానిలో భాగమే లేబర్‌కోడ్‌లు.
ఆర్.సుధాభాస్కర్



