కుటుంబ సభ్యుల నుంచే పెరుగుతున్న నేరాలు
కేంద్రం హౌంశాఖ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో మహిళల భద్రతకు రక్షణ కరువైంది. వారిపై దాడులు, హింస వంటి నేరాలు పెరిగిపోతున్నాయి. ఇందులో అధికంగా వారి భర్తలు, భర్తల కుటుంబ సభ్యుల నుంచే అధికంగా ఉంటున్నాయి. ఈ మేరకు 2024-25 ఏడాదికి సంబంధించి కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ (ఎంహెచ్ఏ) శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఎంహెచ్ఏ నివేదిక సమాచారం ప్రకారం.. దేశంలో 2024-25లో మహిళలపై నేరాలు క్రమంగా పెరిగాయి. మహిళలపై 2020లో 3,71,503 ఘటనలు, 2021లో 4,28,278, 2022లో 4,45,278 నేరాలు నమోదయ్యాయి. ఇందులో మెజారిటీ నేరాలు భర్తలు, వారి కుటుంబ సభ్యుల నుంచి జరిగే హింస (31.4 శాతం)కు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో మహిళల కిడ్నాప్, అపహరణ (19.2శాతం), స్త్రీ మర్యాదకు భంగం కలిగించే ఉద్దేశంతో ఆమెపై దాడి (18.7 శాతం), లైంగికదాడులు (7.1 శాతం) వంటి నేరాలు ఉన్నాయి. చాలా మంది మహిళలు హత్య, దొంగతనం, మోసాలకు బాధితులుగా ఉన్నారు.
2020 నుంచి 2021 వరకు మహిళలపై నేరాలు 15 శాతం పెరగగా.. 2021 నుంచి 2022కు నాలుగు శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2022 నాటికి ఒక లక్ష మంది మహిళా జనాభాకు గానూ మొత్తం నేరాల రేటు 66.4 శాతంగా ఉంది. అయితే ఇటువంటి నేరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్లను నమోదు చేయడాన్ని పోలీసులకు తప్పనిసరి చేయడం, పోలీసు సిబ్బందిలో అవగాహన పెంపు, విస్తృత అవగాహన కార్యక్రమాలు వంటి చర్యల కారణంగానే ఈ నేరాల నమోదులో పెరుగుదల ధోరణి ప్రధానంగా కనిపిస్తోందని ఎంహెచ్ఏ వివరించింది. ఇక చిన్నారులపై నేరాల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. 2020 నుంచి 2022 మధ్య పిల్లలపై నేరాలు పెరిగాయి. 2020లో వీటి సంఖ్య 1,28,531 కాగా.. అది 2021 నాటికి 1,49,404గా, 2022 నాటికి 1,62,449గా నమోదయ్యాయి. వీటిలో అత్యధిక నేరాల వాటా కిడ్నాప్, అపహరణ (45.7 శాతం)లది కావటం గమనార్హం. పోక్సో చట్టం కింద 39 శాతం కేసులు నమోదయ్యాయి. ‘జువైనల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా’ కింద 30,555 కేసులలో 37,780 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నట్టు ఎంహెచ్ఏ వివరించింది.



