లడాఖ్‌లో నిరసనోద్యమం, కాల్పుల్లో మరణాలు, అరెస్టులు ఒక్కసారిగా దేశమంతటా సంచలనం సృష్టించాయి. 9600 అడుగుల ఎత్తున చైనా-పాకిస్తాన్ సరిహద్దుల్లో అతి కీలకమైన సరిహద్దు ప్రాంతంగా ఉన్న లడాఖ్‌లో ఈస్థాయిలో ఇంత విస్తృతమైన ఆందోళన చెలరేగుతుందని నరేంద్రమోడీ ప్రభుత్వం వూహించివుండదు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తినిచ్చిన 370 అధికరణం 2019 మేలో తొలగించాక అంతా అద్భుతంగా మారిపోయిందని ఊదరగొట్టిన కేంద్రానికి ఇది పెద్దషాకే. కాశ్మీర్‌లో ముస్లింలు, హిందు వులు, బౌద్ధులు, సిక్కులు ఇలా అనేక మతాలవారున్నారు. ప్రత్యేకించి లడాఖ్‌లో బౌద్ధులే ఎక్కువ. గిరిజన ప్రాంతం. జమ్మూ, కాశ్మీర్, లడాఖ్ అనే మూడు భాగాలుగా కాశ్మీర్‌ను చూస్తే అన్నిటికన్నా పెద్దది లడాఖే. కానీ నాభా చాలా తక్కువ. లడాఖ్ ఆ ప్రాంతం పేరైతే లేహ్ దాని రాజధాని లాంటి కీలక నగరం. లడాఖ్‌లో గత నాలుగేండ్లుగా అనేక రూపాల్లో నిరసన సంకేతాలు కనిపిస్తున్నా, ఆ ప్రాంతంలో ప్రజలు ఘోషిస్తున్నా పెడచెవిన పెట్టినందుకు పర్యవసానం ఆ పరిణామాలు. సెప్టెంబరు 24న మొదలైన ఈ అలజడి చివరకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రాంగణందాకా పాకింది.
ఈ ఉద్యమానికి ప్రధాన నాయకుడుగా భావిస్తున్న పర్యావరణవేత్త వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి ఎ ఆంగ్మో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవంక లడాఖ్‌కు సంబంధించిన రెండు పాలక మండలులూ కేంద్రంతో చర్చలు జరపబోమని ప్రకటించాయి. ఏది ఏమైనా ఉద్యమకారుల నాలుగు న్యాయమైన కోర్కెలు పరిష్కరించేందుకు మాత్రం చొరవ చూపడం లేదు. పై పెచ్చు అదేదో విదేశీ ప్రేరతమన్నట్టు కథనాలు వదులుతున్నారు. పక్కనే ఉన్న నేపాల్‌లో జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం ఇక్కడా పడిందని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటే ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కూడా అలాంటివి రాకుండా చూసుకోవాలని వందేండ్ల వేడుకలో హెచ్చరించారు రెండు గొప్ప పొరుగు దేశాలైన భారత్, చైనాల మధ్య ఇటీవలనే చర్చల క్రమం పుంజుకోవడం స్వాగతించదగిందిగా ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడంపైనా సందేహాలు వ్యక్తం కాకపోలేదు.
కేంద్రమే కారణం
ఈ ఆందోళనలకు మూలమైందీ, ఆజ్యం పోసిందీ కేంద్రమే. లడాఖ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ప్రాంతానిది సుసంపన్నమైన చారిత్రిక నేపథ్యం.చైనాలోని టిబెట్ నుంచి అక్కడకు బౌద్ధం క్రీశ 950లనుంచి 1834 వరకూ వ్యాపించింది. ఆ విధంగా ఆ ప్రాంతం సాంస్కృతికంగా ప్రత్యేకంగా ఉండిపోయింది. 1834లో కాశ్మీర్‌ను పాలించిన డోగ్రా రాజులు లడక్‌ను ఆక్రమించారు. అలా కలసిపోయిన లడాఖ్ స్వాతంత్య్రానంతరం కొంతకాలానికి భారత దేశంలో భాగమైంది. కాశ్మీర్‌లో హిందూ రాజు, ముస్లిం జనాభా ఆధిక్యత ఉండగా లడాఖ్ బౌద్ధానికి నెలవైంది.1979లో లడాఖ్, కార్గిల్ జిల్లాలుగా విభజించారు. లడఖ్‌లో బౌద్ధులు అధికంగా ఉండగా కార్గిల్‌లో ముస్లింలు అధికం. మొత్తంగా చూస్తే బౌద్ధులు 77.3శాతం, ముస్లింలు 13.75 శాతం, హిందువులు 8.16శాతం ఉంటారు. మొత్తం జనాభాలో 97శాతం గిరిజనులతో వెనకబడివుంది. అంత ఎత్తులో కొండలు, కోనల మధ్య లడాఖ్ వెనకబాటుతనం కారణంగా ప్రత్యేక ప్రతిపత్తినివ్వాలనే కోర్కె ఎప్పటినుంచో ఉండేది. ఎట్టకేలకు 1995లో లడాఖ్ కొండిపాంత స్వయం పాలనా మండలి ఏర్పాటైంది. ఈ మండలికి అధికారాలు స్వల్పమైనా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని ప్రజలు సంతోషించేవారు.1997లో దాన్ని మరింత విస్తరించారు.
స్థానిక అంశాలకు సంబంధించి అనేక నిర్ణయాలు అదే తీసుకునేది. అయితే 2019లో మోడీ సర్కారు కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఉపసంహరించడమే గాక శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. లడాఖ్‌ను శాసనసభా రహిత కేంద్రపాలిత ప్రాంతంగా విడగొట్టింది. ఇప్పుడు కేంద్ర పాలనలో అతి పెద్ద ప్రాంతం అదే. ఈ క్రమంలో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు లడాఖ్‌కు ఉన్న స్వయం పాలనా మండలి కూడా పోయింది.ఇది నిజానికి దశాబ్దాల తరబడి లడాఖ్ ప్రజలు కోరుకుంటున్న దానికి పూర్తి వ్యతిరేక, అప్రజాస్వామిక చర్య. దీనివల్ల జరిగిందేమంటే లడాఖ్ ప్రాంతం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే శాసనవ్యవస్థ అంటూ లేకుండా పోయింది. కార్గిల్,లడాఖ్‌లకు వేర్వేరు పాలన మండలులు ఏర్పడినప్పటికీ అంతకుముందున్న పరిమిత అధికారాలూ లేకుండా పోయాయి. కొండిపాంతాలుగా పర్యావరణ పరిరక్షణ, స్థానికుల సాంస్కృతిక ప్రత్యేకతలు,హక్కులు కాపాడుకోవడం అటుంచి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి 26 శాతం దాటింది.కేంద్రం నుంచి కనీస సహాయం కూడా అందని పరిస్థితి.
కార్పొరేట్ల చొరబాటు
లడాఖ్‌లో లే అపెక్స్ బాడీ(లాబ్), కార్గిల్‌లో కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్(కెడిఎ) పనిచేస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలున్నాయి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలు అలాంటి ఏర్పాటే. అయితే గతంలో ఉన్నది తీసేసి కొత్తగా చేర్చకపోవడంతో లడాక్ కార్పొరేట్ల స్వర్గధామంగా మారి పోయింది. పర్యాటక పరిశ్రమ విస్తరణ, సంపద సృష్టి పేరుతో బడా కంపెనీలు అక్కడ చొరబడి విచక్షణా రహితంగా నిర్మాణాలు చేస్తూ ప్రకృతి విధ్వంసానికి, ప్రజల ఉపాధి దెబ్బతీయడానికి కారణమయ్యాయి. విలువైన ఖనిజ సంపద, గనులు కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆఖరుకు స్థానికులు గొర్రెలు మేపుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు దాపురించాయి. కేంద్రంలో ఉండి ఇందుకు ఆధ్వర్యం వహిస్తున్న బీజేపీ,సంఫ్‌ు పరివార్‌లు హిందూత్వ భావజాలంతో అక్కడ వైవిధ్యాన్ని గుర్తించకపోగా నాశనం చేసి ఏకరూపత రుద్దేందుకు పథకాలు వేశాయి. సరిహద్దుల్లోని సున్నితమైన ప్రాంతం గనక సైనిక దళాల ప్రభావం ఎక్కువగా ఉండేది.
1999లో పాకిస్థాన్ సైన్యం కార్గిల్ చొరబాటు, 2020లో భారత్-చైనాల గాల్వాన్ ఘర్షణ అక్కడే కావడం గమనార్హం. దేశ రక్షణ భద్రత తప్పక చూడవలసిందే గాని ఈ క్రమంలో స్థానిక ప్రజలు పర్యావరణ సాంస్కృతిక నేపథ్యం పట్టించుకోకపోవడం భరించలేని స్థాయికి చేరింది. సైనిక దళాలకు స్థానికుల సహకారమందినా ఏకపక్ష పెత్తనాన్ని, హక్కుల హరింపును మాత్రం నిరసిస్తున్నారు. ”ఇక్కడ ప్రజలు సైనికుల పట్ల ఎప్పుడూ గౌరవంగానే ఉంటూ సహకరించేవారు. అయితే వారిపై దేశ వ్యతిరేకులుగా ముద్రవేయడం మాత్రం సహించలేకపోయారని” మాజీ లెఫ్టినెంట్ జనరల్ దీపేందర్‌సింగ్ హుడా అసలు సమస్య చెప్పారు. మొత్తంగా కాశ్మీర్ ప్రతిపత్తికే ఎసరు పెట్టిన మోడీ సర్కారు లడాఖ్ ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయడం,వనరులు కబళించేందుకు అవకాశమివ్వడంతో పరిస్థితి చివరకు కాల్పుల వరకూ వెళ్లింది.
వాంగ్‌చుక్ ఆందోళన
ఈ ఆందోళన సందర్భంగా ప్రముఖంగా వినవచ్చిన పేరు సోనం వాంగ్‌చుక్.అరవై ఏండ్ల వాంగ్‌చుక్ ఇంజ నీరింగ్ చదివారు. కేవలం గిరిజన భాష మాత్రమే తెలిసిన ఆయన శ్రీనగర్‌లో చాలా కష్టపడి చదువు కున్నారు.1997లో ఢిల్లీ వెళ్లి కేంద్రీయ విద్యాలయంలో పై చదువు పూర్తిచేశారు.విద్యారంగంలో మునిగిపోయిన వాంగ్‌చుక్ లడఖ్‌లో ఏకైక పత్రిక లడక్ మెలాంగ్ సంపాదకుడిగా పనిచేశారు.ఆయన జీవితం ఆధారంగానే త్రీ ఇడియట్స్‌లో అమీర్‌ఖాన్ పాత్ర రూపొందింది. మొదట్లో మోడీ చర్యలు కొన్నింటిని వాంగ్‌చుక్ గొప్పగా హర్షించారు, కానీ త్వరలోనే ఆయనకు వాస్తవం తెలిసివచ్చింది. వాంగ్‌చుక్ నాయకత్వంలోనే గతేడాది సెప్టెంబరులో అష్టకష్టాలు పడి కాలినడకన ఢిల్లీకి యాత్రగా వెళ్లారు.వారిని భద్రతా బలగాలు సరిహద్దులోనే ఆపేశాయి.24 గంటల తర్వాతనే వారిని రాజ్‌ఘాట్ వెళ్లనిచ్చాయి.జంతర్‌మంతర్‌లో పదిమందితో నిరాహారదీక్ష చేస్తామంటే అనుమతి దొరకలేదు.లడఖ్ భవన్ దగ్గర నిరాహారదీక్ష చేసి హామీలతో విరమించిన వాంగ్‌చుక్ అవి అమలు కావని తేలిపోయాకే ఏడాది తర్వాత ఈ దఫా ఉద్యమం మొదలుపెట్టారు.
లడఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నివ్వాలనే కోర్కెతో సహా ఆరవ షెడ్యూలు, కొండిపాంత స్వయం పాలనాధికారం కల్పించాలనీ, స్థానికులకు ఉద్యోగావకాశాలు, ఆస్తి కొనుగోలు హక్కులు పరిమితం చేయాలనీ,సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలనీ, రెండు లోక్‌సభ స్థానాలివ్వాలనీ నాలుగు కోర్కెలతో అక్కడ ఉద్యమాలు నడుస్తూ వచ్చాయి. స్వయం పాలనా మండలిలోనూ 95శాతం ఆదివాసులకు రిజర్వు చేయాలనీ మహిళలకు 33 శాతం ఉండాలని గట్టిగా కోరుతున్నారు.ఈశాన్య ప్రాంతంలో అసోం, మేఘాలయ, త్రిపుర వంటి చోట్ల అప్పటికే ఇలాంటి మండలులున్నాయి. లడాఖ్‌లో రెండు స్రవంతులుండేవి. బౌద్ధం అధికంగా ఉండే లేహ్ లో కేంద్ర పాలిత ప్రాంతాన్ని కోరుకుంటే, ముస్లింలు అధికంగా ఉండే కార్గిల్‌వాసులు కాశ్మీర్‌తో తమను విలీనం చేయాలనే కోర్కె వినిపిస్తుండేది. అయితే కేంద్రం ఏకపక్ష వైఖరి వల్ల రెండు చోట్ల ఒకేతాటిపైకి వచ్చి ఆందోళన మొద లెట్టారు. దేశంలో ఉండేవారంతా హిందువులేనని చెప్పే ఆరెస్సెస్, కేంద్ర బీజేపీలకు ఇది బొత్తిగా మింగుడు పడని పరిణామమైంది.
ఎందుకంటే ఇక్కడ ఇతర మతాలవారే అధికం, కాగా ఐక్యంగా నిలిచిన నాయకత్వం కూడా వారిదే. మొత్తంగా కాశ్మీర్‌నే అదుపులోకి తెచ్చేశామన్న మాటలు బూటకం కాగా సరిహద్దు ప్రాంతంలో నిప్పు రాజుకోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. మే25న ఒప్పందం కుదిరినా కేంద్రం అమలు చేయలేదు. దాంతో సెప్టెంబరు 9 నుంచి 24 వరకూ నిరాహారదీక్షలు నిర్వహించారు. 25న షట్‌డౌన్ పేరిట అన్నీ మూసి వేయాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలోనే నిరసనకారులు బీజేపీ కార్యాలయంపైన కూడా నిరసనగా వెళ్లారు. కాల్పులు జరగ్గా నలుగురు చనిపోవడంతో ఆందోళన రాజుకుంది. మణిపూర్‌లో ఉద్రిక్తతలు బాగా తెలిసినవే. కాగా త్రిపురలోనూ త్రిప్తా మోతా అనే గిరిజనుల పార్టీ తమను మోసం చేశారని ఆందోళనకు దిగింది. ఈ విధంగా కేంద్రం తీరుపై గిరిజన ఆదివాసీ ప్రాంతాలన్నిటా నిరసన పెరుగుతున్నది. లడాఖ్ వాసుల న్యాయమైన కోర్కెల దృష్ట్యా కేంద్రం వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలి. దాంతో పాటుగా మొత్తం జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని పునరుద్ధరించాలి, ముఖ్యమంత్రి ఒమర్ అబ్డుల్లాను కూడా కదలకుండా నిర్బంధించే ప్రస్తుత పరిస్థితి దేశానికి క్షేమదాయకం కాదు.
తెలకపల్లి రవి