కులవృత్తే రజకుల జీవనాధారం.. ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం 25వ వార్షికోత్సవం
నవతెలంగాణ – ముషీరాబాద్
కుల వృత్తిపై ఆధారపడే అత్యధిక రజకులు జీవనం సాగిస్తున్నారని, నేటికీ వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్రంగా వెనుకబాటుకు గురయ్యారని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం 25వ వార్షికోత్సవ సభ జరిగింది. సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. రజక వృత్తిదారుల సంఘం ఎన్నో పోరాటాలు నిర్వహించి ఎన్నో ఫలితాలు సాధించిందని అభినందించారు. నేటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అత్యధిక రజకులు కుల వృత్తులపైనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు వారి సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలో బీసీ రిజర్వేషన్లు 42 శాతాన్ని వెంటనే అమలు చేసి, ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని కోరారు.
పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, మోడ్రన్ దోబిఘాట్లకు నిధులు కేటాయించాలని, రజకుల వృత్తి స్థలాలకు హక్కు పత్రాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ పథకం ఏర్పాటు చేయాలన్నారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ మాట్లాడుతూ.. చేతి వృత్తిదారులు.. సేవా వృత్తిదారుల్లో ప్రధానంగా రజకులు ఉన్నారని, వారి సంక్షేమ, సామాజిక భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సభలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, ప్రజా సంఘాల నాయకులు గుమ్మడి రాజు, నాగరాజు, ఎం.బాలకృష్ణ, సి.మల్లేష్, జ్యోతి ఉపేందర్, సీహెచ్.వెంకటస్వామి, సుభద్రమ్మ పాల్గొన్నారు.