Wednesday, January 21, 2026
E-PAPER
Homeజాతీయం40 ఏండ్లకే లేఆఫ్‌ !

40 ఏండ్లకే లేఆఫ్‌ !

- Advertisement -

ప్రశంసే తప్ప ప్రోత్సాహం కరువు
కార్పొరేట్‌ ఇండియా జాబ్‌ మార్కెట్‌లో నయా ట్రెండ్‌
సీనియర్లకు పొమ్మనలేక
పొగ పెడుతున్న యాజమాన్యాలు
న్యూఢిల్లీ :
నలభై సంవత్సరాల వయసు వచ్చే సరికి చేస్తున్న పనిలో చాలినంత అనుభవం వస్తుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ కార్పొరేట్‌ భారతావనిలో అదే శిరోభారంగా మారుతోంది. తక్కువ జీతాలు చెల్లించి యువతను ఉద్యోగాలలో పెట్టుకునేందుకు కంపెనీలు పోటీ పడుతుండడంతో ఈ మధ్య వయస్కులకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. యాజమాన్యాలు వారిని పక్కన పెడుతున్నాయి. పొమ్మనలేక పొగ పెడుతూ ఇంటికి సాగనంపుతున్నాయి. వృత్తిపరంగా నైపుణ్యం సాధించిన వారు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరతారు. అనుభవం పరిణితి చెందుతుంది. తమ రంగంలో ప్రభావవంతంగా ఉంటూ, నాయకత్వ స్థానంలోకి వెళతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వయసును నైపుణ్యానికి పరాకాష్టగా భావించవచ్చు. కానీ ప్రస్తుతం దేశంలో అలాంటి ప్రతిభావంతులకే కష్టకాలం దాపురించింది.

తలుపులు మూసుకుపోతాయి
దేశంలో జనాభా పెరుగుతున్నందున 40 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు ఓ విభజన రేఖ. ఒకప్పుడు అవకాశాలకు తలుపులు తెరిచిన అనుభవం… నిశ్శబ్దంగా, ఎలాంటి ముందస్తు సంకేతం లేకుండా తలుపులు మూసేస్తుంది. ఎందుకంటే ఆ వయసు వారికి ఉద్యోగాలు లభించవు. ఉద్యోగంలో ఉన్న వారిని పదోన్నతులు నెమ్మదిస్తాయి. యువ సహచరులు యాజమాన్యాల మెప్పు పొందుతుంటారు. వారిలో సామర్ధ్యం పాలు ఎక్కువగా ఉన్నదంటూ ప్రశంసిస్తారు. దశాబ్దాల అనుభవం ఎందుకూ కొరగాకుండా పోతుంది. వారికి ఇస్తున్న జీతాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని యాజమాన్యాలు భావిస్తాయి. వారు ఈ పని సంస్కృతికి పనికిరారని తేల్చేస్తాయి. చివరికి ఎలాగోలా వదిలించుకోవాలని నిర్ణయించుకుంటాయి.

కెరీర్‌ పోరు ప్రారంభ దశలో కష్టాలు
వేగం, కొత్తదనం, యువరక్తంతో కూడిన ఈ ఆర్థిక వ్యవస్థలో 40 సంవత్సరాల వయసు ఎందుకూ పనికి రాకుండా పోతోంది. అనుభవాన్ని ప్రశంసిస్తారే తప్ప ప్రోత్సహించరు. వాస్తవానికి చాలా మంది నిపుణులకు ఈ వయసులో నిజమైన కెరీర్‌ యుద్ధం మొదలవుతుంది. నలభై దాటిన ఉద్యోగులకు దేశీయ కార్పొరేట్‌ నిచ్చెన అనేక దశాబ్దాలుగా గొప్ప గొప్ప ప్రోత్సాహకాలను వాగ్దానం చేస్తోంది. 40 సంవత్సరాల వయసులో నాయకత్వ బాధ్యతలు చేపట్టి స్థిరత్వాన్ని సాధిస్తారు. కొన్ని అధికారాలు కూడా సంక్రమిస్తాయి. అప్పటి వరకూ సాధించిన నైపుణ్యం ఓ శక్తిగా మారుతుంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అవేవీ మచ్చుకైనా కన్పించడం లేదు. అనేక రంగాలలో కెరీర్‌ మధ్యలో ఉన్న నిపుణులు ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. యాజమాన్యాల నుంచి తిరస్కరణలు పెరుగుతున్నాయి. నియామకాలలో అనుభవానికి ఏ మాత్రం ప్రాధాన్యత లభించడం లేదు. చురుకైన యువకుల కోసం ఎదురు చూస్తున్నామనో, ఈ ఉద్యోగానికి నూతనోత్సాహం అవసరమనో చెప్పి తప్పించుకుంటారు. లేదంటే మీ ప్రొఫైల్‌లో అర్హతలు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు. ఏతావాతా చెప్పేదేమంటే 40 సంవత్సరాలు దాటిన వారిని వదిలించుకునేందుకే మొగ్గు చూపుతారు.

వారికే ప్రాధాన్యం
30 సంవత్సరాలకు చేరువలో ఉన్న వారికి, అప్పుడే 30 సంవత్సరాలు దాటిన వారికి యాజమాన్యాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే వారిని తమకు నచ్చిన రీతిలో మలచుకోవచ్చు. అంతేకాక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు సులభంగా అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా స్టార్టప్‌లు, డిజిటల్‌ సంస్థలు ఇలాంటి వారిని ఉద్యోగాలలోకి ఆహ్వానిస్తున్నాయి. నియామకాలు జరిపేటప్పుడు తక్కువ ఖర్చు, పనిలో వేగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అనుభవజ్ఞులు, సమర్థులు ఇప్పుడు మార్కెట్‌లో పెద్దగా కన్పించడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -