క్వార్టర్స్‌లో ఆయుష్‌పై సాధికార విజయం
సాత్విక్, చిరాగ్ జోడీ సైతం ముందంజ
హాంగ్‌కాంగ్ ఓపెన్ సూపర్ 500
హాంగ్‌కాంగ్ : ఈ ఏడాది వరుస టోర్నమెంట్లలో నిరాశపరిచిన భారత స్టార్ షట్లర్, పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనలిస్ట్ లక్ష్యసేన్ హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బిడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నమెంట్‌లో సెమీఫైనల్లో అడుగుపెట్టిన లక్ష్యసేన్.. సహచర షట్లర్ ఆయుష్ శెట్టిపై సాధికారిక విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 21-16, 17-21, 21-13తో లక్ష్యసేన్ పైచేయి సాధించాడు. 66 నిమిషాల పాటు ఉత్కంఠగ సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో నెగ్గిన లక్ష్యసేన్.. ఆయుష్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కీలక రెండో గేమ్‌ను గెల్చుకున్న ఆయుష్.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. డిసైడర్‌లో 9-9 వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌ను లక్ష్యసేన్ చేతుల్లోకి తీసుకున్నాడు. 11-9తో విరామ సమయానికి ముందంజ వేసిన లక్ష్యసేన్.. 16-13 తర్వాత వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 21-13తో మూడో గేమ్‌తో పాటు సెమీఫైనల్ బెర్త్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ కొడాయ్ నరొకపై గెలుపొందిన ఆయుష్ శెట్టి.. క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ ముంగిట తలొగ్గాడు. భారత షట్లర్లు ప్రణయ్, ఆయుష్‌లపై విజయాలతో లక్ష్యసేన్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.
పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నం.9 జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు సైతం సెమీఫైనల్లో కాలుమోపారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మలేషియా షట్లర్లు జునైది, రాయ్ కింగ్‌లపై21-14, 20-22, 21-16తో గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. తొలి గేమ్ నెగ్గిన సాత్విక్ జోడీ.. రెండో గేమ్‌ను టైబ్రేకర్‌లో చేజార్చుకున్నారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను స్పష్టమైన ఆధిక్యంతో సొంతం చేసుకుని సెమీస్ బెర్త్ బుక్ చేసుకున్నారు. నేడు జరిగే పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ చైనీస్ తైపీ షట్లర్ చో చెన్‌తో లక్ష్యసేన్ ఆడనుండగా.. అన్‌సీడెడ్ చైనీస్ తైపీ జోడీ చెన్, లిన్‌లతో సాత్విక్, చిరాగ్‌లు పోటీపడనున్నారు.