– పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
– భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు
– ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు
– పోలీసుల పటిష్ట బందోబస్తు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహానగరంలో బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం నగరవ్యాప్తంగా ఆషాడ మాసపు బోనాలు వైభవోపేతంగా జరిగాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. దాంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి మహిళలు.. భక్తిశద్ధ్రలతో బోనాలు సమర్పించారు. బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని అమ్మవార్ల ఆలయాల్లో ఉదయం నుంచే పోతురాజుల విన్యాసాలు, డప్పుల చప్పులతో భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలతో దేవాలయాలు సందడిగా మారాయి. సాయంత్రం ఫలహార బండ్లను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేవాలయాల అభివృద్ధికి 1290 కోట్లు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన్ను ఆలయ మర్యాదలతో అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం దేవాలయ పునరుద్ధరణ పనులకు రూ.1290 కోట్లు కేటాయించిందన్నారు. బోనాలను వైభవోపేతంగా నిర్వహించుకునేందుకు రూ. 20 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. భవిష్యత్తులోనూ జరిగే బోనాల జాతరలను ఇంకా మెరుగైన రీతిలో చేపట్టడం కోసం ఈ ప్రాంత అభివృద్ధితో పాటు సింహవాహిని మహంకాళి దేవాలయ అభివృద్ధికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతనెల 26న నగరంలో ప్రారంభమైన బోనాల నుంచి ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి సంఘటనలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖ అధికారులు నిబద్ధత, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అధికారుల్ని డిప్యూటీ సీఎం అభినందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఒక విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నెలరోజుల బోనాల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అనేక కళా ప్రదర్శనలు చేపట్టామనీ, ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..
మహంకాళి అమ్మవారిని హైకోర్టు జడ్జి ఎస్.నంద దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, కమిటీ సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకాటి శ్రీహరి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి వైస్ చైర్మెన్ బండా ప్రకాష్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, పిషరీస్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావు, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, పోలీస్ అధికారులు, భక్తులు తదితరులు ఉన్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాననీ, ప్రమాదాలు జరగకుండా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు, పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
ఘనంగా లాల్‌దర్వాజ బోనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES