కామ్రేడ్ అచ్యుతానందన్‌కు కన్నీటి వీడ్కోలు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
భారీగా తరలివచ్చిన జనం
హాజరైన సీపీఐ(ఎం) అగ్రనేతలు
కామ్రేడ్ వీఎస్ అచ్యుతానందన్… ఆ పేరే ఓ ఉద్యమ స్ఫూర్తి. వీఎస్ మరణించినా ఆ స్ఫూర్తి నిలిచే ఉంటుంది అనడానికి బుధవారం జరిగిన ఆయన అంత్యక్రియలే సాక్ష్యం. విషణ్ణవదనాలతో వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం ‘లాల్‌సలామ్ కామ్రేడ్’ అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ‘నీ ఆశయాలు కొనసాగిస్తాం’ అని ప్రతిజ్ఞ పూనారు. అంత్యక్రియలకు సీపీఐ(ఎం) జాతీయ నాయకత్వం మొత్తం హాజరైంది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా పార్టీ సభ్యులు, వీఎస్ సన్నిహితులు, సానుభూతిపరులు తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు తరలివచ్చారు. ప్రజలతో వీఎస్ జీవితం ఎంతలా మమేకం అయ్యిందో ఆ అంతిమయాత్రను చూస్తే అర్థమవుతుంది. అందరి మనసుల్లో ఒకే నినాదం… ‘నువ్వెక్కడికీ పోలేదు కామ్రేడ్…మా గుండెల్లో నీ రూపం, స్ఫూర్తి ఎప్పటికీ అజరామరం’ ఈ మాటలే ఆ ప్రాంతంలో వినిపించాయి. జోహార్ కామ్రేడ్ వీఎస్… లాల్ సలామ్!!
అలప్పుజ : కమ్యూనిస్టు యోధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో అలప్పుజ జిల్లా వాలియా చుడుక్కాడ్ వద్ద పున్నప్ర-వాయలార్ అమరవీరుల స్మారకం వద్ద బుధవారం సాయంత్రం జరిగాయి. పి.కృష్ణ పిళ్ళై, టి.వి.థామస్, ఎన్.శ్రీధరన్, పి.కె.చంద్రనందన్, కె.ఆర్.గౌరిలతో సహా ప్రముఖ కమ్యూనిస్టు నేతలు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతానికి సమీపంలోనే అచ్యుతానందన్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆర్‌వీ ఆర్లేకర్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి, ప్రకాశ్‌కరత్, బృందాకరత్, బిమన్ బసు, బివి రాఘవులు, విజయరాఘవన్, విజ్జుకృష్ణన్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అచ్యుతానందన్ కుమారుడు డాక్టర్ వీఏ అరుణ్‌కుమార్ రాత్రి 9 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు అలప్పుజలోని పరావుర్‌లోని వీఎస్ నివాసం నుంచి వెల్లిక్కకథుకు ఆయన భౌతికకాయం బుధవారం మధ్యాహ్నానికి చేరుకుంది. వేలాదిమంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల కన్నీటి నివాళితో ఆ ప్రాంతమంతా విషాద మయంగా, భారంగా మారింది. రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ రంగాలకు చెందినవారు ప్రియతమ నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. 96 ఏండ్ల అచ్యుతానందన్ సోదరి అళికుట్టి మౌనంగానే తన అన్నకు తుది వీడ్కోలు పలికారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఆమె గత కొన్ని నెలలుగా మంచా నికే పరిమితమయ్యారు. ఒకప్పుడు స్ఫూర్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఆ చెల్లెలు నేడు తన అన్న మరణవార్తను ఎలాంటి హావభావాలు లేకుండా మౌనంగా విన్నారు.
150 కి.మీ., దూరానికి 22గంటలు
తిరువనంతపురం నుంచి పరావుర్‌కు మధ్య దూరం దాదాపు 150 కిలోమీటర్లు. అంతిమయాత్ర వాహనం ఈ దూరాన్ని చేరుకోవడానికి 22 గంటలకు పైగా సమయం పట్టింది. తమ మనస్సులకు దగ్గరైన ప్రజానేత మృతి వార్తకు ప్రజలు ఎంతగా కదిలిపోయారో, తమ ఆవేదనను ఎలా వ్యక్తం చేశారో, కడసారిగా ఒకసారి చూద్దామని ఎంతలా తహతహలాడిపోయారో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వీఎస్ తన ఆరోగ్యం సహకరించేంతవరకూ ఇక్కడకు ఎక్కువగా వస్తూనే వుండేవారు. పున్నప్ర అమరవీరులకు అంజలి ఘటించేవారు. పున్నప్ర చారిత్రక తిరుగుబాటు 73వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చివరిసారిగా ఇక్కడకు వచ్చారు. పరావుర్‌లోని ఆయన నివాసం వెళిక్కకథుకు భౌతికకాయం చేరుకున్న వెంటనే తొలుత ఇంట్లోకి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్ధం ఇంటి ఆవరణలో వుంచారు. దశాబ్దాలుగా తమ వెన్నంటి వుండి నడిపించిన తమ నాయకుడికి తుది వీడ్కోలు పలికేందుకు మంగళవారం సాయంత్రానికే చేరుకున్న వేలాదిమంది ప్రజలు విషణ్ణ వదనాలతో మౌనంగా నిలుచుని వుండడం కనిపించింది. వెళిక్కకథు నివాసం నుంచి బయలుదేరిన తర్వాత సీపీఐ(ఎం) అలప్పుజ జిల్లా కార్యాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ కాసేపు ఉంచారు. పార్టీ కార్యకర్తలందరూ నివాళులర్పించిన తర్వాత అంత్యక్రియలు జరిగే వేదికవద్దకు తీసుకువచ్చారు.
మహోజ్వలంగా సాగిన పున్నప్ర-వాయలార్ తిరుగుబాటు ఉద్యమ అమరులు శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్న వాలియాచుడుక్కాడ్ నేల మరో యోధునికి ఆశ్రయమిచ్చింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగానే చేరుకున్న వేలాదిమంది ప్రజలు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వాలియా చుడుక్కాడ్ వద్ద సీపీఐ(ఎం), సీపీఐ పతాకాలను అవనతం చేశారు. సంతాప సూచకంగా నల్ల జెండాలను ఎగురవేశారు. లాల్ సలామ్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అంత్యక్రియలను పురస్కరించుకుని అలప్పుజ జిల్లా యంత్రాంగం అన్ని కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు బుధవారం సెలవు దినంగా ప్రకటించింది.
నినాదాల హోరు
లాల్ సలామ్… మా హృదయాల్లో వీఎస్ చిరస్థాయిగా నిలిచి వుంటారు…ఇలాంటి నేతను మరొకరిని చూడలేం… వంటి నినాదాలతో ఆ ప్రాంతాలన్నీ హోరెత్తాయి. పైనుంచి పడుతున్న వర్షపు ధారలను కూడా లెక్కచేయకుండా, కదలకుండా, మెదలకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా నిలిచేఉన్నారు. వీఎస్ అంటే కేవలం రాజకీయ నేత కాదు, కేరళ మనస్సాక్షి. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, పార్టీ కార్యదర్శిగా ఆయన తుదికంటా ప్రజాసేవలోనే తరించారు. నోరు లేని బడుగుజీవుల వాణిగా నిలిచారు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా తాను నమ్మిన ఆశయాలు, ఆదర్శాలను వీడలేదు. అటువంటి నేత తమను వీడి వెళ్లినపుడు ఆయన అభిమానులు కూడా అంతే నిబద్ధతను ప్రదర్శించారు. గంటలతరబడి నిలుచుని మరీ తమ నేతను చూసుకుని కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
లాల్ సలామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES