భారత విమానాశ్రయాల అథారిటీకి అప్పగింత
కాకతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా టెర్మినల్ : రామ్మోహన్ నాయుడు
చరిత్రలో నిలిచిపోయే రోజు : భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూమిని గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విమానయాన విభాగం డైరెక్టర్ భారత్‌రెడ్డి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, రోడ్లు, భవనాలు, రవాణా శాఖల సీనియర్ అధికారులు, భారత విమానాశ్రయాల అథారిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశంలో ప్రాంతీయ వైమానిక అనుసంధానాన్ని విస్తృతంగా పెంచుతూ సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మామునూరు విమానాశ్రయాన్ని త్వరితగతిన కార్యాచరణలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భూసేకరణను సమయపాలనతో, సమర్థవంతంగా పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. భూముల అప్పగింత అనంతరం మామునూరు విమానాశ్రయ అభివృద్ధి వ్యయం మొత్తాన్ని భారత విమానాశ్రయాల అథారిటీ భరిస్తుందని చెప్పారు. ప్రతిపాదిత ప్రాజెక్టులో 2,500 మీటర్ల రన్‌వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, అగ్నిమాపక, భద్రతా సదుపాయాలు, అనుబంధ మౌలిక వసతుల నిర్మాణం ఉంటాయని వివరించారు.
నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండు లేదా రెండున్నరేండ్లలో విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మామునూరు విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని కాకతీయుల శిల్పకళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేస్తామని అన్నారు. ఇది కేవలం రవాణా సదుపాయంగా కాకుండా, ప్రాంతీయ గుర్తింపును ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒక విమానాశ్రయం ఎలా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, పట్టణాభివృద్ధికి దోహదపడుతుందో వివరించారు. అదే విధంగా మామునూరు విమానాశ్రయం వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన భూమిని అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు.
నిజాం కాలంలో 1930లో నిర్మితమైన ఈ విమానాశ్రయం స్వాతంత్య్రానికి ముందు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందిందని వివరించారు. ఒకప్పుడు ప్రధాన వైమానిక కేంద్రంగా ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించడం ద్వారా వరంగల్ చారిత్రక ప్రాధాన్యతను తిరిగి తీసుకురావడంతోపాటు ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూసేకరణను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణతోపాటు అవసరమైన అన్ని అనుమతుల ప్రక్రియ పూర్తిచేసి, వాటి క్లియరెన్స్ సర్టిఫికెట్లను కేంద్ర పౌర విమానయాన శాఖకు అందజేయడం గర్వకారణమని అన్నారు.
రైతులను ఒప్పించి, వారికి న్యాయం చేస్తూ భూసేకరణ పూర్తిచేయడం రాష్ట్ర ప్రభుత్వ సమిష్టి కృషి ఫలితమని చెప్పారు. ఈ విమానాశ్రయం ద్వారా పరిశ్రమలు, టెక్స్‌టైల్ పార్కులు, కార్గో రవాణా, పర్యాటకం విస్తరించి వరంగల్-కరీంనగర్, వరంగల్-ఖమ్మం, వరంగల్-హైదరాబాద్ కారిడార్ల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఒక్కటే విమానాశ్రయం ఉండటం దురదృష్టకరమని అన్నారు. కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలు ఇప్పటికే సమర్పించామనీ, కేంద్రం నుంచి అనుమతులు లభించిన వెంటనే భూసేకరణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగిస్తుందని స్పష్టం చేశారు.
మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



