హెచ్‌ఎండీఏ కమిషనర్‌తో సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతుల ఆమోదం తర్వాతే ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన భూసేకరణ చేపట్టాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితుల సమస్యలపై చర్చలు జరిపింది. ఈ బృందంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, డీజీ నరసింహారావు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ భూ సేకరణ అలైన్‌మెంట్ మార్చడం వల్ల రైతులు గందరగోళ పడుతున్నారని తెలిపారు. ఉత్తరం భాగంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చేసిందని కమిషనర్ దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ స్ధానిక రైతులతో అధికారులు చర్చించలేదని తెలిపారు. గ్రామసభలు జరిపి రైతులతో మాట్లాడలేదని వివరించారు.
నష్టపరిహారం నిర్ణయించలేదని పేర్కొన్నారు. రైతుల ఆమోదం లేకుండానే భూమిని తీసుకోవడం పూర్తయ్యిందంటూ ప్రకటించడం సమంజసం కాదని వివరించారు. దక్షిణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రకటించిన అలైన్‌మెంట్ మార్పులు, చేర్పులతో అస్పష్టంగా ఉందని తెలిపారు. అలైన్‌మెంట్‌లో ఏ మార్పులూ చేయలేదని కమిషనర్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కొంతమంది పెత్తందార్ల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అలైన్‌మెంట్లు మార్చుతూ పేద రైతుల భూములను లాక్కునే చర్యను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ఆ రకంగా జరగడానికి వీల్లేదంటూ కమిషనర్‌ను కోరారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ అన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రైతుల తరపున ఆందోళనా పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.



