Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంల్యాండ్‌ సీలింగ్‌ చట్టం అమలు చేయడం లేదు

ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం అమలు చేయడం లేదు

- Advertisement -

– పిటిషన్‌ను విచారించిన హైకోర్టు
– రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూముల సీలింగ్‌ చట్టం అమలు తీరుతెన్నులను వివరిస్తూ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శులకు నోటీసులిచ్చింది. తెలంగాణలో 1973 నాటి భూసంస్కరణల (వ్యవసాయ భూముల సీలింగ్‌) చట్టం అమలు చేయడం లేదంటూ సింగూరు జలసాధన కమిటీ చైర్మెన్‌ కంచరి బ్రహ్మం హైకోర్టుకు లేఖ రాశారు. చట్టంలోని మినహాయింపులను ఆసరాగా తీసుకుని కంపెనీల పేరుతో భూములను కొనుగోలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక స్థితిమంతులు కొంత మంది కంపెనీల పేరుతో భూములను తమ అధీనంలో తెచ్చుకుంటున్నారు. దీని వల్ల భూముల ధరలు పెరిగిపోతున్నాయి. సాగు కోసం రైతులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండవు. సాగుకు భూమి లేక రైతు కూలీలుగా మారిపోతారు. భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సీలింగ్‌ చట్టాన్ని అమలు చేయని అధికారులపై తగిన చర్యలు చేపట్టాలి.. అని రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ సుజరుపాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాల పేరుతో నోటీసులు జారీ చేయకుండా హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చెరువులు, కుంటల సరిహద్దులు నిర్ణయించకుండా, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లను ఖరారు చేయకుండా అక్రమ నిర్మాణాలను కూల్చరాదని చెప్పింది. బాధితులకు నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్‌టీఎల్‌ను ఖరారు చేయకుండా కూల్చరాదని చెప్పింది. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేత చర్యలను సవాల్‌ చేస్తూ ఎస్‌ఐఈటీ మారుతి హిల్స్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మరో ఆరుగురు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారించారు. అక్రమ నిర్మాణాలైనా తొలగించడానికి ఓ విధానం ఉంది. విలేజ్‌ మ్యాప్‌ ఆధారంగా చెరువుల హద్దులను నిర్ణయంచాలి. ఆ తర్వాత ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లను నిర్ధారించాలి. ఇవేమీ చేయకుండా హైడ్రా ముందుకు వెళ్లరాదు. గతంలో ఇచ్చిన యథాతథస్థితి కొనసాగించాలి. ఆ ప్రాంతంలో బోర్ల నుంచి పిటిషనర్లు నీటిని తరలిస్తుంటే చర్యలు తీసుకోండి. ట్యాంకర్లను సీజ్‌ చేయండి. గుట్టల బేగంపేటలోని సర్వే నెం.12, 13, అల్లాపూర్‌ గ్రామంలోని సర్వే నెం.31కి సంబంధించి పిటిషనర్లు సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలించాక చర్యలు తీసుకోవాలి.. అని ఆదేశించింది. విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
బోర్డులు పెడితేనే ఉపయోగం
అక్రమ నిర్మాణాలు చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాల ముందు ఇవి అక్రమ నిర్మాణాలంటూ బోర్డు పెడితే ఉపయోగకరంగా ఉంటుందని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉంటారనీ, ఆ విషయం తెలియక ప్రజలు కొనుగోలు చేసి నష్టపోతుంటారని తెలిపింది. అందువల్ల నిర్మాణాలు జరిగే ప్రాంతంలో ఇలా పెద్ద బోర్డులు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలు కొనుగోలు చేయకపోవడంతోపాటు నిర్మాణదారులు కూడా సంస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుందని నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నాకే కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌ మహరాజ్‌గంజ్‌ తోటగూడలోని అనధికారిక నిర్మాణాలపై ఉత్తర్వులు జారీ చేసినా కూల్చివేత చర్యలు చేపట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ జి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి విచారణ చేపట్టి జీహెచ్‌ఎంసీ వాదనల నిమిత్తం విచారణను ఈనెల 11కు వాయిదా వేశారు.
దరఖాస్తు పెండింగ్‌ వయసు 25 ఏళ్లు
జనగాం జిల్లాలోని కాందిశీకుల భూముల వారసులమంటూ అప్లికేషన్‌ పెట్టుకుని పాతికేళ్లు అయినప్పటికీ దానికి మోక్షం కల్పించని అధికారికి హైకోర్టు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. రద్దయిన ఎవాక్యూ ఇంటరెస్ట్‌ విభజన చట్టం-1951 కింద అప్లికేషన్‌ పెట్టుకుంటే సంబంధిత అధికారి పరిష్కరించలేదు. దీంతో బాధితురాలు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో జస్టిస్‌ సి.వి భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారించారు. అప్లికేషన్‌ను 3 నెలల్లోగా పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జనగాం ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఫాతిమా బేగం వారసులు సేల్‌ సర్టిఫికెట్‌ కోసం అప్లికేషన్‌ పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో అబుల్‌ ఖైర్‌ నసీరుద్దీన్‌ కమ్రాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. భూయజమానులు పాకిస్థాన్‌ వెళ్లిపోయినప్పుటు వాళ్ల ఆస్తులను కాందిశీకుల చట్టం కింద అధీకృత అధికారి స్వాధీనం చేసుకున్నారు. వారి సోదరి సలేహా ఫాతిమా బేగం మనదేశంలో ఉండటంతో భూములకు సేల్‌ సర్టిఫికెట్‌ పొందారు. అయితే దీనిని 1962లో రద్దు చేయడంతో హైకోర్టుకు వచ్చారు. అథీకృత అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్న ఉత్తర్వుల మేరకు 2000లో ఆమె అప్లికేషన్‌ పెట్టుకున్నారు. ఇది ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో మళ్లీ హైకోర్టుకు రావడంతో పైవిధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
గ్రూపు-1పై విచారణ 7కి వాయిదా
గ్రూప్‌-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్‌లు విచారణార్హం కావని, వాటిని కొట్టివేయాలని అర్హత సాధించిన సుమారు 260కి పైగా అభ్యర్థులు హైకోర్టుకు నివేదించారు. పిటిషన్‌లు వేసిన వారు అర్హత సాధించలేదని, అందువల్ల వారికి ఏ రకంగా నష్టం వాటిల్లిందో చెప్పనందున ఈ పిటిషన్‌ వేసే అర్హత వారికి లేదన్నారు. గ్రూప్‌-1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారణను కొనసాగించారు. ఈ పిటిషన్‌లలో ప్రతివాదులుగా చేరిన ఎంపికైన అభ్యర్థుల తరఫు సీనియర్‌ న్యాయవాది కె.లక్ష్మీనరసింహ తదితరులు వాదనలు వినిపిస్తూ ఇవి ప్రజాప్రయోజనాలకు విరుద్ధమన్నారు. 2022లో పరీక్షలు కాపీయింగ్‌ జరిగిందని ప్రభుత్వం రద్దు చేయగా, అనంతరం బయోమెట్రిక్‌ నమోదు చేయలేదన్న కారణంగా హైకోర్టు మరోసారి రద్దు చేసిందన్నారు. గత 14 ఏళ్లుగా నియామకాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు. గ్రూపు-1 అధికారులు లేక మరోవైపు రాష్ట్ర పాలన కుంటుపడుతోందన్నారు. రెండు హాల్‌టిక్కెట్ల జారీ వల్ల పిటిషనర్లకు ఏం నష్టం వాటిల్లిందో చెప్పలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారనీ, ప్రస్తుతం ఈ ఉద్యోగం రాకపోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నియామక ప్రక్రియ తుది దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. దీనిపై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -