373 ఎకరాల భూమిని తన్నుకుపోతున్న కాంగ్రెస్ పెద్దలు
కబ్జా కంపెనీల వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం
అధికార పార్టీ నేతల ఆక్రమణలు హైడ్రాకు కనిపించడం లేదా?
ఏవీ రంగనాథ్ చర్యలు తీసుకోకుంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో అక్కడికి వెళ్తాం : మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో రూ.ఏడు వేల కోట్ల విలువైన భూకుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అక్కడ సర్వేనెంబర్ 613 (కొత్త సర్వే నెంబర్ 119)లో ఉన్న 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని అన్నారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులున్నారని ఆరోపించారు. అందుకే రక్షకులే భక్షకులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములుగా ప్రకటించాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాస్తే నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసీకి అప్పగించారని గుర్తు చేశారు.
కౌసల్య, మమత వంటి మహిళా రైతులు 40 ఏండ్లుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్నారని వివరించారు. వారికి రూ.ఐదు లక్షలు, రూ.పది లక్షలు ఆశ చూపి వెళ్లగొట్టాలని చూస్తున్నారనీ, బోర్లు, కంచెలను ధ్వంసం చేశారని అన్నారు. నాదర్‌గుల్ భూములు శివరాజ్ బహదూర్‌వేనని ఆయన చెప్పినా 2005లోనే ఆర్డీవో ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారని చెప్పారు. 2017లో హైకోర్టు కూడా ఇది ప్రభుత్వ భూమి అంటూ చెప్పిందన్నారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలుండే అవకాశం లేదనీ, అయినా 2016లో శివరాజ్ బహదూర్ ఆ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ కంపెనీలకు విక్రయించారని అన్నారు. చట్టంలోని సెక్షన్ ఎనిమిది, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా భూములను అమ్మే హక్కు లేదన్నారు.
ఆ విక్రయాలు చెల్లవనీ, ఇది సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్డీవో తేల్చిచెప్పారని గుర్తు చేశారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ కంపెనీలు హైకోర్టుకు వెళ్తే ఆర్డీవో నిర్ణయమే సరైనదనీ, ఆ భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ స్పష్టం చేశాయని వివరించారు. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారనీ, ప్రస్తుతం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం వద్ద ఆ కేసు మంగళవారం విచారణకు రానుందని అన్నారు. భూభారతి పోర్టల్‌లో చూసినా అది ప్రభుత్వ భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్‌గానే చూపిస్తోందని వివరించారు.
చెరువులను కాపాడుతున్నానని చెప్పే రేవంత్‌రెడ్డికి నాదర్‌గుల్ భూకబ్జాలు కనిపించడం లేదా?అని ప్రశ్నించారు. ఈ భారీ భూ కుంభకోణం, భూ కబ్జా కంపెనీల వెనుక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబమే ఉందని ఆరోపించారు. పేదల ఇండ్లు కూలగొట్టే ‘హైడ్రా’కు అధికార పార్టీ నేతల కబ్జాలు, చెరువుల ఆక్రమణలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాదారులను అరెస్ట్ చేసి, రైతులను భూముల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. నాదర్‌గుల్ భూములపై సోమవారం ఉదయం వరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అక్కడికి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యమ్రంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.



