Saturday, January 3, 2026
E-PAPER
Homeజాతీయంభూ వివాదాలు లేకుండా పట్టాదారు పాస్‌ పుస్తకాలు

భూ వివాదాలు లేకుండా పట్టాదారు పాస్‌ పుస్తకాలు

- Advertisement -

టెలీకాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు
అమరావతి :
ప్రజలకు భూ వివాదాలు లేకుండా, రికార్డుల్లో తప్పులు లేకుండా పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని సిఎం చంద్రబాబు తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం రాష్ట్ర మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో కూడిన 22 లక్షల పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయన్నారు. వివాదాలు లేని స్థలాలను కూడా రీసర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదంగా చేశారన్నారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామన్నారు. పాస్‌పుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందన్నారు. పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయా లన్నారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపాలన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏదో ఒక రోజు తాను స్వయంగా పాల్గొం టానన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి షెడ్యూల్‌ ప్రకటించినట్లు తెలిపారు. తొలిరోజు పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి నియోజకవర్గాల్లో పాల్గోనున్నట్లు తెలిపారు. వేలాది గ్రామాల్లో ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రికి మంత్రి వివరించారు.

పాస్‌ పుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడండి : సిఎస్‌
రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకు తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని సిఎస్‌ కె విజయానంద్‌.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైల్వే అండర్‌ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, రైల్వేలకు సంబంధించి పెండింగ్‌ భూ సేకరణ కేసులకు సంబంధించిన అంశాలు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ప్రజల సంతృప్తి, డాక్యుమెంట్ల అప్‌లోడ్‌ అంశాలపై శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు 23 లక్షలు ముద్రించి పంపిణీ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -