సెజ్‌లు, పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఉమ్మడి నెల్లూరులో 60 వేల ఎకరాల భూసేకరణ
నిరుపయోగంగా 50 వేల ఎకరాలు
రూ.10 వేల కోట్ల పంట దూరం…
నెల్లూరు : పరిశ్రమల ఏర్పాటు, యువతకు లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి కల్పన పేరుతో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌ల) కోసం తీసుకున్న భూములు నిరుపయోగంగా ఉన్నాయి. 2004 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదు సెజ్‌ల ఏర్పాటు పేరుతో సుమారు 60 వేల ఎకరాల భూములను ప్రభుత్వాలు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నాయి. ఇందులో అత్యధిక భాగం పంట పొలాలే. ఇప్పటి వరకు పది వేల ఎకరాల్లో మాత్రమే పరిశ్రమలు వచ్చాయి. దాదాపు 50 వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి ఈ భూములు బీడుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భూములకు ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ధర ఉంది. ఎకరా రూ.50 లక్షల లెక్కించినా కార్పొరేట్ల గుప్పిట్లో సుమారు రూ.25 వేల కోట్ల విలువైన భూములు చిక్కుకున్నాయి. సారవంతమైన ఈ భూముల్లో పంటలు పండిస్తే సుమారు 54 లక్షల పుట్లు (ఒక పుట్టికి 850 కిలోలు) దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఉన్న ధరల లెక్కల ప్రకారం సుమారు రూ.10 వేల కోట్లు ధాన్యం దిగుబడి లభించేది.
2004లో మాంబట్టు, మేనకూరు, తడ, శ్రీసిటి, చింతవరం, కృష్ణపట్నం, రేగడచెలిక ప్రాంతాల్లో సెజ్‌లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ పరిశ్రమలు వచ్చి ఉంటే జిల్లా పరిస్థితి మరోలా ఉండేది. మేనకూరు, తడ, శ్రీసిటి, చింతవరం… తిరుపతి జిల్లాలో కలిసిపోయాయి. కృష్ణపట్నం పోర్టు, మిగిలిన సెజ్‌లు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలో 180 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. జాతీయ రహదారిని, కృష్ణపట్నం పోర్టును చూపి ప్రభుత్వం 18 సంవత్సరాల నుంచి జిల్లా యువతను మురిపిస్తూ వచ్చింది. కృష్ణపట్నం పోర్టు అదాని చేతికి వెళ్లాక ఇటీవల సుమారు 15 వేల మంది కార్మికులకు, ఉద్యోగాలకు ఉపాధి పోయింది. ఇప్పుడు రామాయపట్నం పోర్టు పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తోంది. 2006లో థర్మల్ పవర్ ప్రాజెక్టుల పేరుతో 33 వేల ఎకరాలు భూములను రైతుల నుంచి, సాగుదారుల నుంచి బలవంతంగా లాక్కున్నారు.
ఈ ప్రాజెక్టులు రాకపోగా, భూములను కొందరు పారిశ్రామికవేత్తలు బ్యాంకుల్లో కుదవ పెట్టి రుణాలు తీసుకున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములతో రిలయన్స్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మేనకూరు సెజ్ పేరుతో 5,600 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ అతికొద్ది భూమి మాత్రమే ఉపయోగంలో ఉంది. మిగిలిన భూమి ఖాళీగా ఉంది. శ్రీసిటీ పేరుతో 5,700 ఎకరాలు తీసుకుంది. కొన్ని జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వచ్చినా, 70 శాతం భూములు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కొడవలూరు మండలం రేగడచెలిక కిసాన్ సెజ్ పేరుతో 2,776 ఎకరాలు, చిల్లకూరు మండలం చింతవరంలో టెక్స్‌టైల్ పార్కు పేరుతో 2,700 ఎకరాలు, కృష్ణపట్నం పోర్టులో సెజ్ అభివృద్ధి పేరుతో ఆరు వేల ఎకరాలను ప్రభుత్వం లాక్కొంది. కొడవలూరు వద్ద మిథానీ ఉక్కు పరిశ్రమ పేరుతో 500 ఎకరాలు, వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద సముద్ర ఖనిజాల అన్వేషణ ప్రాజెక్టు పేరుతో 500 ఎకరాలను పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు ప్రభుత్వాలు కట్టబెట్టాయి.
రెండు పంటలు పండే భూములను సైతం సెజ్‌ల పేరుతో పాలకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భూముల్లో వరి పండిస్తే ఎకరానికి మూడు పుట్లు దిగుబడి వస్తుంది. రెండు సీజన్లలో కలిసి ప్రస్తుత ధరకు అనుగుణంగా ఎకరానికి ఆరు పుట్లు ఉత్పిత్తి వస్తే, రూ.1.18 లక్షల ఆదాయం వచ్చేది. ఏడాదికి మూడు లక్షల పుట్ల ధాన్యం ఉత్పత్తి నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఏడాదికి రూ.593 కోట్లు విలువైన పంట వచ్చేంది. ఈ లెక్కన 18 సంవత్సరాల కాలంలో సుమారు 10 వేల కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తులు ఆగిపోయాయి. రైతుల కళ్ల ఎదుట భూములు బీడుగా ఉన్నాయి. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం చేసిన విధ్వంసంగా దీనిని వారు పరిగణిస్తున్నారు. ఖాళీగా ఉన్న తమ భూములను తిరిగి తమకు అప్పగించాలని రైతులు కోరుతున్నారు.
