– రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
– నారాయణపేటలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం
– భూ నిర్వాసితుల రిలే దీక్షలకు మద్దతు
నవతెలంగాణ-నారాయణపేట
మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారం న్యాయంగా లేదని, 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో 13 రోజులుగా భూ నిర్వాసితులు చేస్తున్న రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. ఎకరాకు రూ.14 లక్షలు ఆమోదయోగ్యం కాదని, రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకుండా బలవంత భూ సేకరణ చేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం దయతో కాదు.. రైతుకు రావాల్సింది చట్టం ప్రకారం చెల్లించాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ జిల్లా వాసే అయినప్పటికీ రైతులకు మేలు జరగకపోతే ఉద్యమమే శరణ్యమని స్పష్టంచేశారు. రూ.4500కోట్ల నిర్మాణవ్యయంతో పనులను ప్రారంభించిన నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు ఖర్చును రూ.10వేల కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధపడే అవకాశం ఉందన్నారు. కానీ రైతుకు ఎకరాకు రూ.30 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, రైతులకు ఆశించేంత ఇచ్చినా రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. కానీ భూ నిర్వాసితులను ప్రలోభాలకు గురిచేయడం, ఆర్‌డీఓ స్థాయి అధికారి చేత బెదిరించడం మంచిది సరైంది కాదన్నారు. ప్రాజెక్టు నీళ్లు వచ్చిన తర్వాత 3 నుంచి 4 రెట్లు భూమి ధర పెరిగే అవకాశం ఉందన్నారు. 18 ఏండ్లు పైబడిన భూ నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి.వెంకట్రామరెడ్డి, అధ్యక్షులు మశ్చెంధర్, ఉపాధ్యక్షులు ధర్మ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, నాయకులు జోషి, కానుకూర్తి గ్రామ మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి, దామరగిద్ద మండలం కానుకూర్తి, మల్రెడ్డిపల్లి గ్రామ భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES