నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని కొత్తూరు గ్రామ శివారులోని సన్నకారు రైతు భూమిపై భూస్వామి దౌర్జన్యానికి దిగి భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. బాధిత రైతు కుల్ల సమ్మయ్యకు కొత్తూరు గ్రామ శివారులోని 847/బి/ఏ సర్వే నంబర్లు 5 ఎకరాల పట్టా భూమి ఉంది. కొత్తూరు గ్రామ రైతులు పరస్పర ఒప్పందంతో వ్యవసాయ పోరాల వద్దకు వెళ్లడానికి బాటను ఏర్పాటు చేసుకున్నారు.
రైతులు వ్యవసాయ పనుల అవసరాల నిమిత్తం రాకపోకులకు బాటను ఉపయోగించుకునేవారు. కాలక్రమేణా రైతులు అవసరాల కోసం భూమిని విక్రయించుకున్నారు. ఈ క్రమంలో పలుకుబడి కలిగిన పడాల భూస్వామి బాట తమ పట్టా భూమిలో ఉందని పంట సాగు చేశారు.
రైతుల పట్టా భూమిలో నుండి కెనాల్ కాల్వ వెళ్లడంతో కెనాల్ పక్కనుండి బాట ఏర్పడడంతో కొందరు రైతులు పాత బాట కోసం వదిలేసిన భూమిని తిరిగి కలుపుకోవడం చేశారు. ఇదిలా ఉండగా సదరు భూస్వామి బాధితుడు సమ్మయ్య భూమిలోని పంటను ట్రాక్టర్ తో తొక్కించి పంట నష్టం చేశాడు. ఇదేంటంటే ప్రశ్నిస్తే ఇది నా భూమి అంటూ ఇలా బాట ఉండాలంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.