భాషాధిపత్యం

Sampadakiyamభాష అనేది ఆయా సమూహాల సాంస్కృతిక అభివ్యక్తి. ప్రజల సంస్కృతి, సంస్కారం వ్యక్తమయ్యేది వారి మాతృభాషలోనే. జనుల హృదయావిష్కరణ జరిగేది వారి భాషలోనే. వారి బాధ, దు:ఖం, వేదన, సంతోషం, ఆనందం, ప్రేమ, అన్నింటికీ మాతృభాషే వాహకం. అందుకే మాతృభాషల ప్రాధాన్యతను ఎవరూ కాదనలేరు. మనదేశం, వేలాది భిన్నభాషల, సంస్కృతుల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం లాంటి ఈ జాతి జీవనాడిపై ప్రతిసారీ దాడి జరుగుతూనే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌వాళ్లు మనల్ని ఆక్రమించాక మన సంస్కృతిలోకి భాష ద్వారా కూడా చొరపడే ప్రయత్నం చేశారు. మన విద్యావిధానానికి రూపకల్పన చేసిన మెకాలె, రక్తంలో భారతీ యులుగా, ఆలోచనలో ఆంగ్లేయులుగా ఉండేట్టు విద్యను తీర్చిదిద్దారు. వారి ఆలోచనలకు అనుకూలంగా సేవ కులుగా కొనసాగాము.ఆ తర్వాత ప్రపంచీకరణ పేరుతో వచ్చిన మార్కెట్‌ విస్తరణ, మన సాంస్కృతిక మూలాలపైనే కేంద్రీకరించాయి. ఆంగ్లభాషే జీవన భాషగా, జీవనోపాధిగా నిర్మించబడింది. ఏకరూప సంస్కృతిని తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మితవాద మతతత్వ శక్తులు సాంస్కృతిక వైవిధ్యతపై తీవ్రంగా దాడి ఎక్కుపెట్టారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే నాయకుడు…ఇలా ఒకే సంస్కృతిగా మార్చాలన్న ప్రయత్నంలో భాగంగానే నూతన విద్యావిధానాన్ని (2020) తీసుకువచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుండి భాషాపరమైన ఆధిపత్యం కోసం పనిచేస్తున్నారు. అందులో భాగంగా హిందీ భాషను, ఇతర ప్రాంతీయ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దే చర్యలకు త్రిభాషా సూత్రం ఆధారంగా పాల్పడుతున్నారు.
దీన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో భాషగా హిందీని అంగీ కరించబోమని, మరో భాషా యుద్ధానికి సిద్ధమని, బలవంతంగా హిందీని రుద్దటాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే నూతన విద్యావిధానంలో అనేక అంశాలూ అంగీకరించలేమని కూడా తేల్చి చెప్పారు. విద్య ఉమ్మడి జాబితాలోనిదని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రతిగా కేంద్రం, ఎన్‌.ఈ.పి.ని, త్రిభాషా సూత్రం అమలుచేయని యెడల సర్వశిక్షా అభియాన్‌ నిధులు విడుదల చేయ బోమని నిధులు నిలిపివేసింది. ఇది రాజ్యాంగ సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని నిరసనలు మొదలయ్యాయి. తమిళనాడులోని బీజేపీ నేత, నటి రంజనా నాచియార్‌ ఈపాలసీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మూడు భాషలను విద్యార్థులపై రుద్దడం చాలా తప్పనీ ఆమె తెలిపారు. హిందీ అధికారభాషే కానీ, జాతీయ భాష కాదని ఆమధ్య తమిళనటుడూ ఓ ప్రకటన చేశాడు. హిందీభాష గురించి, దాని అమలు గురించీ ఇంత వివాదం జరుగుతున్నా అసలు ప్రభుత్వ పాలన, ఇతర వ్యవహారాలన్నీ, రాష్ట్రాల్లో, కేంద్రంలో ఆంగ్లభాషలోనే సాగటం మనం చూస్తున్నాము. హిందీ ప్రాంతాల్లో హిందీ, ఆంగ్లభాషలే పాఠశాలల్లో బోధిస్తున్నారు. త్రిభాష సూత్రమేదీ అక్కడ పూర్తిగా అమలు కావడం లేదు. నేటి బోధనా ప్రమాణాలను పరిశీలిస్తే అన్ని భాషల నిబంధన ఏ భాషా సరిగా నేర్వలేని స్థితికి చేరింది.
2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో 22భాషలు ఉండగా వాటిలో 17భాషలు తిరోగమన బాట పట్టాయని, మాట్లాడే వారు తగ్గిపోతున్నారని, హిందీ, బెంగాలీ తర్వాత మూడవ స్థానంలో ఉన్న తెలుగు కూడా నాల్గవ స్థానానికి పడిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు. మనదేశంలో సగటున రెండు నెలలకు ఒక భాష కను మరుగైపోతోందనీ గత యాభై ఏండ్లలో 283 భాషలు అదృశ్యమయ్యాయని వారు వివరిస్తున్నారు. ఉత్తర భారతంలో వందేండ్లలో 25 భాషలు కనుమరుగయ్యాయి. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఇదే వివరిస్తు న్నారు. హిందీని ఆధిపత్యంలోకి తీసుకువచ్చి, ఉత్తర భారతంలోని అనేక భాషలు-భోజ్‌పురి-మైథిలీ, అవథీ, బ్రజ్‌, బుందేలీ, గర్వాల్‌, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గడీ, సంథాల, ముండారీ మొదలైన భాషల న్నింటినీ మింగేశారు. యూపీ, బీహార్‌ హిందీ ‘హార్ట్‌ల్యాండ్స్‌’ కాదు. వారి నిజమైన భాషలు అవశేషాలుగా మిగిలా యని, భాషా అస్తిత్వాన్ని గుర్తు చేస్తున్నారు. తమభాషను కోల్పోయిన జాతి సజీవ సంస్కృతినీ కోల్పోతుంది.
భిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాలను గుర్తించ నిరాకరిస్తూ భాషాధిపత్యాన్ని కొనసాగించాలనుకోవడం సరైనది కాదు. అందుకు ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవిధ్యతలను వైరుధ్యాలుగా చేసి, వైశమ్యాలను పెంచే ప్రయత్నం వ్యతిరేకించాల్సిన అంశం. భాషలు ఎన్నయినా నేర్చుకోవచ్చు, వారివారి ఇష్టాలను బట్టి. ఒక భాషను ఇంకోభాషకు ప్రతిగా నిలపడం సరికాదు. భాషను కూడా మతతత్వానికి, ఆధిపత్యానికి ఉపయోగించుకుని మనుషుల మధ్య, ప్రాంతాల మధ్య విభజన తీసుకువచ్చి రాజకీయ ప్రయోజనాలను పొందాలనే ప్రయత్నాల్ని తిప్పికొట్టాల్సిందే. రాష్ట్రాల హక్కులను, సమాఖ్య విధానాలను గౌరవించి సమైక్యంగా ముందుకుపోవాలి.

Spread the love