– ఉజ్జయినీ మహంకాళి దర్శనానికి భారీగా భక్తజనం
– సందడిగా ఆలయ పరిసర ప్రాంతాలు
– అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
– మంత్రి పొన్నం దంపతుల తొలి బోనం
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట
లష్కర్ బోనమెత్తింది. ఆదివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. సికింద్రాబాద్ ప్రజలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ప్రజలు ఉదయం నుంచే క్యూలైన్‌లలో బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళల బోనాలు, కోలాటాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువతీ యువకుల నృత్యాల కోలాహలాలు ఆధ్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి. వేలాది మంది మహిళలు, భక్తులు, సందర్శకులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 11.40 గంటలకు ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, ఈవో గుత్త మనోహర్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులున్నారు. అనంతరం అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలనీ, అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్టు సీఎం తెలిపారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో దేవాలయానికి రాగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, మొదటి బోనం సమర్పించారు. ఉదయం 4.10 గంటలకు పొన్నం దంపతులు మొదటి పూజ నిర్వహించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పొన్నం.. రాష్ట్రమంతా వర్షాలు,పడి, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.
మహంకాళి అమ్శవారి దర్శనానికి పలువురు..
శ్రీఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూరు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, పలువురు హైకోర్టు జడ్జీలు, షిషరీస్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, మహిళా కమిషన్ చైర్మెన్ నేరెళ్ల శారద, ఆర్యవైశ్య కమిషన్ కాల్వ సుజాత అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అమ్మవారిని దర్శించుకున్న వారిలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శైలజా రామయ్యర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. బోనాల జాతరను పురస్కరించుకొని దేవాదాయ శాఖాధికారులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు, బోనాల సమర్పించే మహిళలకు రెండు క్యూలైన్లు, వీఐపీలకు ఒక క్యూలైన్ ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు క్యూలైన్ల ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని రోడ్ల నుంచి ఇతర మార్గాల వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రధానంగా పోలీస్ అధికారులు జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ.. కొందరి అత్యుత్సాహం కారణంగా భక్తులు, మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించనున్న భవిష్యవాణి(రంగం) కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.