మార్కెట్లో ఒకానొక సరుకుకు కొరత ఏర్పడినప్పుడు ఆ సరుకును అక్రమంగా దాచిపెట్టి ఆ కొరతను మరింత పెంచేలా చట్టా వ్యాపారులు చేయగలరు. ఒక్కోసారి ఏ కొరతా లేకపోయినప్పటికీ, కృత్రిమంగా కొరత సృష్టించగలరు కూడా. ఆ సరుకు గనుక నిత్యావసర సరుకు అయితే ఇక శ్రామిక ప్రజానీకం చట్టా వ్యాపారం వలన పడే ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. ఈ విషయం తెలిసినదే. 1943లో యుద్ధ సమయంలో తూర్పు సరిహద్దులో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధానికి అయ్యే ఖర్చు కోసం బడ్జెట్ లోటును విపరీతంగా పెంచారు. ఆ సమయంలో ఆహార ధాన్యాల కోసం మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. సరిగ్గా అప్పుడే టోకు (హోల్‌సేల్) వ్యాపారులు ఆహారధాన్యాలను నల్ల బజారుకు తరలించారు. దాని పర్యవసానంగా బెంగాల్ కరువు ఏర్పడింది. దానివలన 30 లక్షల మంది చనిపో యారు. ఐతే, ప్రస్తుతం నయా ఉదారవాద విధానాలు అంతకన్నా ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. కేవలం నిత్యావసర సరుకుల విషయంలో జరిగే చట్టా వ్యాపారం ద్వారా మాత్రమే దెబ్బ తీయడంతో సరిపెట్టకుండా, కరెన్సీ మార్కెట్లో జరిగే చట్టా వ్యాపారం ద్వారా నేరుగానే శ్రామిక ప్రజల కొనుగోలుశక్తిని దెబ్బ తీస్తున్నాయి.
నయా ఉదారవాద వ్యవస్థలో పెట్టుబడుల రాకపోకల మీద, ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడి రాకపోకల మీద ఎటువంటి నియంత్రణలూ లేవు. ఒక దేశపు కరెన్సీకి అంతర్జాతీయ మార్కెట్లో ఉండే మారకపు విలువను ఇప్పుడు మార్కెట్ మాత్రమే నిర్ణయిస్తుంది. అప్పుడు చట్టా వ్యాపారులు ఒక దేశంలో అమెరికన్ డాలర్ల రూపంలో ఉన్న వారి పెట్టుబడులను వేరే దేశానికి తరలించాలని నిర్ణయించారను కోండి. దాని ఫలితంగా ఆ దేశపు కరెన్సీ మారకపు రేటు పడిపోతుంది. దాని పర్యవసానంగా ఆ దేశం దిగుమతి చేసుకునే సరుకుల రేట్లు ఆ దేశపు కరెన్సీ లెక్కలో పెరిగిపోతాయి. అలా దిగుమతి చేసుకునే సరుకులు గనుక చమురు వంటి నిత్యావసర సరుకులు అయితే దాని ఫలితంగా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మీద ఆర్థిక భారం మొత్తంగానే పడుతుంది. అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. దానివలన నిజ వేతనాలు పడిపోతాయి. కష్టపడి జీవించే వారందరి నిజ ఆదాయాల విలువలు పడిపోతాయి. ఎక్కువమంది శ్రామిక ప్రజల ఆదాయాలు జీవన వ్యయ సూచికతో ముడిపడి వుండవు. అందువలన వారి నిజ ఆదాయాల్లో కోత మరీ తీవ్రంగా ఉంటుంది. పపంచవ్యాప్తంగా న్న కోట్లాదిమంది శ్రామిక ప్రజల జీవన పరిస్థితులు దురాశాపూరితులైన కొద్దిమంది స్పెక్యులేటర్ల (చట్టా ్యపారుల) దయా దాక్షిణ్యాలమీద ఆధారపడివున్నాయి. ఇదే నయా ఉదారవాద వ్యవస్థ వాస్తవ లక్షణం.
పెట్టుబడులు ఉన్నట్టుండి బైటకు పోయినప్పుడు మన కరెన్సీ మారకపు విలువ పడిపోయి, దిగుమతుల ఖరీదు పెరిగిపోయి, శ్రామిక ప్రజల నిజ ఆదాయాలు దెబ్బ తినడం జరిగినట్టే, దానికి రివర్స్‌లో జరిగితే ఏమౌతుంది? మన దేశంలోకి పెట్టుబడులు ఎక్కువగా వచ్చి, మన కరెన్సీ మారకపు విలువ పెరిగిపోయి శ్రామిక ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయా? అలా జరగదు.
దేశంలోకి పెట్టుబడులు ఎక్కువగా వచ్చిపడినప్పుడు మన కరెన్సీ మారకపు విలువను పెరగనిస్తే అప్పుడు దిగుమతుల ద్వారా వచ్చే సరుకుల కన్నా దేశీయంగా చేసే ఉత్పత్తులు ఎక్కువ ప్రియం అవుతాయి. అప్పుడు దేశంలో ఉత్పత్తి తగ్గుతుంది. దిగుమతులు పెరుగుతాయి. అలా దిగుమతులు పెరిగితే వాటికోసం చెల్లించవలసిన విదేశీ మారక ద్రవ్యం (డాలర్లు) ఎక్కువ అవసరమౌతుంది. రిజర్వు బ్యాంకు గనుక జోక్యం చేసుకోనట్లయితే- అప్పుడు మన దేశం విదేశీ మదుపరులకు బకాయి పడిపోతుంది. అది కూడా తన దేశంలో పరిశ్రమల్ని మూత వేసుకోవడం కోసం. ఇంతకన్నా అర్థరహితమైన పరిణామం మరొకటి ఉండదు. అందుచేత రిజర్వు బ్యాంకు తప్పనిసరిగా జోక్యం కల్పించుకుంటుంది. మన రూపాయి మారకపు విలువను పెరగనివ్వకుండా చర్యలు తీసుకుంటుంది. అందుకోసం విదేశాలనుండి వచ్చే అదనపు డాలర్లను తన విదేశీమారకపు నిల్వలలోకి మళ్ళిస్తుంది. అంటే, మన దేశం నుండి డాలర్లు బైటకు పోతే శ్రామిక ప్రజల నిజ ఆదాయాలు దెబ్బ తింటాయి. అదే మన దేశానికి డాలర్లు అదనంగా వస్తే వాటిని రిజర్వు బ్యాంకు భద్రంగా విదేశీమారకపు నిల్వలుగా దాచి మన రూపాయి మారకపు విలువ పెరగకుండా చూస్తుంది.
విదేశీ మారకపు నిల్వలు ఎక్కువగా ఉంటే మంచిదే కదా? ఉన్నట్టుండి మన దేశం నుంచి డాలర్లు బైటకు పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ నిల్వలను విడుదల చేసి మన రూపాయి విలువ పడిపోకుండా నిలబెట్టవచ్చు కదా? ఈ వాదన సరైనదే. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. రిజర్వు బ్యాంకు తన నిల్వలనుండి డాలర్లను విడుదల చేయడానికి సిద్ధపడినా, దానికి పరిమితి ఉంటుంది. తనవద్ద ఉన్న నిల్వలు అన్నీ ఖాళీ అయిపోయే పరిస్థితిని రానివ్వదు. అంటే రిజర్వు బ్యాంకు విడుదల చేసే విదేశీ మారకద్రవ్య పరిమాణానికి కొంత పరిమితి ఉంటుంది. దానివలన డాలర్లు మన దేశం నుండి బైటకు పోయే స్థితి వచ్చినప్పుడు దాని వలన కలిగే లోటును రిజర్వు బ్యాంకు పూర్తిగా భర్తీ చేయలేదు. అందువలన రూపాయి మారకపు విలువ పూర్తిగా పడిపోకుండా నిలవరించలేదు. కొంతవరకే దానిని ఆపుతుంది. మారకపు విలువ కొంతవరకూ పడిపోతూ వుంటుంది. కొంతవరకు విదేశీ నిల్వలను రిజర్వు బ్యాంకు విడుదల చేస్తూ వుంటుంది. మొత్తం మీద క్రమంగా రూపాయి మారకపు విలువ పడిపోతూ వుంటుంది. శ్రామిక ప్రజల నిజ ఆదాయాలు తగ్గిపోతూ వుంటాయి. భారతదేశంలో ఇటీవల కాలంలో ఇదే జరుగుతూ వస్తోంది.
కొంత కాలం గడిచేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే రూపాయి మారకపు రేటు పడిపోవడం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. 1990 నవంబర్ 10న చంద్రశేఖర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచీ సరళీకరణ క్రమం మొదలైంది. అప్పుడు రూపాయి మారకపు విలువ చూస్తే ఒక డాలర్‌కు రు.17.50గా ఉంది. అదే 2025 నవంబర్ 15 నాటి పరిస్థితి చూస్తే ఒక డాలర్ విలువ రు. 88.50గా ఉంది. అంటే నయా ఉదారవాద దశలో రూపాయి మారకపు రేటు భారీగా పడిపోయింది. ఏకంగా 400 శాతం పడిపోయింది. అదే 1947 నుంచి 1990 వరకూ ఉన్న కాలంలో చూస్తే కేవలం 33.3 శాతం మాత్రమే రూపాయి మారకపు విలువ పడిపోయింది.
మూడవ ప్రపంచ దేశాలకు నయా ఉదారవాదం కలిగించే అనివార్యమైన పరిణామం ఇది. ఐతే దీనికి తోడు మరొక పద్ధతి ద్వారా కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థను నయా ఉదారవాద వ్యవస్థ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ సాగిస్తున్న సుంకాల యుద్ధం అదే. సామ్రాజ్యవాద దేశాలన్నీ కట్టగట్టుకుని రష్యా మీద ఏకపక్షంగా ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని ధిక్కరించి భారతదేశం రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తోంది కనుక భారతదేశానికి శిక్షగా సుంకాలను భారీగా విధించాడు ట్రంప్. భారతదేశం సాధించిన స్వావలంబనను ఇప్పటికే నయా ఉదారవాద విధానాలు దెబ్బ తీశాయి. ఆ విధానాలను విడిచిపెట్టే ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదు. అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షలకు ప్రతిగా చర్యలు తీసుకోగలిగిన దమ్ము అంతకన్నా లేదు. అందుచేత అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోనని అంగీకరించింది. అలా అంగీకరించినట్టు మన దేశం ఎక్కడా ప్రకటించలేదు కాని ట్రంప్ ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించాడు.
ఇలా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడం వలన దేశంలో చమురు ఉత్పత్తుల (పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్) ధరలు పెరుగుతాయి. రష్యా నుండి చమురు మనకి చౌకగా లభించేది. ఇప్పుడు దానిని కొనడం మానేస్తే అంతర్జాతీయ చమురు ధరల స్థాయి ప్రకారం చమురు దిగుమతులకు మనం చెల్లించుకోవాలి. దానివలన ధరలు పెరుగుతాయి. అంతేకాదు; ప్రపంచ మార్కెట్లో ముడిచమురు సరఫరా తగ్గుతుంది. (రష్యా నుండి కొనుగోలు చేయడం మానివేసినందువలన) కాని ప్రపంచ డిమాండ్ యధాతథంగానే కొనసాగుతుంది. అందువలన అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతాయి. దాని ఫలితంగా మన చమురు ఉత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయి.
చమురు ధరలు గనుక పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద ఖర్చు పెరిగిపోతుంది. ఆ ఖర్చును తట్టుకోడానికి ప్రభుత్వం శ్రామిక ప్రజల ఆదాయాలను మరింతగా కుదించే చర్యలు తీసుకుంటుంది. రూపాయి మారకపు రేటు పడిపోవడం వలన శ్రామిక ప్రజల నిజ ఆదాయాలు ఏవిధంగానైతే పడిపోతాయో, అదే విధంగా చౌకగా లభించే రష్యన్ చమురు కొనుగోలును ఆపేస్తే, అప్పుడు కూడా వారి నిజ ఆదాయాలు పడిపోతాయి.
అమెరికా ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు విధిస్తున్నది కేవలం రాజకీయ కారణాలరీత్యా మాత్రమే కాదు. ప్రపంచ మార్కెట్లో తన స్వంత చమురుకు ఉన్న మార్కెట్‌ను మరింత పెంచుకోడానికి కూడా ఈ ఆంక్షలు తోడ్పడతాయి. అమెరికన్ చమురు ఖరీదు ఎక్కువ. దానిని ఎక్కువగా కొనుగోలు చేయాలంటే చౌకగా లభించే రష్యన్ చమురును మార్కెట్లో కట్టడి చేయాలి. అమెరికా చేస్తున్న ఈ ఒత్తిడికి ఇప్పటికే యూరపియన్ దేశాలు తలలొగ్గాయి. చౌకగా లభించే రష్యన్ చమురుకు బదులు ఖరీదైన అమెరికన్ చమురును కొనుగోలు చేయడానికి అంగీకరించడం ద్వారా ఆ దేశాలు ఒకవిధంగా ఆర్థికంగా ఆత్మహత్యలు చేసుకన్నట్టే. ఇప్పటికే జర్మనీలో పరిశ్రమలు ఒకటొకటిగా మూతపడిపోతున్నాయి. జర్మన్ కార్మికులు గత చలికాలం అంతా రక్షణ లేకుండా నానా ఇబ్బందులూ పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి మూడవ ప్రపంచ దేశాల్లోని శ్రామిక ప్రజలు కూడా తోడవుతున్నారు. ఇదంతా కేవలం అమెరికన్ చమురు వ్యాపారుల లాభాలను పెంచడం కోసమే!
తన చమురు మార్కెట్‌ను, తన లాభాలను పెంచుకోవడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రామిక ప్రజానీకం త్యాగాలు చేయాల్సిందేనని అమెరికన్ సామ్రాజ్యవాదం బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తోందటే- దాని తలపొగరు ఏ స్థాయిలో ఉందో తెలుస్తూనే వుంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం నోరెత్తకుండా అమెరికన్ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి స్వంత శ్రామిక ప్రజానీకాన్ని బలిపెట్టడానికి తయారైందంటే- ఈ ప్రభుత్వపు చేతకానితనం, స్వంత దేశ ప్రయోజనాలకన్నా అమెరికన్ పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేసే దాని నైజం స్పష్టమవుతూనే వున్నాయి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



