1,300మంది ఆరోగ్య సంస్థ సిబ్బందికి నోటీసులు
రెండో వారానికి చేరిన ప్రభుత్వ కౌంట్‌డౌన్
వాషింగ్టన్ : వ్యయ బిల్లుపై రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో అమెరికాలో మొదలైన ప్రభుత్వ కౌంట్‌డౌన్ రెండో వారానికి చేరుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగులపై కౌంట్‌డౌన్ ప్రభావం మొదలైంది. ఆరోగ్య సంస్థకు చెందిన 1,300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు నోటీసులు జారీ అయ్యాయి. వీరంతా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లో (సీడీసీ) పనిచేస్తున్న సిబ్బంది. అయితే ఉద్యోగుల తొలగింపు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందన్న అనుమానం తో నోటీసులు జారీ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే వాటిలో కొన్నింటిని రద్దు చేశారని తెలిసింది. సీడీసీ కార్యాలయాలన్నింటినీ మూసివేసి, వాటిలో పనిచేస్తున్న వందలాది ఉద్యోగులను ఇంటికి సాగనంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం షట్‌డౌన్ అయితే ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగిస్తానని దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. వాషింగ్టన్ కార్యాలయం సహా అనేక యూనిట్లలోని ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన ట్రంప్ ప్రభుత్వం వారి జాబితాను కూడా సిద్ధం చేసింది. అందులో భాగంగానే తొలగింపులు మొదలుపెట్టింది. తాజా లేఆఫ్‌లకు డెమొక్రాట్లే బాధ్యత వహించాలని ట్రంప్ ఆరోపించారు. కాగా యూనిట్లలో పనిచేస్తున్న 90 మంది సిబ్బందికి పంపిన నోటీసులను ఆ తర్వాత రద్దుచేశారు. సీడీసీలో ఉద్యోగులను తొలగించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో 2,400 మంది ఉద్యోగా లను ఊడబెరికారు. వీరిలో 942 మందికి మాత్రమే ఆ తర్వాత తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు.