కాంగ్రెస్-బీఆర్‌ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు
సవాల్‌కు సమాధానం చెప్పేందుకు వస్తే అడ్డుకున్నారు : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
రాజకీయాల పేరుతో యువతకు డ్రగ్స్ అలవాటు : యూత్ కాంగ్రెస్
నవతెలంగాణ- హయత్‌నగర్
మొయినాబాద్ డ్రగ్స్ ఘటన నేపథ్యంలో ఎల్‌బీనగర్ చౌరస్తా వద్ద ఉగాది పర్వదినాన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు ‘డ్రగ్ టెస్ట్’ పేరిట ‘సే నో డ్రగ్స్’ అంటూ ‘వైట్ ఛాలెంజ్’ సవాల్ విసిరారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు బీఆర్‌ఎస్ నాయకులు రావాలని మీడియా ద్వారా కోరారు. దీనికి స్పందించిన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని కొద్ది దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు పోలీసులను ద్వారా బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. సవాల్ విసిరిన తర్వాత సమాధానం చెప్పేందుకు వస్తే వెనక్కి తగ్గడం కాంగ్రెస్ నాయకుల వైఫల్యాన్ని చూపుతోందన్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి, చిల్లర రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.
ఎల్‌బినగర్‌లో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సవాళ్లు విసిరిన తర్వాత కార్యకర్తలకు అండగా నిలువకపోవడం బాధాకరమన్నారు. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా డ్రగ్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తమతో ఉన్న కార్యకర్తలపై పూర్తి విశ్వాసం ఉందని, వారికి ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పారు. డ్రగ్స్ సంస్కృతిని తమ పార్టీ ఎప్పటికీ ప్రోత్సహించదని తెలిపారు. అలాగే, తమ నాయకులు కేటీఆర్‌పై చేసిన డ్రగ్స్ ఆరోపణలు కూడా నిరాధారమని, ఆయన కూడా ఎప్పుడైనా పరీక్షలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు స్పందించకుండా మౌనం వహిస్తున్నారని విమర్శించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
పిల్లలను డ్రగ్స్‌కు బానిసను చేస్తున్న ఎమ్మెల్యే : యూత్ కాంగ్రెస్
రాజకీయాల పేరుతో యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. డ్రగ్స్ తీసుకునే వారికి బీఆర్‌ఎస్ నిలయంగా మారిందని విమర్శించారు. గతంలో యూత్ కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని లీడర్‌గా ఎదిగిన సుధీర్‌రెడ్డి ఇప్పుడు యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో రాజకీయంగా గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’తో ఎల్‌బీనగర్ చౌరస్తా ఉద్రిక్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



