– విందులు, వినోదాలు, సంగీత కచేరీలకు కేంద్రంగా ఫతే మైదాన్
– ఆటేతర కార్యక్రమాలతో నిలిచిన క్రికెట్, ఫుట్‌బాల్ సాధన
– క్రీడాకారుల తీవ్ర ఆగ్రహం.. అయినా పట్టించుకోని క్రీడాశాఖ
ఎల్బీ స్టేడియం అనగానే అదో చారిత్రక క్రీడా మైదానం అనుకుంటే పాట కచేరిలో శృతి కలిపినట్టే!. ఎల్బీ స్టేడియం ఇప్పుడు సరికొత్త చిరునామా సంపాదించుకుంది. క్రీడాభివృద్ధిపై చిత్తశుద్ధి లేని పాలకుల చర్యలతో విందులు, వినోదాలు, పాట కచేరీలు, రాజకీయ సభలు, మతపరమైన వేడుకలకు ఎల్బీ స్టేడియం వేదికగా మారింది. ఎల్బీ స్టేడియానికి క్రీడా పోటీల కోసం కాకుండా వినోద వేడుకలకు హాజరవ్వటం పరిపాటి అయిపోయింది.
నవతెలంగాణ-హైదరాబాద్
ఎల్బీ స్టేడియం ఓ క్రీడా సముదామం మాత్రమే కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లకు ఆతిథ్యమిచ్చిన చారిత్రక వేదిక. ఎల్బీ స్టేడియంలోనే క్రీడా ఓనమాలు నేర్చుకుని.. ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన ఎంతో మంది తెలుగు క్రీడాకారులకు ఇదోక ప్రత్యేక క్రీడా విద్యాలయం!. గత పాలకుల నిర్లక్షంతో మౌళిక సదుపాయాలు లేక, గత వైభవం కోల్పోయిన ఎల్బీ స్టేడియం.. ప్రస్తుత పాలకుల అశ్రద్ధ, అలక్ష్యంతో ‘వినోద వేడుకలకు అద్దె స్టేడియం’గా మారింది.
ఇంకెక్కడి ఫతే మైదాన్
ఆగస్టులో ఎల్బీ స్టేడియం రెండు ప్రయివేటు కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. తొలుత ఓ మతపరమైన సంస్థ సమావేశం జరుగగా.. తాజాగా ఓ టెలివిజన్ చానల్ ‘ఫోక్ నైట్’ నిర్వహించింది. ఇటీవల భారీ వర్షాలతో స్టేడియం గ్రౌండ్ పూర్తిగా తడిసిపోయింది. శనివారం నాటి జానపద కచేరీ వేదిక నిర్మాణం కోసం భారీ వాహనాలు, క్రేన్లు వినియోగించారు. అప్పటికే పూర్తిగా తడిసిన మైదానం.. భారీ వాహనాల రాకపోకలతో మట్టి రోడ్డు కంటే దారుణంగా తయారైంది. వరుస ఈవెంట్లతో ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్, క్రికెట్ సాధన నిలిచిపోయింది. జాతీయ క్రీడా దినోత్సవం ముంగిట క్రీడాకారులు సాధన చేసేందుకు అనువైన ఏర్పాట్లు చేయాల్సిన శాట్జ్ అధికారులు.. గ్రౌండ్‌ను అద్దెకు ఇచ్చి చోద్యం చూస్తున్నారు. భావి చాంపియన్లను స్టేడియం నుంచి బయటకు పంపించి.. క్రీడా దినోత్సవం స్ఫూర్తి తమదైన శైలిలో చాటుతున్నారు. భారీ గుంతలు, బురద, చిత్తడిగా మారిన మైదానం, పూర్తిగా ధ్వంసమైన క్రికెట్ పిచ్‌తో ఇంకెక్కడి ఫతే మైదాన్ అంటూ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతా మా ఇష్టం!
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా సాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ బడ్జెట్‌లో గణనీయంగా కేటాయింపులు పెరిగినా.. స్టేడియాలను క్రీడా దేవాలయాలుగా తీర్చిదిద్దటం మరిచి వినోద వేదికలుగా మార్చటంలో బిజీగా ఉంది. క్రీడలకు బడ్జెట్ లేని వేళ నాన్ స్పోర్ట్స్ ఈవెంట్లకు అద్దెకు ఇవ్వటం మొదలవగా.. ఇప్పుడూ అదే పద్దతి కొనసాగుతుంది. వైఏటీ జీవో నం.20 ప్రకారం స్టేడియాలను కిరాయికి ఇచ్చే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఎల్బీ స్టేడియం సహా ఇతర స్టేడియాలను ప్రయివేటు వ్యక్తులు, ప్రయివేటు సంస్థలకు క్రీడా పోటీల నిమిత్తం కిరాయికి ఇవ్వటంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ, అంతంత మాత్రంగా ఉన్న క్రీడా మౌళిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం అయ్యే దుస్థితికి దాపురించే వినోద వేడుకలకు అద్దెకు ఇవ్వటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో గచ్చిబౌలి స్టేడియంలో సంగీత కచేరిలు నిర్వహించటంపై క్రీడాకారులు, ప్రజలు మండిపడ్డారు. అయినా, శాట్జ్ యంత్రాంగం పట్టించుకోవటం లేదు. స్టేడియాలు ఉన్నది ఆటలకు కాదు పాటలకు అన్నట్టు వ్యవహరిస్తోంది.
సమస్య పట్టని క్రీడా సంఘాలు
క్రీడా మైదానాలు రాష్ట్ర క్రీడాకారుల ఆస్తులు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద, నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే ఎక్కువగా ప్రభుత్వ క్రీడా మైదానాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రయివేటు కార్యక్రమాలతో ఎల్బీ స్టేడియంలో సాధన చేస్తున్న క్రీడాకారులు నెలలో 15 రోజులు శిక్షణకు దూరమవుతున్నారు. ప్రయివేటు ఈవెంట్ నిర్వహణకు ముందు వారం రోజులు ఏర్పాట్లు, ఈవెంట్ తర్వాత వారం రోజులు సామాగ్రి తరలింపు సహా మైదాన పునరుద్ధరణతో క్రీడాకారులు ప్రాక్టీస్‌కు దూరం అవుతున్నారు. క్రీడాకారులు, తల్లిదండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిగులుతోంది. క్రీడా మైదానం కండ్లముందే ధ్వంసం అవుతుంటే ప్రశ్నించి, పోరాడాల్సిన తెలంగాణ ఒలింపిక్ సంఘం, రాష్ట్ర క్రీడా సంఘాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) అధికారులు పాట కచేరీ ఈవెంట్ ఉచిత పాస్‌లపై ధ్యాస పెడుతున్నారే తప్ప.. ఫతే మైదాన్ బాగు కోసం ఒక్క క్షణమైనా ఆలోచన చేయకపోవటం శోచనీయం.
చెప్పేదొకటి.. చేసేదొకటి..
‘ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల?’ తెలంగాణ క్రీడామంత్రిత్వ శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) కోసమే వేమన మహాకవి రాసినట్టు ఉంది. క్రీడాభివృద్ది మా లక్ష్యం అంటూ చెబుతూనే.. క్రీడా మైదానాల విధ్వంసానికి మౌన సాక్షిగా మిగలటం క్రీడాప్రాధికార సంస్థకే (శాట్జ్) చెల్లింది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏకంగా తొమ్మిది రోజుల కార్యక్రమాలను రూపొందించిన క్రీడాశాఖ.. ఇదే సమమంలో స్టేడియాలను పట్టించుకోవటం మానేసింది. భావి చాంపియన్లను బాల్యంలోనే అన్వేషించాలని ఉపన్యసించిన క్రీడామంత్రి.. ఆ భావి చాంపియన్లను గ్రౌండ్స్‌కు దూరం చేస్తుంటే మాత్రం మిన్నకుండిపోయారు. ఎల్బీ స్టేడియాన్ని జానపద పాట కచేరీకి అద్దెకు ఇచ్చి.. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనిబాల దేవి ప్రారంభించారు. రాష్ట్రాన్ని క్రీడల్లో అగగ్రామిని నిలిపేందుకు నూతన క్రీడా విధానం, స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ అకాడమీలు, ఒలింపియన్ల మెంటార్‌షిప్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం.. రాష్ట్ర క్రీడారంగానికి తలమానికమైన ఎల్బీ స్టేడియంను ఉద్దేశపూర్వకంగా గాలికొదిలేసింది.