ఆగుతున్న సాంచెల సప్పుళ్లు
వడ్డీలు కట్టలేక ఇక్కట్లు
అమల్లోకి రాని సర్కారు హామీ
అర్హుల జాబితా కుదింపుతో దిగాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నేతన్నల రుణమాఫీ అమల్లోకి రాలేదు. రెండేండ్లుగా చేనేతరంగం ఈ హామీ అమలు కోసం ఎదురుచూస్తోంది. అసలు అలాగే ఉంది. వడ్డీల భారం మాత్రం పెరుగుతూ ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లోని అప్పులతో పాటు ప్రయివేటు రుణాలు నేతన్నలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేనేతనే నమ్ముకున్న కుటుం బాలు ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడు తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తమను ఆదుకోవాలని ప్రభుత్వంవైపు దీనంగా చూస్తున్నాయి. గతంలో ప్రకటించిన ఆర్హుల జాబితాను షరతుల పేరుతో కుదించడం ఇప్పుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది. దాన్ని పరిష్కరించాలని నేతన్నలు కోరుతున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాంచాల చప్పుళ్లతో కళకళలాడే నేతన్నలు..ఇప్పుడు అప్పుల బాధలతో వేదన పడుతున్నారు. రంగు రంగుల చీరలు నేసే ఆ మగ్గాలు.. బ్యాంకు, ప్రయివేటు అప్పులు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నాయి. రాట్నాలు ఒడికే ఆ చేతులు.. సర్కార్ హామీలో భాగమైన రుణ మాఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నేతన్నల దుస్థితి ఇది. ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తామని హామీనిచ్చింది. దీని అమలులో తీవ్ర జాప్యం జరిగి, వడ్డీ భారం పెరుగుతోందని కార్మికులు వాపోతున్నారు. రూ.లక్షకు పైగా రుణం తీసుకున్న వారు ఆపై మొత్తాన్ని జూలై నెలాఖరులోగా చెల్లిస్తే వారందరికీ రుణమాఫీ అవుతుందని అధికారులు చెప్పడంతో చాలామంది అప్పు తెచ్చి రుణం చెల్లించారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో కార్మికుల ఖాతాలోంచి మూడు నెలల వడ్డీని కట్ చేసుకున్నారు. మరోవైపు బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.
లబ్దిదారుల ఎంపికపై అసంతృప్తి
2017 ఏప్రిల్ 1నుంచి 2024 మార్చి 31 వరకు రుణం తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. 2016లో గానీ, 2024 ఏప్రిల్ తర్వాత గానీ తీసుకున్న రుణాలు పరిగణనలోకి రావు. అయితే బ్యాంకు రుణమే తప్ప, ఇతర కో-ఆపరేటీవ్ రుణాలకు ఇది వర్తించదు. ఇలాంటి షరతులు ఎక్కువగా ఉండటం, పథకానికి అర్హత నిరూపించుకొనేందుకు అనేక డాక్యుమెంట్లు, పత్రాలు అవసరం కావడంతో గ్రామీణ చేనేత కార్మికునికి ఈ డాక్యుమెంట్లను పొందటం కష్టంగా మారింది. ఫలితంగా లబ్దిదారుల సంఖ్య తగ్గిపోయింది. ఉత్పత్తి కొనసాగుతున్నట్టు పత్రాలు, ఆధార్, బ్యాంకు అకౌంట్, జీఎస్టీ నమోదు తదితర పత్రాలు ఉంటేనే రుణ మాఫీ వర్తిస్తుందని అధికారులు చెప్పటంతో చాలా మంది నేతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్న చిన్న వ్యక్తిగత రుణాలు తీసుకుని చితికిపోయిన కార్మికుల ఆవేదన వర్ణనాతీతం.
తిరస్కరణలే అధికం
రాష్ట్రంలో చేనేత కార్మికుల సంఖ్య 2013 అంచనాల ప్రకారం 2 లక్షల 12వేలు. మొత్తం రుణ గ్రహితల సంఖ్య 32,476. రుణమాఫీకి ప్రభుత్వం కేటాయించిన మొత్తం రూ.33కోట్లు. అంటే లబ్దిదారులకు సగటు మాఫీ రూ. 10,200మాత్రమే. మొత్తంగా లబ్దిదారుల్లో 28శాతం మందికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. కాగా, దీనిలో తిరస్కరించిన దరఖాస్తులు సగానికి పైగా ఉండటం గమనార్హం. సిరిసిల్లా జిల్లాలో మొత్తం 6,245 దరఖాస్తులు అందాయి. వాటిలో ఆమోదం పొందినవి కేవలం 2,312 మాత్రమే. తిరస్కరణకు గురైనవి 3,933 ఉన్నాయి. గద్వాల జిల్లాలో మొత్తం దరఖాస్తులు 3,110కాగా, ఆమోదం పొందినవి 1,225 మాత్రమే. తిరస్కరించిన దరఖాస్తులు 1, 885. వరంగల్ జిల్లాలో మొత్తం దరఖాస్తులు 5,320 కాగా, 2,998 ఆమోదం పొందాయి. 2,322 దరఖాస్తుల్ని తిరస్కరించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం దరఖాస్తులు 4,789 కాగా, లబ్దిదారుల సంఖ్య 2,308మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి పరిశీలించి, నేతన్నలు రుణ విముక్తి చేయాలని కోరుతున్నారు.
జీవో జారీ అయినా అమల్లో జాప్యం
గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఎన్‌ఐహెచ్‌టీ) ప్రారంభోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జీవో 56ను జారీ చేసింది. 2025-26 బడ్జెట్ నుంచి 33 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 14 నెలలు గడిచినా చేనేత రుణమాఫీ అమలుకు నోచుకోలేదు.
నిర్లక్ష్యం వద్దు
రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం తగదు. కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి. నేతన్నలకు రుణమాఫీ ప్రకటించి ఏడాది దాటినా, ఇప్పటికీ అమలు చేయలేదు. రకరకాల కొర్రీలు పెట్టి దరఖాస్తుల సంఖ్యను కుదిస్తున్నారు. బ్యాంకుల కిస్తీలు కట్టలేక నేతన్నలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ అవుతుందనే అశతో ఉన్నారు. బ్యాంకులతో పాటు ప్రయివేటు మిత్తీలు తలకుమించిన భారంగా మారాయి. ప్రభుత్వం తక్షణం ఎలాంటి షరతులు లేకుండా నేతన్నలకు రుణమాఫీని వర్తింపచేయాలి.
వనం శాంతికుమార్, అధ్యక్షులు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం



