ఫ్యూచర్ విలేజ్లుగా మార్చాలి
పట్టణాలకు సమానంగా గ్రామాలలో సదుపాయాలు కల్పించాలి
నవతెలంగాణ – మిర్యాలగూడ
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకులను సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) అభ్యర్థులు నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్నారనిచ, ప్రజా సేవకులుగా నిలిచే సీపీఐ(ఎం) అభ్యర్థులను సర్పంచి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాలలో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని, ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) నాయకులను గెలిపించాలని కోరారు.
అదేవిధంగా సీపీఐ(ఎం) మద్దతుతో నిలిచిన అభ్యర్థులను గెలిపించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. డబ్బు మద్యానికి ప్రలోభాలకు గురై ఓటును అమ్ముకోకూడదని సూచించారు. తాత్కాలిక ప్రయోజనాలకు ఓటును అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుందని ఓటర్లు గుర్తించుకోవాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని సూచించారు. ఇప్పుడు వరకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని రెండు సంవత్సరాల పాటు ప్రత్యేక అధికారుల పాలన నడవడంతో గ్రామాలలో సమస్యలు తీవ్రంగా తిష్ట వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యూచర్ సిటీ మాదిరిగానే ఫ్యూచర్ విలేజ్ గా మార్చేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల మాదిరిగానే గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దేశంలో కేరళ రాష్ట్రంలో మాదిరిగానే స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వాలని బడ్జెట్లో సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ప్రజల కోసం పనిచేసే నాయకులకు గెలిపించుకున్నట్లయితే గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వినోద్ నాయక్, నాయకులు బొచ్చు కోటి రెడ్డి, ఉన్నాం వెంకటేశ్వర్లు నాగయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.



