Saturday, May 10, 2025
Homeప్రధాన వార్తలుసన్నాల వైపే మొగ్గు

సన్నాల వైపే మొగ్గు

- Advertisement -

– వానాకాలంలో 1.34 కోట్ల ఎకరాల్లో సాగు
– గతేడాది కంటే నాలుగు లక్షల ఎకరాల్లో పెరిగే అవకాశం
– పెరగనున్న పత్తి సాగు
– పది లక్షల ఎకరాల్లో కూరగాయలు, ఉద్యాన పంటలు
– సరిపడా విత్తనాలు సిద్ధం
– సాగు ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ శాఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నవడ్ల వైపే రైతులు మొగ్గుచూపే అవకాశం ఉందని వ్యవసాయ సాగు ప్రణాళిక అంచనా వేసింది. కోటీ 34 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని తెలిపింది. గత వానాకాలం సీజన్‌తో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం సుమారు 4లక్షల ఎకరాలకుపైగా పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా. అందులో అత్యధికంగా 66.80 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతాయని పేర్కొంది. ఈ మేరకు వానాకాలం సీజన్‌ సాగు ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. పౌరసరఫరాల శాఖ పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం, క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వడంతో సన్నాలకు గిరాకీ పెరగనుంది. అంతేకాక సన్నాలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయడం కలిసొచ్చే అంశంగా కనిపిస్తున్నది. సన్నాల సాగు 60 నుంచి 70 శాతానికిపైగా ఉండొచ్చని ప్రభుత్వం చెబుతోంది. గత సంవత్సరం వానాకాలం సీజన్‌లో 65.49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 30 శాతం వరకు సన్న రకాల వరినే సాగు చేశారు. రాష్ట్రంలో వరి తర్వాత పత్తి సాగు రెండోస్థానం ఉంటుంది. ఈసారి పత్తి సాగు విస్తీర్ణం కూడా పెరగనున్నట్టు అంచనా వేసింది. కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలు కలిపి 10లక్షల ఎకరాల వరకు ఉండొచ్చని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేసినట్టు తెలిసింది.
నాణ్యమైన విత్తనం ద్వారా అధిక దిగుబడి
నాణ్యమైన విత్తనం ద్వారానే అధిక పంటల దిగుబడి వస్తోందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతుంది, అందుకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు కావాలి.. అనే విషయాన్ని కూడా వ్యవసాయ సాగు ప్రణాళిక పేర్కొంది. రాష్ట్రంలో వచ్చే వానాకాలం 68.80 ఎకరాల వరి సాగుకు 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే మార్కెట్‌లో 75లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. వాటిలో తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ 17,790 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్టు తెలిపింది. నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ 9,500 క్వింటాళ్లను సిద్ధం చేసింది. ఇక ప్రయివేటు సంస్థలు 18.52 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచాయి. పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే అందుకవసరమయ్యే 45వేల క్వింటాళ్ల విత్తనాలకు గాను ప్రయివేటు పత్తి సీడ్‌ కంపెనీలు ఏకంగా 1.34 లక్షల క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలను సిద్ధంగా ఉంచాయి. మొక్కజొన్న ఆరు లక్షల ఎకరాల్లో సాగైతే, అందుకు 48వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ తేల్చింది. ఇవి కాకుండా కందులు, పెసలు, మినుములు, జొన్నలు, వేరుశనగ, ఆముదం, నువ్వులు తదితర పంటల విత్తన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.
నకిలీ విత్తన సరఫరాదారులపై కొరడా
ప్రతియేటా నకిలీ విత్తనాలతో రైతులు నాలుగైదు లక్షల ఎకరాల్లో పంట నష్టపోతున్నారు. వీటిలో జర్మినేషన్‌ 60శాతంలోపే ఉంటుంది. గతంలో విత్తన ద్రువీకరణ పత్రాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చేది. కానీ ఇటీవల ప్రయివేటు సంస్థలకు అప్పగించారు. దీంతో ఆయా కంపెనీలు విత్తనాలు అమ్ముకునేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ విత్తన సరఫరాదారులపై ముందస్తుగా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఇటీవల ములుగులో మొక్కజొన్న పంటను తిన్న పశువులు చనిపోయాయి. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈసారి నకిలీ విత్తనాలు ఇస్తే లైసెన్స్‌ రద్దు చేస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
తెలంగాణ పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో రైతులు కూడా పత్తి సాగు చేస్తున్నారు. పత్తికి మద్దతు ధర లభించడం, పెరుగుతున్న డిమాండ్‌తో రాష్ట్రంలో గత వానాకాలంలో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నది. అది ఈసారి 50లక్షలకు ఎకరాల చేరుకోనుంది. గతేడాది ఎక్కువ మంది రైతులు పత్తికి బదులు వరి, ఇతర పంటల వైపు దృష్టి పెట్టడంతో పత్తి పంట విస్తీర్ణం తగ్గింది. అయితే పంట దిగుబడి వచ్చిన తర్వాత సీసీఐ రైతుల నుంచి క్వింటాలు పంటకు రూ.7,521 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసింది. పత్తి రైతుకు లాభం తగ్గినప్పటికీ, విదేశీ మార్కెట్లో కూడా పత్తికి డిమాండ్‌ ఉండడంతో వానాకాలంలో రైతులు తెల్ల బంగారం వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. ప్రతి ఏటా సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా పెట్టడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఒక్కొక్కసారి దళారులు, వ్యాపారులు, సీసీఐ, మార్కెటింగ్‌ శాఖకు చెందిన అధికారులు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన సంఘటనలూ ఎన్నో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -