నవతెలంగాణ – దుబ్బాక : విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలను పెంచేందుకు గాను సరికొత్త రీతుల్లో విద్యాబోధనను అందించే గురుతర బాధ్యత ప్రతి ఉపాధ్యాయుని పైన ఉందని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మండల పరిధిలోని అప్పనపల్లి, హసన్ మీరాపూర్ యుపీఎస్, పెద్దగుండవెల్లిలోని ఎంపీపీఎస్, ఎంపీపీఎస్ వడ్డెరవాడ, జెడ్పీహెచ్ఎస్, పద్మశాలి గడ్డ పరిధి నర్లెంగడ్డ ఎంపీపీఎస్ ను, మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లాయిపల్లి వార్డుల్లో ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్, దుబ్బాక పట్టణంలోని కేజీబీవీ లను ఎంఈఓ జే.ప్రభుదాస్, మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ తో కలిసి డీఈఓ సందర్శించారు.
ఆయా పాఠశాల విద్యార్థుల్ని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజన నాణ్యతను, అమలుజరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. దుంపలపల్లి ఎంపీపీఎస్ విద్యార్థులకు అదే వార్డుకు చెందిన ఎర్వ అజయ్ అనే యువకుడు స్టీల్ ప్లేట్లను డీఈవో చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్ ని అభినందించారు. వారి వెంట ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పలువురున్నారు.