ఉద్యోగ భద్రతకు ‘నైపుణ్యాభివృద్ధి’ తప్పనిసరి
జీతంలో పది శాతమైనా నేర్చుకోవడానికి వెచ్చించాల్సిందే
అప్‌స్కిల్లింగ్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమే
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. డిగ్రీతో చదువు పూర్తయ్యే కాలం పోయింది. ఉద్యోగం దక్కాలన్నా.. దక్కిన ఉద్యోగం నిలబడాలన్నా.. కెరీర్‌లో ఎదగాలన్నా.. నిలకడైన నైపుణ్యాభివృద్ధి (అప్‌స్కిల్లింగ్) తప్పనిసరి. ఉద్యోగ మార్కెట్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి. మనకున్న నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. పోటీ ప్రపంచానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు నిపుణులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన కొత్త కోర్సులను చేయడంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. ఇందుకు.. వచ్చే జీతంలో కనీసం పది శాతమైనా ‘నేర్చుకోవడం’పై పెట్టుబడిగా పెట్టాలని సూచిస్తున్నారు. ఇప్పుడు అభ్యాసంపై చేసే ఖర్చు భవిష్యత్ ఉద్యోగ భద్రతకు కొత్త బీమా అని వివరిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందాలంటే అందుకు తగిన అర్హతతో పాటు నైపుణ్యాలను కలిగి ఉండాలి.
ప్రభుత్వాలు, విద్యాసంస్థల నిర్లక్ష్యం కారణంగా తగిన నైపు ణ్యాలు లేని ఎంతో మంది యువత డిగ్రీలు చేసిన తర్వాత కూడా ఉద్యోగాలులేక ఖాళీగా ఉంటున్నారు. మరికొందరు తమ చదువుకు సంబంధంలేని పనులను చేస్తున్నారు. అయితే ఉద్యోగాలను పొందడం, దానిని నిలబెట్టుకోవడం కోసం కేవలం డిగ్రీల మీదనే ఆధారపడకుండా నైపుణ్యాలను పెంచుకోవడంపై యువత, ఉద్యోగులు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో వస్తున్న కొత్త మార్పులను గమనిస్తూ, ఉద్యోగ, ఉపాధులకు అవసరమైన కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవాల ని అంటున్నారు. ఈ విషయంలో ఒక ముందు చూపుతో వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఒక ఉద్యోగం చేస్తున్న సమయంలోనే తమకు వచ్చే జీతంలో ఎంతో కొంత కొత్త కోర్సులు నేర్చుకోవడానికి వెచ్చించాలని అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత సమయాన్నీ కేటాయించాలని చెప్తున్నారు. అలా చేయకపోతే కెరీర్ ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంటుందనీ, దాని ప్రభావం ఆ వ్యక్తి మీద ఆధారపడే మొత్తం కుటుంబం పైనా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా నేర్చుకోవడాన్ని ఒక ఖర్చుగా చూడకూడదనీ, భవిష్యత్ కోసం చేసే పెట్టుబడిలా భావించాలని టీమ్‌లీస్ ఎడ్‌టెక్ సీఈఓ శాంతను రూజ్ అన్నారు. ”అప్‌స్కిల్లింగ్‌ను అప్పుడప్పుడూ చేసే కోర్సుల్లా కాకుండా ప్రతినెలా ప్లాన్ చేసే ఖర్చుగా తీసుకోవాలి. దీని కోసం నెల ఆదాయంలో పది శాతం పక్కకు పెట్టాలి. కెరీర్ ప్రారంభ దశలో చిన్న కోర్సులు, మైక్రోక్రెడెన్సియల్స్ మంచిది. అనుభవజ్ఞులకు లీడర్‌షిప్, టెక్-స్పెషలైజేషన్ కోర్సులు సరిపోతాయి” అని చెప్పారు.
కోర్సులపై ఖర్చు.. భవిష్యత్ ఉద్యోగ భద్రతకు పునాది
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఏఐ ప్రస్తుత సంప్రదాయ నైపుణ్యాలను పూర్తిగా మార్చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం తప్పనిసరి అని నెక్ట్స్‌లీప్ సహవ్యవస్థాపకులు, సీఈఓ అరిందం ముఖర్జీ అన్నారు. ఇందుకు ఆన్‌లైన్‌లో ఉచిత కంటెంట్ చాలానే ఉన్నదని చెప్తున్నారు. రీల్స్, ఓటీటీలు, సోషల్‌మీడియాపై వెచ్చించే సమయంలో కొంత కొత్త నైపుణ్యాలను పొందే విషయంలో పెడితే ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. నైపుణ్యాల మెరుగుదలలో భాగంగా కోర్సులపై చేసే ఖర్చును భవిష్యత్ ఉద్యోగ భద్రతకు పునాదిగా మాత్రమే చూడాలని వీరు చెప్తున్నారు.
నిరంతర అభ్యాసంతో దీర్ఘకాలిక ఫలితాలు
కొత్త కోర్సులు చేయడం ద్వారా నిరంతరం నైపుణ్యాలను సంపాదించడం తప్పనిసరిగా మారింది. అయితే చేసే కోర్సులపై శ్రద్ధ పెడుతూ క్రమంగా నేర్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలని నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఖరీదైన కోర్సులు చేయడం కంటే.. చిన్నగా అయినా నిరంతరం నేర్చుకోవడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందని సూచిస్తున్నారు. వీటితో తక్షణ ఫలితాలు రాకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో ఇది ఉద్యోగ భద్రత, జీతంలో పెరుగుదల, నైపుణ్యాల్లో మార్పులకు కావాల్సిన సామర్థ్యాన్ని భర్తీ చేస్తుందని వివరిస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఇక ఉద్యోగ అవకాశాలపై ప్రత్యక్ష ప్రభావమున్న ఏఐ, మేనేజ్‌మెంట్, ఫ్యూచర్-జాబ్ ట్రెండ్ కోర్సులపై ప్రత్యేక దృష్టి సారించాలని శాంతను రూజ్ అన్నారు. నేడు తక్కువ ఖర్చులో కూడా హైబ్రీడ్ డిగ్రీలు, అప్రెంటైస్‌షిప్‌లు, మాడ్యులర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే కోర్సు తీసుకునే ముందు దానికయ్యే ఖర్చు, కాలపరిమితి, ఉద్యోగావకాశాల విషయంలో ఒక అంచనా వేసి ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. 44 శాతం ఉద్యోగ నైపుణ్యాలు వచ్చే ఐదేండ్లలో మారిపోతాయని, భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో నిలబడాలంటే నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం తప్పనిసరి అని అంటున్నారు.



