బుద్వేలులో హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
కార్యనిర్వాహక వ్యవస్థతో కలిసి పనిచేయాలి
అప్పుడే రాజ్యాంగం సజీవం: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ లక్ష్యాల విషయంలో ఏకీభవించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలనేవి ఐచ్ఛికం కాదనీ, అత్యవసరమేననీ, వాటిని బలోపేతం చేయటం తప్పనిసరి అని అన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయని ప్రశంసించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని బుద్వేల్‌లో రాష్ట్ర హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి జస్టిస్ సూర్యాకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హైకోర్టు సముదాయం దేశంలో నే అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోర్టు గదులు, పరిపాలనా భవనాలు, ఆర్కైవ్స్, నివాస మౌలిక సదుపాయాలు, శిక్షణా కేంద్రాలన్నింటినీ సకల సౌకర్యాలతో ఒకే ప్రాంగణంలో నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించటం అభినందనీయమన్నారు. న్యాయవ్యవస్థ తన సొంత నిబంధనల ప్రకారం, తన సొంత పరిధిలో పనిచేస్తుందని చెప్పారు. మనం సిద్ధాంతం నుంచి ఆచరణలోకి మారినప్పుడు సంస్థాగత స్వయం సమృద్ధి ఇలాగే ఉంటుందనీ, నేర్చుకోవడం మానేస్తే న్యాయవ్యవస్థ పరిణామం చెందడం కూడా ఆగిపోతుందని వివరించారు. హైకోర్టు ఆడిటోరియంలో జిల్లాల న్యాయ సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, పౌరుల కోసం న్యాయ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.
మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న సెంట్రల్ రికార్డ్ రూమ్ కూడా అంతే ముఖ్యమైనదనీ, భద్రపరిచిన, అందుబాటులో ఉన్న పూర్వ తీర్పులు, ఆ తర్వాత వచ్చే ప్రతి తీర్పునూ బలోపేతం చేస్తాయని చెప్పారు. దీనికి తగినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వటం హర్షణీయమంటూ ప్రభుత్వ ప్రణాళికను ప్రసంసించారు. సుస్థిర మౌలిక సదుపాయాలను మొదటి నుంచే డిజైన్‌లో పొందుపరిచారన్నారు. ఈ భవనం తరతరాల న్యాయమూర్తులకు, వ్యాజ్యదారులకు సేవలందించే ప్రాంగణం కాబట్టి ఈ భూమిని గౌరవించాలని సూచించారు. కొత్త భవనం కోసం వందెకరాలు కేటాయించడమేగాకుండా, ఈ ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే వందేండ్ల పాటు సేవలందించేలా రూపొందించిన ఈ కొత్త హైకోర్టు ప్రాంగణం రెండేండ్లలో పూర్తవుతుందని చెప్పారు. 2024లో శంకుస్థాపన చేసిన జోన్-1 పురోగతిపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ, జోన్-2 కూడా మరో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, ఉజ్జల్ భూయాన్, ఎస్‌వీ భట్టి, అలోక్ అరధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌కుమార్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రోడ్లు, భవనాల శాఖ సెక్రెటరీ వికాస్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌జీ కర్ణన్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఈ భవన నిర్మాణ డ్రాయింగ్‌లు, కోర్టు నమూనాలను సీజేఐ, సీఎం తదితరులు పరిశీలించారు.
ప్రార్థనా మందిరాలకంటే పవిత్రం : సీఎం రేవంత్‌రెడ్డి
కోర్టును నిర్మిస్తే ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించినట్టే. గుడి, మసీదు, చర్చి కంటే ఎక్కువగా అన్ని మతాల వారందరికీ ఇది ఒక పవిత్రమైన ప్రదేశం. తన ప్రజా జీవితంలో ఈ శంకుస్థాపన సందర్భాన్ని ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. ఏ నాయకుడి జీవితంలోనైనా కోర్టు సముదాయాన్ని నిర్మించటమనేది అరుదుగా జరుగుతుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు స్వయంప్రతిపత్తితో, పరస్పర ఆధారితాలుగా గౌరవంతో పనిచేస్తాయి. సామాన్య పౌరుడు న్యాయం కోసం తట్టే చివరి ద్వారం, ఆఖరి ఆశ్రయం న్యాయస్థానమే. నూతన హైకోర్టు సముదాయం న్యాయానికి ప్రతీకగా, ప్రజాస్వామ్యానికి క్రియాశీల జీవనాడిగా నిలవాలి.
రాబోయే వందేండ్లపాటు పేదలు, బలహీనులు, గొంతులేనివారు, అణగారిన వారు తమ వాణిని వినిపించుకోవడానికి వీలుగా ఈ న్యాయ దేవాలయం తన సేవలందించాలి. ప్రజాస్వామ్య విలువలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. న్యాయవ్యవస్థకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించటమనేది కార్యనిర్వాహకవర్గం ముఖ్యమైన బాధ్యత. కోర్టులోని అన్ని విభాగాలు పరస్పర గౌరవంతో కలిసికట్టుగా పనిచేయాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. తీర్పులు, తీర్మానాలకే కాకుండా, న్యాయవ్యవస్థ పరిశీలనలు, అభిప్రాయాలను కూడా గౌరవిస్తాం. హైదరాబాద్‌లోని ప్రస్తుత హైకోర్టు భవనానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అది వ్యాజ్యదారులు, న్యాయవాదులు, సిబ్బంది అవసరాలను మున్ముందు తీర్చలేవు. అందువల్లే అత్యాధునిక ప్రాంగణాన్ని నిర్మించేందుకు సంకల్పించాం.



