Wednesday, December 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాను వీడండి

అమెరికాను వీడండి

- Advertisement -

– అక్రమ వలసదారులకు ట్రంప్‌ ‘బంపర్‌’ ఆఫర్‌
– స్వచ్ఛందంగా దేశం విడిచి వెళితే
– మూడు వేల డాలర్ల ప్రోత్సాహకం
– ఉచిత విమాన టిక్కెట్‌… నో ఫైన్‌, నో పెనాల్టీ
వాషింగ్టన్‌ :
ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తూ తిరిగి స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లిపోయేందుకు సంసిద్ధత వ్యక్తం చేసే అక్రమ వలసదారులకు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ లోగా సీబీపీ వన్‌ యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి మూడు వేల డాలర్ల ప్రోత్సాహకాన్ని అందజేస్తామని, స్వదేశానికి చేరుకునేందుకు ఉచిత విమాన టిక్కెట్‌ ఇస్తామని ప్రకటించింది. అంతేకాక అనుమతించిన సమయం కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించినందుకు విధించిన జరిమానాలు, ఫైన్లను రద్దు చేస్తామని కూడా తెలిపింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళుతున్న అక్రమ వలసదారులకు ఇప్పటి వరకూ వెయ్యి డాలర్ల నగదు ప్రోత్సాహకం మాత్రమే ఇచ్చారు. తాజా ప్రకటనలో అది మూడు రెట్లు పెరిగింది.

ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారు ఎలాంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లాలని భావిస్తే ఆ ప్రక్రియ వేగవంతంగా, ఉచితంగా, తేలికగా జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్రమ వలసదారులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ సమాచారాన్ని అందజేస్తే సరిపోతుందని, వారికి నగదు ప్రోత్సాహకాన్ని, విమాన టిక్కెట్‌ను అందజేస్తామని చెప్పింది. ఈ ఆఫర్‌ హాలిడే సీజన్‌కే పరిమితమని తెలియజేసింది. స్వచ్ఛందంగా దేశాన్ని వదలి వెళ్లేందుకు ఇష్టపడక అక్రమంగా తిష్టవేసుకొని కూర్చునే వారిని అరెస్ట్‌ చేస్తామని, బలవంతంగా స్వదేశానికి తిప్పి పంపుతామని, తిరిగి అమెరికాలో ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధిస్తామని హెచ్చరించింది.

అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వదిలి వెళితే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు సుమారు 70 శాతం తగ్గుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న ఒక్కో వలసదారుడిని అరెస్ట్‌ చేసి, నిర్బంధించి, స్వదేశానికి తిప్పిపంపడం కోసం మే నాటికి 17,121 డాలర్లు ఖర్చయిందని చెప్పింది. జనవరి నుంచి 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -