భారత విద్యార్థులకు కొత్త కష్టాలు
కోర్సుల స్వరూపంపై అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారుల కొత్త నిర్వచనాలు
ఆందోళనలో పలువురు ఇండియన్ స్టూడెంట్స్
బెర్లిన్ : విదేశాల్లో భారత విద్యార్థులకు బహిష్కరణ భయాలు తీవ్రమవుతున్నాయి. అమెరికా నుంచి డీపోర్టేషన్‌ను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు ఇటు జర్మనీలోనూ అదే పరిస్థితి వెంటాడుతున్నది. ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లిన భారతీయ విద్యార్థుల కలలు ఇప్పుడు వీసా నోటీసులు, కోర్టు అప్పీళ్ళు, దేశ బహిష్కరణ భయాలుగా మారాయి. బెర్లిన్‌లోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ(ఐయూ)లో చేరిన విద్యార్థులు చట్టం ఉల్లంఘించకపోయినా.. తమ కోర్సుల స్వరూపంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు భిన్నమైన అర్థాలు ఇవ్వడంతో జర్మనీని విడిచి పెట్టాలని ఆదేశాలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తున్నది. జర్మనీలో చదువుకోవడమంటే నాణ్యమైన విద్య, అంతర్జాతీయ గుర్తింపు, మంచి ఉద్యోగ అవకాశాలు అని నమ్మి భారతీయ విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడికి వెళ్లారు. ఇందు కోసం లోన్లు కూడా తీసుకున్నారు. అయితే ఐయూ యూనివర్సిటీలోని హైబ్రిడ్, ఆన్‌లైన్‌కోర్సులు వీసా నిబంధనలకు సరిపోవని అధికారులు ఇప్పుడు చెప్తున్నారు.
దీనిని కారణంగా చూపుతూ జర్మనీని వీడాలంటూ భారతీయ విద్యార్థులను ఆదేశిస్తున్నట్టు సమాచారం. దీంతో తాజా పరిస్థితి అక్కడి భారతీయ విద్యార్థులకు షాక్‌కు గురి చేస్తున్నది. విద్యార్థులు తాము పూర్తి కాలం క్యాంపస్‌లో చదువుతున్న కోర్సులే అని భావించి చట్టబద్ధంగానే జర్మనీకి వెళ్లారు. తీరా ఇప్పుడు అధికారుల ఆదేశాలతో వారు ఆందోళనకు గురవుతున్నారు. విద్యాసంస్థలు, మధ్యవర్తులు, వలస నిబంధనలు.. ఇవన్నీ సమన్వయం లేకుండా పని చేయడం కారణంగానే విద్యార్థులు ఇలాంటి సంక్షోభంలో చిక్కుకుంటున్నారని యూనివర్సిటీ లివింగ్ సహ వ్యవస్థాపకులు మయాంక్ మహేశ్వరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెర్లిన్‌లో ఉన్న పలువురు భారతీయ విద్యార్థులు చట్టబద్ధంగా ఉంటూ, చదువుతున్నప్పటికీ.. పట్టా పొందే వరకు అక్కడ ఉండగలమా అనే అనిశ్చితిలో ఉన్నారు. ఇది ఒక యూనివర్సిటీ సమస్య కాదనీ, అంతర్జాతీయ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకు ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.


