అందుబాటులో ఉన్న ప్రయాణమార్గాల ద్వారా వెళ్లండి
అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి
భారత ఎంబసీ అడ్వయిజరీ..!
అమెరికా దాడుల భయం ఎఫెక్ట్
న్యూఢిల్లీ : అమెరికా హెచ్చరికలు.. ఇరాన్ బలమైన ప్రతిస్పందనలు.. వెరసి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం మధ్యప్రాచ్యంలో నెలకొన్నది. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడులు చేయొచ్చన్న అంచనాలు, అక్కడి విద్యార్థుల ఆందోళనల నడుమ ఇరాన్‌లో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరులకు అక్కడి ఇండియన్ ఎంబసీ తాజాగా అడ్వయిజరీ జారీచేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ”’ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వయిరీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు (విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు) కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్‌ను తక్షణమే విడిచిపెట్టి వెళ్లండి. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండండి” అని ఇండియన్ ఎంబసీ తన అడ్వయిజరీలో పేర్కొంది.
ఇరాన్‌లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సూచించింది. అలాగే తాజా పరిణామాల సమాచారం కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని వివరించింది. భారతీయులంతా పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ పత్రాలను ఎప్పుడూ తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి సాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఎంబసీ వద్ద పేర్లు నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని భారత ఎంబసీ సూచించింది.
గత కొంత కాలం నుంచి ఇరాన్-అమెరికా దేశాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు దేశాల మధ్య అణు చర్చలు ఇప్పటికీ కొలిక్కిరాని విషయం విదితమే. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇప్పటికే అమెరికా పలు విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్‌లను పశ్చిమాసియాలో మోహరించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రాజధాని నగరమైన టెహ్రాన్‌లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాలతో ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఇరాన్‌లో తొలిదశ అల్లర్లలోనే 7,105 మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికాకు చెందిన ఒక మానవ హక్కుల సంఘం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం అందరిలోనూ నెలకొంది.



